Tuesday, November 26, 2024

కుమారుల ఆదరణకు దూరం.. చితిపై ఓ కన్న తండ్రి బలవన్మరణం..

సొంతూరిని.. ఇంటిని వదలలేక.. తన చితిని తానే పేర్చుకుని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మాహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో గ్రామంలో జరిగింది. కాటికి కాళ్లు చాపిన కన్నతండ్రి ఆలనాపాలన కొడుకులకు బరువైంది. చెప్పుకోవడానికి నలుగురు కొడుకులున్నారు. తన ఆలనాపాలన చూడటానికి కన్నకొడుకులు చేసిన రభస ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. పుట్టిన ఊరు.. తన గూటిని వదిలిపెట్టి కొడుకుల దగ్గరికి వెళ్లలేకపోయాడు. తన బలగమంతా ఒక్కో చోట ఉండటంతో.. అసలైన బలగాన్ని వదల్లేక.. కన్నీళ్లే కంటతడి పెట్టే నిర్ణయం తీసుకున్నాడు. తను చనిపోతే చితి ఎవరు పెట్టాలి..? అంత్యక్రియలకు ఖర్చు ఎవరు భరించాలనే విషయంపై కూడా గొడవ పడతారేమోనన్న భయంతో.. ఆ కన్నతండ్రి తనకు తానే చితిపేర్చుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కానీ ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది. వివరాల్లో వెళితే.. పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు. ఓ కుమార్తె ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది.

కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలోనే కాపురం ఉండగా, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకటయ్య తనకున్న నాలుగెకరాల భూమి కుమారులకు పంచేశారు. 5 నెలల క్రితం వెంకటయ్య పోషణ నిమిత్తం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రిని పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. దీంతో సొంత ఊరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య చితి పేర్చుకుని మంటరాజేసి దానిలో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement