ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీలో సీట్ల మార్పిడి జగడాలు, జంజాటాన్ని క్యాష్ చేసుకోవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాటపడిపోతున్నారనే ప్రచారం పరవళ్లు తొక్కుతోంది. మీరు గెలవరు అని వైసీపీ సాగనంపుతుంటే.. వారినే తమ పార్టీలో చేర్చుకుని చంద్రబాబు ఏమి సాధిస్తారనేది పసుపు కోటలో మిలియన్ డాలర్ల ప్రశ్నం. ఇదేం వ్యూహం అంతుబట్టటం లేదని పసుపు సేన సైతం గుంపు చింపులు పడుతోంది. ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీ తిరస్కృత నేతలతో తమ ముఖ్య నేతల్ని టచ్ లోకి దించారని మీడియా కథలు తెరమీదకు వచ్చాయి. కనిగిరిలో శుక్రవారం రా కదలి రా సభలో.. చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తిని రగిల్చాయి. అంతే టీడీపీలో కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి.
వైసీపీలో అలకల పర్వం
ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీ సీట్ల మార్పు కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో సీట్లు రాని నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సీటు ఇవ్వటం లేదని ప్రచారం సాగుతోంది. మాగుంట పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఇప్పటికే ఆయన ఖండించారు. బాలినేనికి ఒంగోలు సీటు ఖాయమని చెబుతున్నా..ఇంకా అధికారికంగా ఖరారు కాలేదనే చర్చ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్టు సమాచారంతో బాలినేని శ్రీనివాస్ ఉలిక్కిపడినట్టు ప్రచారం. ఒంగోలు అసెంబ్లీకి శిద్దా రాఘవరావు కుమారుడిని పోటీచేయించాలని అధినేత జగన్ సూచన. . కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సీటు వ్యవహారం పైన స్పష్టత రాలేదు. తాజాగా బాలినేని-, మాగుంటతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల సీట్లు, భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చలు జరిపారు.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులతో శుక్రవారం జగన్ విడివిడిగా భేటీ అయ్యారు. . దర్శి టికెట్ ఇవ్వలేమని, ఒంగోలు లోక్‌సభ, ఒంగోలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని మద్ది వేణుగోపాల్కు వివరించినట్టు తాడేపల్లి దర్బార్ సమాచారం. తనతో చెప్పకుండా ఎన్నికల్లో పోటీచేయనని ఎందుకు ప్రకటన చేశారని ఎమ్మెల్యే రాంబాబును సీఎం జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పుల పైన ఇప్పటికే తొలి విడత కసరత్తు పూర్తయింది. అక్కడ సిట్టింగ్ ల్లో మార్పులు .జరిగితే.. ప్రత్యామ్నాయం సూచించాలని జగన్ కోరినట్టు సమాచారం.
ఇక టీడీపీ ఉబలాటం
ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ అంతర్గత అలజడిపై టీడీపీ అధినేత చంద్రబాబు. ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా కనిగిరి సభలో చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తనను, పవన్ ను తిడితే టికెట్ ఇస్తానంటూ జగన్ ప్రతిపాదన చేసారని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరస్కరించడం ఆ నేతల సంస్కారానికి నిదర్శనం. అందుకు అభినందిస్తున్నా, మీరూ అభినందించాలంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.ఎమ్మెల్యే అన్నా రాంబాబును పోటీ చేయలేని స్థితికి తీసుకువచ్చారని, . బాలినేనిని అడ్రస్‌లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాగుంట, మహీధరరెడ్డికి కితాబిస్తూ బాలినేని, రాంబాబుపైన చంద్రబాబు ఎలాంటి విమర్శలు చేయకపోవటంతో..ఇప్పుడు ప్రకాశం రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ మూడు, నాలుగుజాబితాలు వెలువడిన వెంటనే ప్రకాశం, నెల్లూరు జిల్లాలల్లోని కీలక వైసీపీ నేతలు సైకిల్ ఎక్కడం ఖాయమని, ముహుర్తం ఖరారైందని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఏ నిజమో? గానీ విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత చేపట్టిన మార్పుల కత్రువుతో.. తమకే లాభమని తెలుగుదేశం తెగ ఉబలాటపడుతోందంటే.. అతిశయోక్తి కాదు.