సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ భారత్‌లో క్లోజ్ అవుతాయని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కట్టడికి ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనలు ఈనెల నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలను పాటించటానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం మూడు నెలల గడువు ఇచ్చింది.
ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా కేంద్రం సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఈ గడువు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఒకవేళ ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమ నిబంధనలను అంగీకరించకపోతే నిషేధం తప్పేలా లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబందనలలో అనేక అంశాలున్నాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. వారి పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకరమైన కంటెంట్ తొలగించడం వంటివి నిబంధనలలో ఉన్నాయి.
ఏ సంస్థ కూడా ఇప్పటివరికి ఆ నిబంధనలు అంగీకరించలేదు. అందుకే భారత్‌లో ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. మే 26 నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఈ కంపెనీలు ఆరు నెలల సమయం కావాలని కోరాయి. దీనికి కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సోషల్ మీడియాల సర్వీసులు నిలిపివేయడమో లేదా తాత్కాలికంగా ఆగిపోవడమో జరిగే అవకాశం ఉంది.