తెలుగురాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో క్రమంగా పగటి ఉష్ణోగ్రలు పెరుగుతున్నాయి. ఈ వేసవికాలం ఎలా ఉండబోతోందన్న దానిపై భారత వాతావరణ శాఖ తొలి బులిటిన్ విడుదల చేసింది. ఈ వేసవిలో ఉత్తర కోస్తాలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు గాను ఉష్ణోగ్రతలు, వర్షాలకు సంబంధించిన వివరాలతో కూడిన ఈ బులెటిన్‌లో దక్షిణాదిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొంత అధికంగా ఉంటుంది.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ నమోదవుతాయి. దక్షిణాదిలో మాత్రం సాధారణం, అంతకంటే తక్కువగా నమోదవుతాయి. అయి తే తూర్పు భారతానికి అంటే… ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌కు ఆనుకుని వున్న ఉత్తర కోస్తాలో మాత్రం వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా ఏప్రిల్ నుంచి ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. మధ్య, తూర్పు భారతంలో వాతావరణ ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉంటున్నందున వేసవిలో ఎండలు ఎక్కువగా వుంటాయని వాతావరణ అధికారులు చెప్పారు.
మంగళవారం విడుదల చేసిన బులిటెన్ లో మార్చి-మే వేసవి సీజన్ లో జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌తో పాటు తూర్పున కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. మార్చి, ఏప్రిల్, మేలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లోనూ ఎండలు ఉంటాయని తెలిపింది.