తన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకుని తనను బెదిరిస్తున్నారంటూ ఓ రైతు మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాళ్లపై పడ్డాడు. కబ్జాధారుల నుండి తన భూమిని తిరిగి ఇప్పించాలని బాధిత రైతు ఎమ్మెల్యేను వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన నియోజకవర్గ పరిధిలోని తాడికల్ గ్రామానికి విచ్చేశాడు. ఈ క్రమంలోనే ఆదెపు నర్సయ్య అనే రైతు ఎమ్మెల్యేకు తన గోడును తెలియజేస్తూ ఒక్కసారిగా ఆయన కాళ్లపైపడి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
తడికల్ గ్రామానికి చెందిన బాధితుడు ఆడెపు నర్సయ్య ప్రక్కన ఉన్న గ్రామమైన ముత్తారం శివారులో 2.15 ఎకరాల వ్యవసాయ భూమిని 2010 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుబుక్ ను కూడా ఇచ్చింది. లాగే రైతుబంధు డబ్బులు కూడా నా ఖాతాలోనే పడుతున్నాయని బాధిత రైతు ఎమ్మెల్యేకు తెలిపాడు. అయితే కొద్దినెలల కింద కొందరు తన భూమిని ఆక్రమించుకున్నారు… ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. తన భూమిలో అక్రమంగా వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. వారి నుండి భూమిని విడిపించి తనకు న్యాయం చేయాలని రైతు నర్సయ్య ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వేడుకున్నాడు. బాధిత రైతు భూమికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యేకు చూపించాడు. దీంతో వెంటనే స్పందించిన రసమయి ఈ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రైతును బెదిరించి అతడి భూమిని కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకొవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: జగన్కు కేసీఆర్ అంటే అభిమానం: ఏపీ డిప్యూటీ సీఎం