Saturday, June 29, 2024

Exclusive – మరమగ్గాల మూగనోము – నేత‌న్న‌ల బ‌తుకుల్లో మ‌ళ్లీ చీక‌టి రోజులు

ఆర్థిక సంక్షోభంలో సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌
అప్పుల బాధ తాళ‌లేక నేతన్నల ఆత్మ‌హ‌త్య‌లు
ఇప్ప‌టికీ ఏడుగురు త‌నువు చాలించారు
మూల‌కు చేరిన మ‌ర‌మ‌గ్గాలు
స్క్రాప్‌ కింద సాంచాల విక్రయాలు
కోర్టు ఆదేశాల‌తో మారిన విద్యుత్‌ కేట‌గిరీ
పెద్ద మొత్తంలో కోల్పోయిన రాయితీలు
పేరుకుపోతున్నక‌రెంటు బ‌కాయిలు
ప్ర‌భుత్వం ఆదుకోక‌పోతే నేత‌న్న కుటుంబాల్లో అంధ‌కార‌మే

- Advertisement -

ఆంధ్రప్రభ, సిరిసిల్ల : ఒక‌ప్ప‌టి చీక‌టి రోజులు సిరిసిల్ల నేత‌న్న కుటుంబాల్లో మ‌ళ్లీ అలుముకుంటున్నాయి. సిరిసిల్ల నేత‌న్నల నెత్తి మీద ఒకేసారి స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌టంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఒక వైపు ఉపాధి లేక‌… మ‌రో వైపు అప్పుల ఊబిలోకి నేత‌న్న‌లు నెట్ట‌బ‌డుతున్నారు. అప్పుల బాధ తాళ‌లేక సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కార్మిక వాడలో కార్మికుడు కె. నాగరాజు (42) ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుకు రూ. 4 లక్షల మేరకు అప్పు అయ్యిందని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుమారుడికి కళాశాల ఫీజు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనకు గురై త‌నువు చాలించిన‌ట్టు గ్రామ‌స్థులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 12న బి.వై.న‌గ‌ర్‌కు చెందిన తడుక శ్రీనివాస్, ఏప్రిల్ ఏడున‌ రాజీవ్‌న‌గ‌ర్‌కు చెందిన సిరిపురం ల‌క్ష్మీనారాయ‌ణ‌, అదే నెల 24న నెహ్రూన‌గ‌ర్‌కు చెందిన ఈగ రాజు, తంగ‌ళ్ల‌ప‌ల్లికి చెందిన అహంకార‌పు మ‌ల్లేశం, ప‌ద్మాన‌గ‌ర్‌కు చెందిన ఆడిచ‌ర్ల సాయి, ఈ నెల 15న కొత్త‌ప‌ల్లి గ్రామం చంద్రంపేట‌కు చెందిన‌ గొల్ల‌బ‌త్తిని వెంక‌టేశం, ఈ నెల 21న రాజీవ్ న‌గ‌ర్‌కు చెందిన కొడిక్యాల నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వ‌స్తోందో అని సిరిసిల్ల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

గ‌త ప్ర‌భుత్వాలు తీసుకున్న చ‌ర్య‌లు…

సిరిసిల్ల‌లో నేత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌లు… ఆక‌లి చావులకు చ‌లించిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇర‌వై ఏళ్ల కింద‌ట విద్యుత్ రాయితీ ప్ర‌క‌టించారు. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను కుటీర ప‌రిశ్ర‌మ‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నాలుగ‌వ కేట‌గిరీ కింద ఈ రాయితీ సౌక‌ర్యం అప్ప‌టి ప్ర‌భుత్వం వ‌ర్తింప‌జేసింది. అనంత‌రం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ప్ర‌భుత్వం విద్యుత్ రాయితీల‌ను కొన‌సాగించింది. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత వ‌చ్చిన కేసీఆర్ ప్ర‌భుత్వం కూడా రాయితీల‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చింది. టెన్‌ హెచ్‌పీల వ‌ర‌కు విద్యుత్ వినియోగించిన మ‌ర‌మ‌గ్గాల యాజ‌మానుల‌కు ఈ రాయితీ వ‌ర్తించేది. కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌రో ముందుకు అడుగు వేసి మార్కెంటింగ్ స‌దుపాయం కూడా క‌ల్పించింది. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించి మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఈ చీర‌లు త‌యారు చేసే ఆర్డ‌ర్ ను సిరిసిల్ల చేనేత ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చింది. దీంతో ఈ ప‌రిశ్ర‌మ విస్త‌రించింది. మ‌ర‌మ‌గ్గాల సంఖ్య కూడా పెరిగాయి. 2018 నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల ఆర్డ‌ర్ రావ‌డంతో నేత‌న్న‌లు, కార్మికుల‌కు ఆదాయం పెర‌గ‌డంతో ఈ ప‌రిశ్ర‌మ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా విర‌జిల్లింది.

విద్యుత్ రాయితీ పోయింది ఇలా…

చేనేత ప‌రిశ్ర‌మ‌కు సిరిసిల్ల స‌హ‌కార విద్యుత్ స‌ర‌ఫ‌రా సంఘం (సెస్‌) విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. హైకోర్టు ఆదేశాల మేర‌కు సిరిసిల్ల చేనేత ప‌రిశ్ర‌మ‌ను చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ కింద మార్పు చేశారు. దీంతో నాలుగో కేట‌గిరీలో ఉన్న విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను మూడో కేట‌గిరీలోకి మార్పు చేశారు. దీంతో యూనిట్ ధ‌ర రూ.నాలుగు నుంచి రూ.8.50లు పెరిగింది. అలాగే రాయితీలు కూడా పోయాయి. గ‌తంలో రాయితీపోనూ ఒక యూనిట్‌కు రెండు రూపాయ‌లు చెల్లించేవారు. ప్ర‌స్తుతం రూ.8.50లు చెల్లించాల్సి రావ‌డంతో ఒక యూనిట్‌కు రూ.6.50లు భారం అద‌నంగా ప‌డింది. అలాగే పాత బ‌కాయిల‌ను కూడా చెల్లించాల‌ని వినియోగ‌దారుల‌ను విద్యుత్ అధికారులు కోరుతున్నారు. విద్యుత్ బిల్లుల భారం మోయ‌లేనివిధంగా త‌యారు కావ‌డంతో క‌నెక్ష‌న్లు తొల‌గించాల‌ని నేత‌న్న‌లు కోరుతున్నారు. అయితే బ‌కాయిలుంటుండ‌గా క‌నెక్ష‌న్ తొల‌గించ‌లేమ‌ని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఒక వైపు బ‌కాయిలు చెల్లించ‌లేక‌, మ‌రో వైపు మూత‌ప‌డిన ప‌రిశ్ర‌మ‌కు విద్యుత్ బిల్లులు రావ‌డంతో మ‌రింత ఆర్థికంగా కుదేలు అవుతామ‌ని నేత‌న్న‌లు, కార్మికులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఉపాధికి కోల్పోయిన నేత‌న్న‌లు

సిరిసిల్ల‌లో ఉన్న‌ పదివేల మరమగ్గాలకు ఉత్పత్తుల ఆర్డర్లు లేవు. నిరంతరం ఉపాధి కల్పిస్తామని ఎన్నిక‌ల ముందు చెప్పిన‌ పాలకులు ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. బ‌తుకమ్మ చీరల పెండింగ్‌ బకాయిలు రూ.150 కోట్ల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులు సొసైటీ స‌భ్యులైన‌ ఆసాముల‌(పెట్టుబ‌డి పెట్టిన‌వారు)కు ఇచ్చారు. ఎవరికి ఎంత మేర‌కు బకాయలు అందాయో లెక్కలు తేలడం లేదు. ఉత్పత్తులు సాగిస్తామంటే ముడి సరుకులు ఇచ్చే యజమానులు ముందుకు రావడం లేదు. ఉత్ప‌త్తుల‌కు త‌గిన మార్కెట్ లేక‌పోవ‌డంతో య‌జ‌మానులు ముందుకు రావ‌డం లేద‌ని కార్మికులు చెబుతున్నారు. గతంలో బతుకమ్మ చీరల పేమెంట్లు నేరుగా యజమానులకు అందేవి. వాటి నుంచి 50 శాతం ఆసాములకు చేరేవి. ఈ క్రమంలో యజమాని నుండి ముడి సరుకులు ఆసాములకు అంది, వారు ఉత్పత్తులు సాగిస్తే మరమగ్గాలపై కార్మికులకు ఉపాధి దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ బకాయిలు ప్రస్తుతం నేరుగా ఆసాములకు అంద‌డంతో యజమానుల‌కు, ఆసాముల మధ్య దూరం పెరిగింది. దాని ప్ర‌భావం వస్త్ర పరిశ్రమలపై పడింది. మరమగ్గాలకు ఉపాధి లేకుండా పోయింది. దీనితో మరమగ్గాలు మూలనపడ్డాయి. వీటిని స్క్రాప్‌ కింద అమ్ముకునే పరిస్థితి నెలకొంది. పట్టణంలో పాత సామాను కింద మరమగ్గాలని తరలిస్తున్న గూడ్స్‌ వాహనాలు పట్టణవాసులకు నిత్యం దర్శనమిస్తున్నాయి.

రాజ‌కీయ ప‌రిస్థితులు…

గ‌త ప్ర‌భుత్వం బతుకమ్మ చీరల పెండింగ్‌ బకాయిలు చెల్లించ‌లేదు. సుమారు రూ. 350 కోట్లకు పైగా బతుకమ్మ చీరల బకాయిలు ఉన్నాయి. సిరిసిల్ల‌లో కాంగ్రెస్ మ‌ద్ద‌తు సంపాదించే దిశ‌లో అడుగులు వేసింది. ఈ నేప‌థ్యంలో రూ. 150 కోట్ల మేర బకాయిలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించింది. మరోవైపు నేతన్నలను తమ వైపు మళ్లించుకోవాలని అధికార పార్టీ తాపత్రయ పడింది. అయితే దీనికి భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకున్నప్పటికీ తదుపరి జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం నేతన్నల మద్దతు అధికార పార్టీకి లభించలేదు. ఇటీవల జరిగిన సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్‌ ప్యానల్‌ గెలిచి, అధికార పార్టీకి మద్దతు లభించలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన పాత బకాయిల చెల్లింపు కోసం, వస్త్ర పరిశ్రమల ఉపాధి కోసం పాలకుల వద్దకు స్థానిక నాయకత్వాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ప్ర‌భుత్వం ఆదుకుంటే త‌ప్పా…

ప్ర‌భుత్వం ఆదుకుంటే త‌ప్పా సిరిసిల్ల వ‌స్త్ర‌ప‌రిశ్ర‌మ ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేదు. ప్ర‌ధానంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌కు సంబంధించి రూ.200 కోట్ల బకాయిల‌ను విడుద‌ల చేయాల‌ని, అలాగే విద్యుత్ రాయితీల‌కు కొత్త పాల‌సీ తీసుకు రావాలని, విద్యుత్ బిల్లుల రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించాల‌ని ప‌లువురు నేత కార్మికులు కోరుతున్నారు. ఇప్ప‌టికైనా నేత‌న్న కార్మికుల్లో చీక‌టి రోజులు రాకుండా సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

రూ.128 కోట్ల బ‌కాయిలు చెల్లించాలి

సిరిసిల్ల స‌హ‌కార విద్యుత్ స‌ర‌ఫ‌రా సంఘం (సెస్‌) ప‌రిధిలో అన్నికేటగిరీల విద్యుత్ క‌నెక్ష‌న్ల నుంచి రూ.128 కోట్లు బ‌కాయిలు రావాల్సి ఉంద‌ని చైర్మ‌న్ చిక్కాల రామారావు తెలిపారు. సిరిసిల్ల చేనేత ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రాయితీ రూ.60 కోట్లకు చేరుకుంద‌న్నారు. మ‌ర‌మ‌గ్గంల‌కు సంబంధించిన‌ విద్యుత్ సర్వీసులను మూడవ కేటగిరీకి మార్చిన నేపథ్యంలో ఆ బకాయిలు కూడా రూ. 20 కోట్లకు పైగా చేరుకుంద‌ని, ఈ బ‌కాయిలు వినియోగ‌దారులు చెల్లించాల్సి ఉంద‌ని చెప్పారు. 2013 నుంచి విద్యుత్ రాయితీల‌కు సంబంధించి రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించ‌డంలేద‌న్నారు. త‌మ సంఘం ద్వారా ట్రాన్స్ కో కు పూర్తి స్థాయి బిల్లు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. అందుకే తాము బ‌కాయిలు వ‌సూళ్లు చేయ‌క‌త‌ప్ప‌డం లేద‌న్నారు.
= సెస్ చైర్మ‌న్ రామారావు

Advertisement

తాజా వార్తలు

Advertisement