ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సరిగ్గా సరిపోతుంది. ఛాయ్ వాలా ప్రధాని కాకూడదా అనే నినాదంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన నరేంద్ర మోదీ.. ఇప్పటికి రెండుసార్లు ప్రధాని పదవిని అధిరోహించారు. కానీ కరోనా మహమ్మారి ఆయన పక్కలో బల్లెంలా యారైంది. కరోనా పట్ల మోదీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటూ దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో #ResignModi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కోట్లలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలను రెచ్చగొట్టేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగించాలని కేంద్రం ఆదేశించడంతో ట్విట్టర్ ఇప్పటికే కొన్ని ట్వీట్లను బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పోస్టులను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీంతో నెటిజన్లు ఫేస్‌బుక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్ మోడీకి మద్దతు పలుకుతుందని, ప్రభుత్వం ఒత్తిడి చేయడంతోనే ఫేస్‌బుక్ పోస్టులను డిలీట్ చేసిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫేస్‌బుక్ స్పందించింది. సాంకేతిక లోపం, పొరపాటు కారణంగా ‘#ResignModi’ అనే హ్యాష్ ట్యాగ్ డిలీట్ అయ్యిందే తప్ప, ప్రభుత్వ ఒత్తిడితో కాదని, అందుకే వెంటనే హ్యాష్ ట్యాగ్‌ను రిస్టోర్ చేసినట్లు వివరణ ఇచ్చింది.