Tuesday, November 26, 2024

31పైస‌లు కోసం రైతును ఇబ్బందిపెట్టిన బ్యాంక్ – చివాట్లు పెట్టిన కోర్టు

బ్యాంకుల్లో లోన్ తీసుకోవ‌డం రైతుల‌కు ప‌రిపాటే..అయితే ఇక్క‌డ ఓ రైతు బ్యాంకు వారికి ఇవ్వాల్సిన న‌గ‌దుని ఇచ్చినా 31పైస‌లు బాకీ ఉన్నాడ‌ని గ‌గ్గోలు పెట్ట‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది.ఈ సంఘ‌ట‌న గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ కు దగ్గర్లోని ఖోరజ్ లో చోటు చేసుకుంది. ఆ ఊరుకు చెందిన రైతు శ్యాంజీ భాయ్. ఆయన తన పేరు మీద ఉన్న కొంత భూమిని రాకేశ్.. మనోజ్ లకు అమ్మాడు. భూమిని విక్రయించటానికి ముందు ఈ భూమిపై శ్యాంజీ రూ.3 లక్షలు రుణం తీసుకున్నాడు. భూమిని అమ్మిన కొద్ది రోజులకే తాను బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును చెల్లించేశాడు. ఇదిలా ఉంటే.. భూమిని కొన్న వారు ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో తమ పేరును నమోదు చేసుకోవటానికి ప్రయత్నించారు.అప్పుకి సంబంధించి బ్యాంకు ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. బ్యాంకు వద్దకు వెళితే సమస్య పరిష్కారం కాకపోవటంతో భూమిని కొన్న కొత్త యజమానులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. భూమి పై ఉన్న అప్పు తీరిపోయిన తర్వాత కూడా నో డ్యూస్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా.. బ్యాంకు వారు ఇచ్చిన సమాధానం వింటే ఒళ్లు మండిపోక మానదు. నో డ్యూస్ సర్టిఫికేట్ ను సిస్టం జనరేట్ చేస్తుందని.. రైతు తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలు బకాయిలు ఉన్నాయని.. అందుకే సర్టిఫికేట్ ఇవ్వలేదని బ్యాంకు వర్గాలుపేర్కొన్నాయి.
ఈ సమాధానంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం యాభై సైసల కంటే తక్కువగా ఉన్న రుణం ఉంటే దాన్ని లెక్కలోకి తీసుకోరని.. రైతు అప్పు మొత్తం తీర్చినా సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని మండిపడింది. బ్యాంకు మేనేజర్ కోర్టు ముందుకు హాజరు కావాలని.. ఇది ప్రజల్ని వేధించటం కాక మరేంటంటూ దులిపేసింది. కేసును మే 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement