బ్రెజిల్లో భారీ వర్షాల కారణంగా వరద బీభత్సం సృష్టిస్తోంది. భయంకరమైన వరదలు వచ్చాయి. పర్వత ప్రాంతమైన రియోడిజనీరో రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌లోని పెట్రోపోలీస్ నగరంలోని వీధులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో పలు చోట్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 117 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా బురదలో చాలా మంది కూరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఈ వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్ల సాయంతో బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి ఆహారం, నీళ్లు, దుస్తులు, ఫేస్ మాస్కులు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇంత స్థాయిలో వరదను చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రెజిల్ లోని పెట్రోపాలిస్ నగరం మట్టిచరియలు నివాస ప్రాంతాల్లో విరుచుకుపడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం మూడు గంటల్లోనే 25.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నా ఫలితం కన్పించడం లేదు. బ్రెజిల్ లో బీభత్స వాతావరణం కన్పిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital