Friday, November 22, 2024

Exclusive – ఆపరేషన్​ భేడియా – యూపీలో తోడేళ్ల కోసం వేట

మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. రెండు నెలలుగా వీటి ఆగడాలు ఆగడం లేదు. దీంతో జనం భయం భయంగా బతుకుతున్నారు. తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలచివేస్తోంది. సుమారు 40మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్‌ ఆపరేషన్‌ భేడియా చేపట్టింది. ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి దాడికి పాల్పడుతున్న అయిదు తోడేళ్లను అధికారులు బంధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆరో తోడేలు కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒంటరిగా మిగిలిన ఆ తోడేలు వరుస దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక.. ఈ తోడేళ్ల దాడుల్ని ‘వైల్డ్‌లైఫ్‌ డిజాస్టర్‌’గా యూపీ సర్కార్‌ ప్రకటించింది.

మనవ రక్తం రుచిమరిగి దాడులు
గ్రామాల్లోకి చొరబడుతున్న తోడేళ్లు
రెండు నెలలుగా ఆగని ఆగడాలు
ఇప్పటికే 10 మంది మృతి
అందులో తొమ్మిది మంది చిన్నారులే
వైల్డ్​ లైఫ్​ డిజాస్టర్​గా ప్రకటించిన యూపీ సర్కారు

- Advertisement -

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాలో ఒంటరి తోడేలు కోసం వేట కొనసాగుతోంది. ఆరు తోడేళ్ల గుంపులోని అయిదింటిని అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆరో తోడేలును బంధించేందుకు వారం రోజులుగా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా మిగిలిన ఆ తోడేలు వరుస దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బాలుడిపై దాడి..

ఇప్పటికే పలువురిపై దాడి చేసిన ఈ తోడేలు.. తాజాగా మరో బాలుడిపై దాడి చేసి గాయపరిచింది. ఆదివారం రాత్రి మహిస్‌ తహసీల్‌ సబ్‌ డివిజన్‌లో ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్‌ అలీ అనే బాలుడిపై తోడేలు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో బాలుడి మెడ, భుజాలపై గాయాలైనట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారని.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బహరాయిచ్‌ మెడికల్‌ కాలేజీకి రెఫర్‌ చేసినట్లు వివరించారు.

తోడేళ్ల కోసం ఏరియల్​ సర్వే..

రెండు రోజుల క్రితం ఈ ప్రాంతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తోడేళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రాణ నష్టం జరిగిన బాధిత కుటుంబానికి తక్షణమే ₹5 లక్షల పరిహారం అందించనున్నట్లు చెప్పారు. గాయపడిన వారికి ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజల భద్రత కోసం అటవీ శాఖకు చెందిన 165మంది సిబ్బందితో కూడిన 25 బృందాలను ఈ ప్రాంతంలో నియమించినట్లు తెలిపారు. ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం, పోలీసులు ఈ ప్రాంతంలో పని చేస్తూనే ఉంటారని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement