వరంగల్ సిటీలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతని సహయకుడిని టాస్క్‌ఫో ర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ నకిలీ డాక్టర్ నుండి లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సేల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ సిటీకి చెందిన ముజతాబా ఆహ్మద్, దామెరకొండ సంతోష కుమార్ ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో అపేసి స్థానికంగా ఉన్న డాక్టర్ వద్ద సహాయకుడి పనిచేశాడు.
దీంతో తన ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో కొత్త ఆలోచన చేశాడు. దీనికి ప్రధాన నిందితుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ అవతారాన్ని ఎత్తాడు. ఎయిమ్స్ వైద్య విభాగం నుండి పట్టా పొందినట్టు తన పేరు మీద నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకున్నాడు. దీంతో మరో వ్యక్తి ల్యాబ్ టెక్నిషన్ అయిన సంతోష్ కుమార్‌తో కలిసి వరంగల్ సిటీ చింతల్ ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ స్టార్ట్ చేశాడు.
2018 సంవత్సరంలో ప్రారంభించి ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు వైద్యం అందించడంతో పాటు, తన ల్యాబ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. అదే విధంగా వైద్య పరీక్షల నెపంతో చికిత్స కోసం వచ్చిన వారిని భయభ్రాంతులను చేసి ఇతర హాస్పిటళ్లకు పంపించేవాడు. ఇట్లా ఇతర హస్పటల్స్ రోగులను పంపించినందుకు సదరు హాస్పిటల్ యాజమాన్యం నుంచి పెద్దమొత్తంలో కమీషన్లు స్వీకరించేవాడు.
నాలుగు సంవత్సరాలుగా సుమారు 43వేల మంది రోగులను ఇట్లా ట్రీట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నకిలీ డాక్టర్ వ్యహరానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఆదేశాలతో తనీఖీ నిర్వహించారు. దీంతో అతని అసలు వ్యవహారం బయటపడింది.