కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు రైతులు. సంవత్సరం పాటు కేంద్రంపై పోరాడి మూడుసాగు చట్టాల రద్దు డిమాండ్ ను సాధించుకున్నారు రైతులు. ఈ మేరకు రేపు ఛండీగడ్ లో రైతు నేత గుర్నాం సింగ్ చాదుని కొత్త పార్టీని ప్రకటించనున్నారని సమాచారం. గుర్నాం సింగ్ చాదుని సంయుక్త కిసాన్ మోర్చా కమిటీలో కీలకమైన నేత. కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఏర్పడ్డ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఆయన ఉన్నారు. తమ డిమాండ్లను సాధించుకోవడానికి 32 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా నడుచుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, పరిస్థితులు అదుపు తప్పినప్పుడూ ఎస్‌కేఎం స్పష్టంగా వైఖరి వెల్లడిస్తూ.. పట్టుసడలకుండా వ్యవహరించింది. సంక్షోభ పూరిత వాతావరణంలోనూ రైతు ఉద్యమం నెగ్గి నిలవడానికి ఎస్‌కేఎం అవలంబించిన విధానాలు ఆదర్శంగా సాగాయి. ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల డిమాండ్‌ను అంగీకరించి.. తర్వాత, కేంద్రం పార్లమెంటులో ఆ మూడు చట్టాలను రద్దు చేయడంతో రైతులు వెనుతిరిగారు.
ఢిల్లీ నుంచి వెనుదిరిగిన తర్వాత ఎస్‌కేఎంలోని 22 రైతు సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ఏ ఇతర ప్రధాన పార్టీకి మద్దతు తెలపకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎస్‌కేఎం విడిపోకుండా బలపడటానికి యోచనలు చేయాలనే చర్చలూ జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేపు గుర్నాం సింగ్ చాదుని కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. దీంతో వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పరిణామాలు ఎదురుకాబోతున్నాయి. కనీస మద్దతు ధర డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు యుధ్‌వీర్ సింగ్ వెల్లడించారు. ఈ కమిటీలో శివకుమార్ కక్కా, బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, గుర్నామ్ సింగ్ చాదుని, యుధ్‌వీర్ సింగ్ ఉన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కేంద్ర మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలిపారు. అందుకోసం రైతులు ఒక కమిటీగా కేంద్రాన్ని సంప్రదించాలని సూచనలు చేసినట్టు వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకే తాము ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..