దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేస్ ధాటికి రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడుతున్న బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మందుల కోరత వేదిస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో వినియోగించే వస్తువులపై జీఎస్టీ వసూలు చేయడం భారంగా మారింది. కరోనా కట్టడికి వినియోగిస్తున్న వాక్సిన్లపై 5 శాతం, అంబులెన్స్ పై 28 శాతం, పీపీఈ కిట్లపై 5 శాతం, టెస్టులపై 12 శాతం, మాస్కులపై 5 శాతం, వెంటిలేటర్స్ పై 12 శాతం, శానిటైజర్లుపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది కేంద్రం. కరోనా కష్టంకాలంలో కేంద్రం జీఎస్టీ రూపంలో భారం వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా కట్టడిలో వినియోగించే వస్తువులపై జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, గ్లౌజులపై జీఎస్టీ వసూలు చేయడం తప్పు అని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆయా వస్తువులపై వసూలు చేస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కరోనా చికిత్సకు అవసరమైన మందులు, మెడికల్ సామాగ్రిపై కేంద్రం 12 శాతం జీఎస్‌టీ విధిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఇతర మెడికల్ సామాగ్రికి భారీగా డిమాండ్ పెరిగింది. వీటి కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. జీఎస్‌టీ నుంచి రెమ్‌డిసివిర్‌తో పాటూ ఇతర మెడికల్ సామాగ్రిని మినహాయించాలని కోరుతూ కేంద్రానికి పలు రాష్ట్రాలు లేఖ కూడా రాస్తున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక అస్థిరత ఉందని రాష్ట్రాలు చెబుతున్నాయి.
భారత్‌పై కరోనా రెండో దాడి కొనసాగుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ మండలి సమావేశాన్ని కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు తాజాగా డిమాండ్ చేశాయి. కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డిసివిర్ వంటి మందులు, వైద్య సామాగ్రి, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌కు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాయి. జీఎస్‌టీ లోటు పరిహారం చెల్లింపుల గడువును పెంచడంపై కూడా ఈ సమావేశాల్లో చర్చించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి.