Friday, November 22, 2024

Exclusive – మెడి‘కిల్’ స్టోర్స్‌ ….. ప్రిస్కిప్ష‌న్ లేకుండానే అమ్మ‌కాలు

మెడిక‌ల్ స్టోర్స్‌ల్లో కాన‌రాని క్వాలిఫైడ్ ప‌ర్స‌న్స్‌!
అవ‌గాహ‌న లేని వ్య‌క్తుల‌తో మందుల విక్ర‌యాలు
య‌జ‌మానుల‌దే ఇష్టారాజ్యం
ప్రిస్కిప్ష‌న్ లేకుండానే అమ్మ‌కాలు
రోగుల ప్రాణాల‌తో చెల‌గాటం
ప‌ట్టించుకోని ఔష‌ధ నియంత్ర‌ణ అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, అచ్చంపేట : అచ్చంపేటలో మెడికల్ షాపు య‌జ‌మానులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హరిస్తున్నారు.
వారి దోపిడీకి అంతేలేకుండా పోతోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాలంచెల్లిన మందులను వినియోగదారులకు అంటగ‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. జ‌న‌రిక్ మందులు ఇచ్చి బ్రాండెడ్‌ మందుల ధరలను వసూలు చేస్తున్నారు. ఔష‌ధ నియంత్ర‌ణ అధికారుల‌ ప‌ర్యవేక్ష‌ణ లోపంతో మెడిక‌ల్ షాపు య‌జ‌మానులు రోగుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు.

- Advertisement -

ప్రిస్కిప్షన్ లేకుండానే…
ఇక్క‌డ డాక్టర్‌ రాసే ప్రిస్కిప్షన్ లేకుండా మందులూ అమ్మేస్తుంటారు. తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులు, నిద్ర పట్టకపోవడం నుంచి ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లాంటి అనారోగ్య సమస్యలకైనా, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కార్డియాలజీ, సైక్రియాట్రిక్‌, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్‌ స్ట్రోక్ర్‌, డయాబెటిక్‌, బీపీ, థైరాయిడ్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్ ఇలా ఏ సమస్యకైనా మెడిక‌ల్ స్టోర్స్ య‌జ‌మానులు మందులు ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గు నివార‌ణ‌కు వాడే టానిక్‌లు, అలాగే మత్తును కలిగించే టానిక్‌ను నేరుగా మెడికల్‌ షాపుల నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ తరహా సిరప్‌లు డాక్టర్‌ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్‌ షాపుల్లో ఆ నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు.

రిజిస్ట‌ర్డ్‌ ఫార్మసిస్టులెక్కడ?
నిబంధ‌న‌ల ప్ర‌కారం మెడికల్‌ షాపులో రిజిస్ట‌ర్డ్ ఫార్మాసిస్ట్‌ ఉండాలి. డాక్టర్‌ ప్రిస్కిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. అయితే అచ్చంపేట‌లోనే కాదు.. జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో మెడికల్‌ షాపుల నిర్వాహకులు నిబంధలను పాటించ‌డం లేద‌ని తెలుస్తోంది. డాక్టర్‌ ప్రిస్కిప్ష్రన్‌ లేకుండా మందులు ఇచ్చేస్తున్నారు. ఫార్మ‌సీ కౌన్సిల్ స‌ర్టిఫికెట్ ఇచ్చిన డి-ఫార్మసీ/ బీ-ఫార్మసీ అభ్య‌ర్థులు లేకుండా మందులు అమ్మ‌కూడ‌ద‌ని నిబంధ‌న కూడా మెడిక‌ల్ షాపు య‌జ‌మానులు ప‌ట్టించుకోవ‌డం లేదు. మెడికల్‌ షాపులకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నదీ లేనిది ప‌రిశీలించుకోవాలి. ఏరియా డ్ర‌గ్​ ఇన్‌స్పెక్టర్లు ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ ఎక్క‌డా కాన‌రావ‌డం లేదు.

కాన‌రాని క్వాలిఫైడ్ ప‌ర్స‌న్స్‌
అచ్చంపేట పట్టణంలో అధికంగా మెడికల్‌ షాపుల్లో క్వాలిఫైడ్ ప‌ర్స‌న్స్ కాన‌రావ‌డం లేదు. తక్కువ వేతనంతో యువతీ, యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడిసన్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తుల‌తో మందులు విక్ర‌యిస్తున్నారు. ఇదీ ప్ర‌మాదక‌ర‌మ‌ని తెలిసినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. జనరిక్‌, నాన్‌ జనరిక్‌ అనే తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్ప‌టికైనా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు. వీటిపై వివ‌ర‌ణ తీసుకోవ‌డానికి అధికారుల‌ను సంప్ర‌దించేందుకు మూడు రోజులుగా ప్ర‌య‌త్నించినా వారు అందుబాటులో లేరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement