ఆదిలాబాద్ ఏరియాలో ఆరు పులుల సంచారం
తెలంగాణ అభయారణ్యంలో 34 పులుల ఆవాసం
వనం వీడి.. జనావాసల్లోకి వచ్చేస్తున్న పులులు
ఇప్పటి వరకు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నట్టు ఆధారాలు
పులులు ఉన్నంత కాలం అడవికి సంరక్షణ
ఒక పులి వెయ్యిమంది సిబ్బందితో సమానం
జాగ్రత్తగా ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రజలను పెద్దపులి వణికిస్తోంది. జనవాసల్లోకి వచ్చిన పెద్దపులి ఇప్పటి వరకు ముగ్గరును పొట్టన పెట్టుకుంది. పులుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని రెండు అభ్యయారణ్యంలో 34 పులులు ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ టైగర్ జోన్ లో 28 పులులు ఉన్నాయి. కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కారిడార్ పరిధి కవాల్ టైగర్ జోన్‌లో ఆరు ఉన్నాయి. ఇందులో నుంచి ఒక ఆడ పులి, ఒక మగ పులి జనవాసాల్లోకి వచ్చినట్లు అనుమానాలు ఉన్నప్పటికీ అన్ని పులులు జనవాసాల్లో తిరుగుతున్నాయనేది ప్రస్తుతం ప్రశ్న! గత కొంత కాలంగా ఆడ పులి కోసం మగ పులి జనవాసాల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే జనవాసల్లోకి వచ్చిన పులి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తోందని తెలియక ఏజెన్సీ వాసులు బిత్తర పోతున్నారు.
ఇప్పటికే ముగ్గురిని పొట్టన పెట్టుకున్న పులి
పెద్దపులి సంచారంతో ఏజెన్సీ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. పొలం పనుల్లో నిమగ్నమైన వారిపై పెద్దపులి దాడి చేస్తోంది. ఇటీవల పెద్దపులి దాడిలో ముగ్గురు మృతి చెందారు. దీంతో పనులకు వెళ్లడానికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు మాత్రమే పొలం పనులు చేసుకోవాలని అటవీ అధికారులు సూచించారు.
వేటగాళ్ల బారిన పడకుండా అధికారుల నిఘా
పెద్దపులుల సంరక్షణకు అటవీ అధికారులు నిఘా వేశారు. వేటగాళ్లకు పెద్దపులు బలికాకుండా చర్యలు చేపట్టారు. పెద్దపులి ట్రాక్ చేసేందుకు అధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, ట్రాకింగ్ కెమెరాల ద్వారా పులుల సంచారంపై నిఘా పెట్టి వేటగాళ్ల బారిన పడకుండా చూస్తున్నారు.
అడవులను కాపాడుతున్న పులులు
పెద్దపులి అడవిలో సంచరిస్తోందని ప్రచారం జరిగిన తర్వాత అడవుల్లోకి ఒకరిద్దరు వెళ్లడానికి సాహసించడం లేదు. ఒక పెద్దపులి సుమారు వెయ్యి మంది అటవీ సిబ్బందితో సమానం. పెద్దపులి ఉన్నంత వరకూ అడవిలో ఒక్క చెట్టు కూడా అక్రమ నరికివేతకు గురికాదు. అందుకే పెద్దపులిని వేటగాళ్లు చంపే అవకాశాలు ఉంటున్నాయని అటవీశాఖ అధికారుల అంచనా. పులుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు కూడా రాత్రి పగలు శ్రమిస్తున్నారు. పెద్దపులికి ఏమి అనొద్దని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి రాకపోకలు
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్‌గాం టైగర్ జోన్‌లలో నుంచి ప్రాణహిత ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్న పులులు కాగజ్‌నగర్ అడవుల్లో సంచరిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం తడోబా, ఇంద్రావతి, అభయారణ్యాలకు కారిడార్ ఉండడంతో పులులు స్వేచ్ఛగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి. దట్టమైన అడవులు, పుష్కలమైన నీటి వనరులు, వణ్యప్రాణులు ఉండడమే ఇందుకు కారణం.
తెలంగాణలో రెండు పులుల సంరక్షణ కేంద్రాలు
తెలంగాణలోని రెండు పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కవాల్ టైగర్ జోన్, మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ టైగర్ జోన్ ఉంది. ఈ రెండు జోన్లులో పులుల సంఖ్య 42, చిరుత పులుల సంఖ్య 187గా ఉన్నట్లుగా అటవీ అధికారులు నిర్ధారించారు. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టు పులుల ఆవాసానికి అనువుగా ఉండగా 2017లో అక్కడ 8 పులులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 34కు చేరినట్లుగా గుర్తించారు. ఇందులో 15 ఆడపులులు, 11 మగపులులు, 8 పులి పిల్లలు ఉన్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో ఆరు పులులు సంచరిస్తున్నాయి. ఇందులో రెండు ఆడ పులులు, నాలుగు మగ పులులు ఉన్నాయి.
పెద్ద పులిని టైగర్ జోన్‌కు వెళ్లాలా చేయాలి
జనవాసాల్లో తిరుగుతున్న పెద్దపులులను టైగర్ జోన్‌లోకి వె ళ్లేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పులులు తిరగడం వల్ల తాము పొలాల్లో స్వేచ్ఛగా పనులు చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఇప్పటికే ముగ్గురు బలయ్యారు. ఎన్నో పశువులు బలవుతున్నాయి.