హైదరాబాద్, ఆంధ్రప్రభ : భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి కన్నీరుపెడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ఉన్న దారులను ఆశ్రయిస్తున్నారు. ఆఖరి యత్నంగా చేసేవన్నీ చేసి.. కొన ఊపిరితో ఉన్న పంటలకు జీవం పోయాలని కొత్తగా బోర్లను కూడా తవ్విస్తున్నారు. ప్రస్తుతం పొట్టకొచ్చిన వరికి నీటి తడులు పుష్కలంగా అందించాల్సి ఉన్నా.. ఆరు తడులతోనే రైతులు నెట్టుకొస్తున్నారు. నాలుగురోజులకో మడి చొప్పున నీటి తడిని అందిస్తూ.. పంట ఎండిపోకుండా చూస్తున్నారు.
దిగుబడి తగ్గే ప్రమాదం..
ఆరు తడులతో గింజ నాణ్యత దెబ్బతిని ధాన్యంలో తాలు ఎక్కువగా పోతుందని వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా పొట్టకొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు గుంట గుంటకు పైపుల సాయంతో ఆరు తడులు అందిస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. మండుతున్న ఎండల కారణంగా గుంట భూమిని తడపాలంటే గంటల సమయం పడుతోంది. ఉదయం, పగటిపూట ఎండ వేడిమికి ఉన్నకొద్దిపాటి నీరుతో పొలం పారే పరిస్థితి లేకపోవడంతో రాత్రి సమయాల్లో ఆరు తడులు అందిస్తున్నారు. అందుకు రాత్రి కూడా రైతులు పొలం వద్దే ఉంటూ ప్రతీ మడిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
ఎండల తీవ్రతకు ఆవిరవితున్న నీరు..
ఎండల తీవ్రతతో ఆవిరయ్యే నీటి శాతం కూడా పెరుగుతోంది. 2023 ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి 1.36 మీటర్ల ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి. 2023 మేలో 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 8.70 మీటర్లకు పడిపోవడం గమనార్హం. దీనికిముందు జనవరిలో 7.72 మీటర్ల లోతులో ఉండగా.. నెల తిరిగేసరికి ఇంకో మీటరు కిందకు వెళ్లిపోయాయి. మార్చిలో 9 మీటర్లకు పడిపోయి ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వికారాబాద్, కామారెడ్డి, మెదక్లో 13 మీటర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి మేడ్చల్లో 12 మీటర్లు, నాగర్కర్నూల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 10 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి.
కరువు కోరల్లో రైతన్న..
యాసంగి సాగు కరువు కోరల్లో చిక్కుకోవడంతో ఈ ఏడాది ధాన్యం దిగుబడి తగ్గే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది యాసంగితో పోల్చితే ఈ ఏడాది 10లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది. నిరుడు 72.63లక్షల ఎకరాల్లో యాసంగి వరి సాగు అయితే ప్రస్తుతం అది 62.89లక్షల ఎకరాలకే పరిమితమైపోయింది. అందులోనూ భూ గర్భ జలాలు అడుగంటి పోవడంతో మరో 10లక్షల ఎకరాల కంటే మించి పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.