రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. వరుసగా 9వ రోజూ ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. ఉక్రెయిన్ కూడా అంతే దీటుగా ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలపై ఎదురు దాడి చేస్తోంది. అయితే రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం.. ఆ వార్తల ప్రచారం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టాలు చేస్తున్నాయి ఇరు దేశాలు. నిన్న రష్యా ఆస్తులను సీజ్ చేసుకునేందుకు ఉక్రెయిన్ పార్లమెంట్ చట్టం చేసింది. కాగా, ఇవ్వాల రష్యా కూడా అలాంటి చట్టం ఒకటి కొత్తగా తీసుకొచ్చింది. తమ సైన్యంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలుండేలా చేసిన చట్టానికి శుక్రవారం రష్యా పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం రష్యా సాయుధ దళాలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని జైలు శిక్ష విధించదగిన నేరంగా పరిగణిస్తారు.
రష్యా సైన్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ మేరకు రష్యా పార్లమెంటులోని దిగువ సభ ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్ కు తీవ్ర నష్టం జరుగుతోంది. అయినప్పటికి ఉక్రెయిన్ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడుతోంది. రష్యా సైన్యాన్ని, వారి యుద్ధ వాహనాలను ధ్వంసం చేస్తోంది. ఇప్పటిదాకా ఉక్రెయిన్ సైన్యం దాడిలో 9వేల 166 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. అంతేకాదు 251 రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని, 33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లను కూల్చేశామని తెలిపింది. తమ దాడుల్లో రష్యాకు చెందిన 105 ఫిరంగులు, 939 సిబ్బందిని తరలించే వాహనాలు, 50 క్షిపణి లాంచర్లు, 2 పడవలు, 404 కార్లు, 60 ఇంధన ట్యాంకులు, 3 డ్రోన్లు, 18 యుద్ధ విమాన వినాశక మిసైల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ చెప్పింది.
అయితే ఉక్రెయిన్ పై రష్యా సేనలు దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందస్తుగానే అన్ని రకాలుగా ప్రణాళికలు రూపొందించుకుంది రష్యా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. వాటిలో 230 ఉక్రెయిన్ లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా, 150 రష్యా భూభాగం నుంచి, 70 బెలారస్ నుంచి, మరికొన్నింటిని నల్ల సముద్రంలోని నౌకల ద్వారా రష్యా ప్రయోగించినట్లు తెలిపింది. వాటిని ఉక్రెయిన్ లోని క్షిపణి విధ్వంసక దళాలు ఎదుర్కొనే ప్రయత్నం చేశాయని చెప్పింది.