దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఇక రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల విజృంభిస్తున్నాయి. నగరంలో నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్కపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆస్పత్రులపై తాకిడి పెరిగింది. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్యం అందించిన వైద్యులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఏర్పడుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ మహమ్మారి మీద పోరాడుతున్న డాక్టర్ల మీద కొందరు దాడులు చేస్తున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేస్తుంటే.. ఇలా కొందరు తమపై దాడులు చేస్తున్నారు.
ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిపై కొందరు దాడికి పాల్పడ్డారు. అపోలో ఆసుపత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళా రోగి మరణించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు మూకుమ్మడిగా వచ్చి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్లు, నర్సులను కర్రలతో చితకబాదారు. అంతేకాదు ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసి, భవనం అద్దాలను పగులగొట్టారు. మరోవైపు కరోనా కష్ట కాలంలో ఎంతో శ్రమిస్తూ వైద్య సేవలు అందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం దారుణమని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ తో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే ఆమెకు చికిత్స అందించామని, అయితే, ఐసీయూలో బెడ్స్ కొరతతో ఆలస్యమైందన్నారు. ఇంతలోనే ఆమె మృతి చెందిందని తెలిపారు. దీంతో ఆమె బంధువులు తమ వైద్య సిబ్బందిపై దాడికి దిగారని, హాస్పిటల్ ఆస్తులకు నష్టం కలిగించారని ఆపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.