దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో మీడియా, పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. ఐదు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ.. బంగాల్పై దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. బంగాల్ను హస్తగతం చేసుకునేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపాలు హోరాహోరీగా తలపడ్డాయి.
పశ్చిమ బెంగాల్ లో 294 స్థానాలు, తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140, అసోం 126, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లోనూ, అసోంలో మూడు దశల్లోనూ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. వీటితోపాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప- ఎన్నికలు నిర్వహించారు. బెంగాల్, అసోంలో ఎన్నికల పోలింగ్ మార్చి 27న ప్రారంభం కాగా.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6 న అన్ని స్థానాలకూ ఒకే సారి పోలింగ్ జరిగింది.
బెంగాల్లో ఎనిమిదో, చివరి దశలో గురువారం (ఏప్రిల్ 29న) 35 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు సాగింది. మూడోసారి అధికారం కోసం దీదీ.. తొలిసారి అధికారం కోసం బీజేపీ వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్లాయి. బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం బెంగాల్ పైనే దృష్టి కేంద్రీకరించింది. బీజేపీపై మమతా బెనర్జీ ఒంటరి పోరాటం చేశారు. గత ఎన్నికల్లో టీఎంసీ 200కిపైగా స్థానాల్లో విజయం సాధించింది. హోరాహోరీ పోరున్నా దీదీకే బెంగాల్ ఓటర్లు పట్టం కడతారని టైమ్స్ నౌ ప్రీ పోల్ సర్వే తెలిపింది. బెంగాల్లో బీజేపీకి 172-191, టీఎంసీకి 64-88, కాంగ్రెస్ వామపక్ష కూటమికి 7-12 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.
బెంగాల్లో బీజేపీ కూటమి 138 నుంచి 148 స్థానాలు గెలుపొందుతుందని రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేశాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ 128 నుంచి 138స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వామపక్షాలు 11 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించాయి.
అసోంలో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉండగా.. పట్టు నిలుపుకుంటుందా? కాంగ్రెస్ కూటమిని విజయం వరించనుందా? అనేది ఉత్కంఠంగా మారింది. మొత్తం 126 స్థానాలున్న రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది. అసోంలో ఇండియా టుడే సర్వే బీజేపీ 75-85, కాంగ్రెస్ 40-50, ఇతరులు 174 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. టుడేస్ చాణక్య ప్రకారం.. అసోంలో ఎన్డీఏ 70, కాంగ్రెస్ 56 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి, డీఎంకే మధ్య పోటీ నెలకుంది. మొత్తం 234 స్థానాలున్న రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం కోసం అన్నాడీఎంకే, పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే హోరాహోరీగా తలపడ్డాయి. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పార్టీ ఏమేరకు ప్రభావం చూపిందో మే 2న ఫలితాల్లో తేలిపోనుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 136 సీట్లు సాధించి రెండోసారి అధికారం దక్కించుకోగా.. డీఎంకే 89, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. ఈసారి మాత్రం డీఎంకే కూటమి భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకుంటుందని టైమ్స్ నౌ-సీ ఓటర్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. రిపబ్లికన్ సీఎన్ఎక్స టీవీ అంచనా ప్రకారం.. తమిళనాడులో డీఎంకే 170-180, అన్నాడీఎంకే 64-88, ఇతరులు 0-6. సీఎన్ఎక్స్: అన్నాడీఎంకే కూటమి 58-68, డీఎంకే కూటమి 160-170 గెలుస్తుందని అంచనా వేసింది.
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ జరిగింది. మొత్తం 140 స్థానాలున్న కేళరలో ఎల్డీఎఫ్ అధికారం నిలబెట్టుకుందనే అంచనాలున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే, మెట్రోమేన్ శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదని అంచనా వేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఎల్డీఎఫ్ 76, యూడీఎఫ్ 61, ఎన్డీఏ 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది.