Tuesday, November 26, 2024

కాపుల హ‌క్కుల‌పై మాట్లాడిన – జి.వి.ఎల్ న‌ర‌సింహరావు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమాజంగా మిగిలిపోయింది,అయితే
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కాపులు విశేష కృషి చేశారు ..కానీ ఆంధ్రప్రదేశ్ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జి వి ఎల్ నరసింహారావు జీరో అవర్ లో ఈ స‌మ‌స్య‌ని లేవనెత్తారు. బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారు (1915 జిఓ నెం.67 ప్రకారం) కానీ 1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారు. 1956 నుంచి కాపులకు రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు, కాపులకు అన్యాయం చేశాయన్నారు. విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల కోసం తీవ్ర రాజకీయ ఆందోళనలు చేస్తూనే వున్నారు.

2017లో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు, 2017 పేరుతో ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ, బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపబడింది. ఇది అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తనంతట తానుగా చర్య తీసుకోవచ్చు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు,అయితే జాగరణ కోసం కాపుల బిల్లును కేంద్రానికి పంపారు. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై మోపాలన్నదే ఉద్దేశం అని ఆయన ఆరోపించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను నియమించి కాపులపట్ల తనకున్న అభిమానం, నిబద్ధతను భారతీయ జనతా పార్టీ చాటుకొందన్నారు .ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఆయన సభలో పేర్కొన్నారు. అలా చేయకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా జి వి ఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement