Tuesday, November 12, 2024

బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్.. ఇప్పుడు కొత్తగా గ్యాంగ్రీన్

కరోనా వైరస్ లక్షణాలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటివి కరోనా వచ్చిన బాధితుల్లో కనిపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి కాకుండా ఇటీవల కరోనా రోగుల్లో మరో కొత్త ముప్పు ఏర్పడుతున్నట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. చాలా కేసుల్లో గ్యాంగ్రీన్ లక్షణాలను గుర్తించామని తెలిపారు.

గ్యాంగ్రీన్ అంటే ఏంటి?
ఓ శరీర భాగానికి రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోయినప్పుడు, ఆ భాగానికి ప్రాణవాయువు, ఇతర పోషకాలు అందక అక్కడి కణజాలం నశిస్తుంది. ఆ మృత కణజాలం కారణంగా ఆ భాగమంతా నీలం రంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అని పిలుస్తారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేకమంది రోగులు గుండెపోటుతో మరణిస్తున్నారు. అందుకు కారణం కరోనా వైరస్ కారణంగా రక్తం గడ్డలు కట్టడమే. అయితే ఈ విధంగా రక్తం గడ్డలు కట్టడం వల్ల గ్యాంగ్రీన్ కూడా సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు. రక్త ప్రసరణ నిలిచిపోయి ఆయా భాగాలు కృశించిపోతాయని, సకాలంలో గుర్తించకపోతే ఈ పరిస్థితి మరణాలకు దారితీస్తుందని చెప్తున్నారు. ఇటీవల గుజరాత్‌కు చెందిన హీర్జీ లుహార్ అనే వ్యక్తి కరోనా బారినపడగా, ఆపై గ్యాంగ్రీన్ ఏర్పడిందని, దాంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని అహ్మదాబాద్ కు చెందిన వాస్క్యులార్ సర్జన్ డాక్టర్ మనీష్ రావల్ వెల్లడించారు. తొలుత అతడి కాలులో తీవ్రమైన నొప్పి కలిగి, ఆపై మొద్దుబారిపోయిందని వివరించారు. అప్పటికే ఆలస్యం అయిందని, మూడ్రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకురాగా, వైద్య పరీక్షలు చేస్తే కాలులో గ్యాంగ్రీన్ ఏర్పడినట్టు గుర్తించామని, అతడి ప్రాణాలు కాపాడేందుకు కాలు తీసేయాల్సి వచ్చిందని డాక్టర్ మనీష్ రావల్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement