జగిత్యాల జిల్లా కోరుట్లలో నకీలీ పాస్‌పోర్టు దందా వెలుగులోకి వచ్చింది. ఏజెంట్ల ఇంట్లో.. సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్టు చెయ్యటంతో ఈ దందా అసలు విషయం వెల్లడయ్యింది. విచారణలో భాగంగా.. నకిలీ పాస్‌పోర్టులు, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్‌పోర్ట్ దందా మరువక ముందే మెట్‌పల్లిలోని ఓ గల్ఫ్ ఏజెంట్.. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకి చెందిన వారికి నకిలీ వీసాలు ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇదివరకు వచ్చిన వీసాలో ఫొటోలు, పేర్లు మార్చి.. నకిలీ వీసాలను తయారు చేసినట్లు సమాచారం. సుమారు 60 మందికి ఇవి అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీసాలు పొందిన చాలామంది వ్యక్తులు.. ఎయిర్ పోర్ట్ వరకూ వెళ్లాక నకీలీ వీసాలని తేలటంతో లబోదిబోమంటున్నారు. నకీలీ వీసాలు పొందిన చాలా మంది బాధితులు మెట్‌పల్లిలోని గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు ఆందోళనకి దిగారు.
ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు..
లైసెన్స్ లేని గల్ప్ ఏజెంట్ల విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. ఎవరూ పెద్దగా భయపడడం లేదు. జగిత్యాల జిల్లాలో గల్ఫ్‌కి వలసబాట పట్టినవారు లక్షకి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 30 వరకూ గల్ఫ్ ఏజెంట్ల సంస్థలు లైసెన్స్ కలిగి ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఇద్దరూ ముగ్గురు వరకూ.. గల్ఫ్ దందాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కేసులు నమోదు చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్లపై నామమాత్రంగా చర్యలు ఉండంతో నకీలీ పాస్‌పోర్ట్, నకీలీ వీసాలు దందా ఏళ్ల తరబడి జరుగుతోంది. దీంతో వీరి మాయలో పడి చాలామంది అమాయకులు మోసపోతున్నారు.