Tuesday, November 19, 2024

Exclusive – జనసేనలో “హు ఈజ్.. కట్టప్ప”!

ఇటు లెక్కలేనంత వీరాభిమాన కుల బలం.. అటు కమల యోధుల పోరాట పటిమ జతకలిస్తే.. తెలంగాణలో పాగా కష్టం కాదని జనసేనాధిపతి రచించిన వ్యూహా ఊహలు పటాపంచలై పోగా.. చేతిలో గ్లాసు చేజారిపోయింది. టిక్కెట్ల కోసం వెంపర్లాడిన కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల ముఖం వాడిపోయింది. కడకు తెలంగాణలో జేఎస్పీ ఉనికి కోల్పోయిన విషయాన్ని కాసేపు పక్కన పెట్టి… ఆంధ్రాలో.. అధికార పార్టీ ఓటమికి శత్రువు శత్రువే మిత్రుడనే మిత్రబేధం లబ్ధి కోసం టీడీపీతో ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ను.. మరో సారి ఆంధ్రాలో అంపశయ్య పాలు చేసేందుకే సొంత పార్టీ నేతలే రాచదారిని ముళ్ల బాటగా తీర్చిదిద్దుతున్నారా? ఏమో? ఆంధ్రాలో పొత్తుల అనంతరం చిరునవ్వుల ముఖ చిత్రాలు … కలహాల జుట్టు ముడుల కొంపను తలపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆరోపణలు అంతకంటే కాదు. జనం ఎరిగిన సత్యాలివే..

సంకుల ప్రమాదం
ఇటు పొత్తుల తంటాలు.. అటు ఆధిపత్య జగడాలు జన సేన భవిష్యత్తును తునాతునకలు చేస్తున్నాయి. పవన్ మాటే మాట. ఆయన ఆలోచనే ఆలోచన. అంత గొప్ప నాయకుడు ఒక్కసారి సీఎం కావాలి. ఇదీ ఆంధ్రాలో ఆయన సామాజిక వర్గం తీరని కోరిక. కానీ.. ఇదే జనసేన కొంప కూల్చుతోంది. రెడ్డి, కమ్మ సామాజిక నేతలే.. రాష్ర్టాన్ని ఏలారు. ఏలుతున్నారు. కాపులకు పాలించే అవకాశమే దక్కలేదు. మెగాస్టార్ చిరంజీవితో ఆశలు నీరుగారాయి. కనీసం పవన్ కళ్యాణ్ సారథ్యంలో..చిరకాల కల సాకారమవుతుందని కాపు సామాజిక వర్గం గంపెడాశ. ఐతే, ఇక్కడే జనసేన వ్యూహం .. తప్పటడుగుల్లో తూలిపోతోంది. మిగిలిన సామాజిక వర్గం బలసమీకరణలో బలహీన పడింది. సినీ ఇమేజీతో ఓట్లు కొల్లగొట్టే రాజకీయం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్తోనే అంతరించింది. ఇప్పుడు నాయకుడికి సొంత బలం కావాలి. అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొనాలి. కానీ యజ్ఞయాగాదుల బాధ్యతను కులాభిమానానికి ధారాదత్తం చేస్తే… ఎన్నికలకు ముందే జనసేన.. జనహీన పడటం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

బాబుని జైలుకు పంపండం మొదలు..
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని రాష్ర్ట ప్రభుత్వం కారాగారానికి పంపించటం.. అప్పటికే జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్న పవన్ .. మిత్రబేధాన్ని వదిలి.. మిత్రలాభం కోసం .. టీడీపీ వైపు తన పయనం సిద్ధం చేశారు. రెండు పార్టీలో జత కలిశాయి. చెట్టాపట్టాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించారు. సీట్ల పంపకాన్ని పక్కన పెడితే.. బీజేపీనీ జత చేసుకుని ఏపీలో అధికారంలోకి రావాలని ఈ రెండు పార్టీల అంతర్గత మంత్రాంగం. ఇదే నిజమైతే, ఏపీలో కూటమికి కుర్చీ దక్కటం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. కానీ, నవరత్నాల దెబ్బ తగిలితే ఈ కూటమికి చుక్కలు కనిపించటమూ ఖాయమేనన్నది పరిశీలకుల భావన.

కుల సీట్లాటే.. ఉమ్మడి శత్రువా?
జనసేన పార్టీ కుల ఊబిలో కూరుకుపోతోందా? ఏమో కావచ్చు. ఏపీలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ జిల్లాల్లోనే ఉమ్మడి జట్టు రాజకీయాలపై తీవ్ర ప్రభావం తప్పదు. అటు టీడీపీ, ఇటు జేఎస్పీ అధిష్ఠానాలు లబో లబో మని నెత్తి నోరు కొట్టుకునే స్థితి తప్పదు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఉమ్మడి వేదికలో జట్ల మధ్య రగడ తప్పలేదు. సీట్ల సర్దుబాటుకు ముందే… తమకే సీటు ఖాయమైందని పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు నాయకులు మీడియాకు లీకుల మీద లీకులు ఇస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ ఉమ్మడి కార్యాచరణలో కదం తొక్కుతున్న జనసైనికులు.. పార్టీ టిక్కెట్లపై గంపెడాశతో చిందులు తొక్కుతున్నారు. కానీ, ఇక్కడే జత కట్టిన జట్టులో రెండు పార్టీల్లో టిక్కట్ల త్యాగ జనులేరీ? టీడీపీ పొత్తుతో గెలవటానికి జేఎస్పీ, గ్లాసుతో విజయ సంబరానికి సైకిల్ రయ్, రయ్, అంటేంటే ఎవరు తగ్గుతారో? ఎవరు నెగ్గుతారో? కార్యకర్తలకు అర్థం కాని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

పక్కనోళ్లని గెలుపు ఎంతకాలం!
కాపు సామాజిక ఓటు బ్యాంకుకు కొదవ లేదు. ఇప్పటి వరకూ పక్క పార్టీలను గెలిపించటానికే సొంత పార్టీ బలం సరిపోతోంది. విజయానికి సరితూగటం లేదు. చిరంజీవి పార్టీలోనూ అంతే.. పవన్ పార్టీలోనూ అంతే. ఇక కృష్ణాజిల్లాలో గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2009లో పీఆర్పీ దయతో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది. పదేళ్ల తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జమానాలో.. అదీ భారీ బలంతో వైఎస్ఆర్ సీపీ గద్దెనెక్కింది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019ఎన్నికల ఫలితాల ప్రకారం… గన్నవరం సీటును సీపీఐకి, పెనమలూరు సీటును బీఎస్సీకి త్యాగం చేశారు. గుడివాడలో జనసేన జాడ లేదు. పామర్రులో డిపాజిట్టు దక్కలేదు. ఇక మచిలీపట్నం, పెడన, అవనిగడ్డే జనసేనకు కీలక అడ్డాలు.

కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇదీ..
మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి బండి రామకృష్ణకు 18,807 ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య 5,932 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ జనసేన పోటీ చేయక పోతే.. పేర్ని నాని మెజార్టీ పెరిగేది. అవనిగడ్డలో జేఎస్పీ అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావుకు 28,556 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా కృష్ణాజిల్లాలో అత్యధిక ఓట్లు ఈ అభ్యర్థికే దక్కాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ నాయుడు 20,725 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసేన పోటీ చేయక పోతే టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ తక్కువలో తక్కువ 1000 ఓట్లతో విజయం సాధించేవారని విశ్లేషకుల అంచనా. పెడన నియోజకవర్గంలో.. జన సేన అభ్యర్థికి 25,733 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి జోగిరమేష్ 7,839 మెజారిటీతో విజయం సాధించారు. కాపు అభ్యర్థి పోటీలో లేకపోతే.. టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ గట్టెక్కేవారే. అందుకే ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ ఔత్సాహికులు పొత్తుకోసం తపిస్తుంటే.. పార్టీ టిక్కెట్టు కోసం జనసేనలోనూ ఆరాటం పెరిగింది. ఇంత వరకూ సబబే. కానీ జనసేనలో అంతర్గత కుమ్ములాట.. ఈ సీట్లను టీడీపీకి చేజార్చునే ప్రమాదం పొంచి ఉందంటే.. డౌటానుమానం అక్కర్లేదు.

- Advertisement -

అధినేత చుట్టూ.. కోటరీ కంచె…
మనకి కులం లేదు. మతం లేదు. అందరం మనుషులమే. అధికారం అందరిదీ? అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తనకు తానే ఓ కంచె సృష్టించుకున్నరా? ఏమో.. జన సైనికుల కష్టాన్ని, నష్టాన్ని గుర్తించే స్థితిలో కనిపిచటం లేదనేది జనసైన్యం మనోభావం. పవన్ కళ్యాణ్ తరువాత స్థానంలోని నాయకుల సొంత కోటరీ ప్రస్తుతం పార్టీని పాలిసుంటే.. జిల్లా స్థాయిలోనే ఇదే ప్రణాళిక అమలు జరుగుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లాలో సమన్వయ కమిటీల నియామకాల్లో అసలు సిసలు పార్టీ విధేయులకు స్థానం లేదు. కుల సమీకరణలోనూ వివక్షే కనిపిస్తోంది. ఈ కమిటీలో ఒక్క దళితుడు లేదు. గౌడ ఊసు లేదు. యాదవ నాయకుడికి స్థానం లేదు. కమ్మ అంటే విరోధమే. ముస్లీం నేతకు ఛాన్స్ లేదు. జాబితా పరిశీలిస్తే.. ఏరి కూరి కాపులకే స్థానం కల్పించారు. ఇది ఒక రకంగా కాపునాడు జాబితే. కృష్ణాజిల్లాలో జనసేన సమన్వయ కర్తల నియామకాలను పరిశీలిస్తే.. అవనిగడ్డ సమన్వయకర్తగా బండ్రెడ్డి రామకృష్ణ, గన్నవరం సమన్వయకర్తగా చెలమలశెట్టి రమేష్, పెడన సమన్వయకర్తగా పంచకర్ల సురేష్, మచిలీపట్నం సమన్వయ కర్తగా బండి రామకృష్ణ, గుడివాడ సమన్వయ కర్తగా బూరగడ్డ రామకృష్ణను ఎస్సీ నియోజకవర్గం కావటంతో ఇక్కడ తప్పని స్థితిలో దళిత నేత తాడిశెట్టి నరేష్కు సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారు. ఈ జాబితా విడుదలతో పార్టీ క్షేత్ర స్థాయిలో తీవ్ర అసంతృప్తి రగిలింది. నాగాయలంక మండల జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఏకంగా రాజీనామా చేశారు. ఇలా కృష్ణాజిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కేవలం తమ వర్గాన్ని రంగంలోకి దించి.. జనానికి పార్టీని దూరం చేస్తున్నారని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement