పంటల సాగులో వినియోగించే పలు పురుగుమందులను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ నిషేధం.. ప్రకటనలకే పరమితమైంది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు వాటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. నిషేధిత పురుగు మందులను ఇతర రాష్ట్రాల నుంచి బిల్లులు లేకుండా దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు రైతులకు అంటగట్టి అధిక లాభాలను అర్జిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో నకిలీ, నిషేధిత పురుగుమందులు స్వాధీనం చేసుకుంటున్నారే కాని కేసులు నమోదు చేయక పోవడంతో వ్యాపారులు షరామామూలుగా వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ములుగు జిల్లాలోని వాజేడు మండలవ్యాప్తంగా కల్తీ, నకిలీ, అనుమతి లేని, ప్రభుత్వం నిషేధించిన పురుగు మందులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగడంతో ఎరువులు, పురుగు మందులు, బయోల వాడకం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కల్తీ, నకిలీ వ్యాపారులు లాభాలు అధికంగా వచ్చే నిషేధిత, బిల్లులులేని పురుగుమందులను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుపు మందును నివారించే గ్లైసైడ్స్ అనే రసాయనిక పురుగు మందును నిషేధించారు. పర్యావరణానికి హాని కలుగుతుందని తయారీని నిలిపివేశారు. అయినా జిల్లాలో గ్లైసైడ్స్ కలుపు మందును యథేచ్ఛగా అమ్ముతున్నారు.
బిల్లులు లేని మందులు:
రాష్ట్ర ప్రభుత్వం సుమారు 75 – 80 బయో కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. మార్కెట్‌లో సుమారు 400 బయో కంపెనీలు తమ ఉత్పత్తులను ఇతర పేర్లతో మార్కెట్‌లో అమ్ముతున్నారు. పార్సిల్ కార్యాలయాలకు వచ్చే బాక్స్‌లకు సంబంధించి ఇన్‌వాయిస్ (రసీదు)లో ఒక పేరు ఉంటుంది. బాక్స్‌లోపల మరో రకం పురుగు మందు ఉంటుంది. కొన్ని కంపెనీల నుంచి బిల్లులు లేకుండా పురుగుమందులను దళారులు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. అధికారులు తనిఖీల్లో వాటిని గుర్తిస్తున్నారే కాని సీజ్ చేయడం లేదు. తాత్కాలికంగా అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు చెబుతూ స్టాప్ సేల్స్ ఇస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన యజమానులు, ప్రతినిధులు, దళారులు రంగంలోకి దిగి వ్యవసాయ శాఖ అధికారులను సంతృప్తి పరిస్తే స్టాప్ సేల్స్ తొలగిస్తారు.
వ్యవసాయ శాఖ అధికారులు సాంకేతికంగా చర్యలు తీసుకున్నట్లు నమ్మించడానికి స్టాప్ సేల్స్ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పురుగు మందుల వాడకం తక్కువ. దీంతో కొందరు వ్యాపారులు, ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పురుగు మందు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదాహరణకు లీటరు పురుగుమందు రూ.300 చొప్పున కంపెనీ వద్ద కొనుగోలు చేసి రైతుకు రూ.600 అమ్ముతారు. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పురుగు మందులకు బిల్లులు ఉండవు. అమాయక గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం చక్కగా కొనసాగిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.