Sunday, October 6, 2024

Exclusive – ఇదేనా..ర‌క్ష‌ణ‌! ఆగ‌ని అఘాయిత్యాలు

సుమోటో లేకుంటే ఈ కేసులింతే
అటు వైద్య విద్యార్థిని హత్యాచారం
ఇటు వాష్ రూమ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులు
కేసుల న‌మోదులో పోలీసుల నిర్ల‌క్ష్యం
న్యాయ‌స్థానాలు త‌లంటుతున్న అదే వైఖ‌రి
ప్ర‌భుత్వాల విధానంలోనూ మార్పు రావాలి
క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటేనే బాలిక‌లు సుర‌క్షితం
అర‌బ్ దేశాల్లో ఉన్న చ‌ట్టాలు బెట‌ర్ అంటూ చ‌ర్చ‌
కొత్త ర‌కం చ‌ట్టాలు తీసుకురావాలంటున్న నెటిజ‌న్లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌:

ఇటు తూర్పున బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై దారుణ హత్యాచారం ఘటనపై యావత్ దేశం రగిలిపోతోంది. ఈ ఘటనలో అసలు మానవ మృగాలెవరో తెలియని స్థితిలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంటే, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది. ఈ కేసును సుమోటోగా విచారణకు సర్వొన్నత న్యాయస్థానం సర్వసన్నద్ధమైంది. ఇంతలోనే దేశానికి పశ్చిమ దిక్కులోని మహారాష్ట్ర‌లో మరో దురాగతం వెలుగు చూసింది. ఇక్కడి జనం తీవ్ర ఆగ్రహజ్వాలలతో రగిలిపోయారు. ప్రభుత్వం మాత్రం చేతికి చమురు అంటని రీతిలో వ్యవహరించింది. దీంతో జాతీయ మానవ హక్కుల సంఘం చలించిపోయింది. బద్లాపూర్‌లో ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి నివేదిక ఇవ్వాలని మాన‌వ హ‌క్కుల కమిషన్ కూడా కోరింది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో జాప్యానికి గల కారణం, దాని పరిస్థితి, బాధిత బాలికల ఆరోగ్యం తదితర అంశాలను సమగ్ర నివేదికలో పొందుపరచాలని కమిషన్‌ ఆదేశించింది. మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 18న ఇద్దరు మైనర్ విద్యార్థినులపై ఓ పాఠశాల ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మీడియా నివేదికను తామే స్వయంగా స్వీకరించామని తెలిపింది.

- Advertisement -

మహిళ సిబ్బంది లేరా?
బద్లాపూర్‌ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా ఉద్యోగిని ఎందుకు నియమించలేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. అదే సమయంలో పోలీసులక ఫిర్యాదు చేసిన 12 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మీడియా కథనం నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘన అని, దానిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. బాధితులకు అధికారులు లేదా పాఠశాల యాజమాన్యం ఏదైనా కౌన్సెలింగ్ ఇచ్చారా? అని కూడా తెలుసుకోవాలని ఎన్ హెచ్ ఆర్సీ భావిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఏం ప్రతిపాదించారో కూడా నివేదికలో పేర్కొనాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లోగా అధికారుల నుంచి సమాధానం వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వంలో అలజడి

ఎన్ హెచ్చార్సీ జోక్యంతో మహారాష్ర్ట ప్రభుత్వంలో అలజడి రేగింది. ఎన్ హెచ్చార్సీ నోటీసుల ప్రభావంతో.. బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. మరోవైపు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్తి సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, ఉజ్వల్‌ నికమ్‌ను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. ఇక పోలీసులు కూడా స్నందించారు. కేసు నమోదు జాప్యానికి కారణాలు వినిపించారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు కేసు నమోదు చేసి , 3.30 గంటలకు నిందితుడిని అరెస్టు చేసినట్టు డీసీపీ సుధాకర్ పఠారే వివరించారు. బాధితులు చిన్నారులు కావటంతో వారి నుంచి సమాచార సేకరణ చాల క్లిష్టమైందని, సున్నితమైందని, అందుకే వివరాల సేకరణలో ఆలస్యం కావటంతోనే కేసు నమోదులో జాప్యం అనివార్యమైందని వివరించారు. ఇక స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, మహిళ సిబ్బందిపై సస్పెండ్ వేటు వేశారు. వీరి ముగ్గురిని బాధ్యులుగా గుర్తించారు. ఇక కేసు నమోదులో అలసత్వం ప్రదర్శించిన స్థానిక పోలీసు అధికారిని బదిలీ చేశారు. సీనియర్ ఇన్స్ పెక్టర్ సహా ఏ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

అసలేం జరిగింది?

బద్లాపూర్ ఈస్ట్‌లోని ఓ కిండర్ గార్టెన్ స్కూలులో వాష్ రూమ్ క్లీనర్ ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినట్లు వెలుగులోకి వచ్చింది. స్కూల్ టాయిలెట్లను శుభ్రం చేసే అక్షయ్ షిండే అనే వ్యక్తి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. బాధితుల్లో ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఆరేళ్లు. ఈ ఘటన ఆగస్టు 12, 13 తేదీల్లో జరిగింది. వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్దాపూర్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్ గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్ పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ఫ్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా జనం ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు. చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లారీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్ధాపూర్లో రైల్ రోకో కారణంగా అంబర్నాధ్-కజ్రట్ మారంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12 దూర ప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ఆందోళనతోనూ.. మీడియా కథనలాపై ఎన్ హెచ్ ఆర్సీ తీవ్రంగ స్పందించింది.

దోషులకు కఠిన శిక్షలే సరి…

దేశ వ్యాప్తంగా బాలికలు, విద్యార్థినులు, మహిళలపై వరుసగా చోటు చేసుకొంటున్న అత్యాచార లైంగిక వేదింపుల ఘటన నేపథ్యంలో… సభ్య సమాజంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కళ్లెదుటే హత్యలు జరుగుతున్నా… హత్యాచారాలు అలజడి సృష్టిస్తుంటే.. పోలీసులు పెట్టే కేసులతో అసలు దోషుల్లో కనీసం ఆందోళన వ్యక్తం కావటం లేదు. కోల్కతా వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అదుసులోకి తీసుకుని ప్రశ్నిస్తే… ఈ ఘటన తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, తనను ఉరితీసినా బాధపడనంటూ నిందితుడు ఏమాత్రం భయపడలేదు. ఇలాంటి స్థితిలో… అభం శుభం ఎరుగని పసికందులపై… చిన్నారులపై తెగబడుతున్న మృగాలను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల తరహాలో కఠినాతికఠిన శిక్షలు విధించాలని, ఇటీవల దుబాయ్ ప్రభుత్వం బహిరంగంగా జనం మధ్యనే రేపిస్టుల శిరచ్ఛేదనం చేసింది. అదే తరహాలో రేపిస్టుల అంగాలను తొలగించాలని , అప్పుడే ఆడ పిల్లలంటే ఈ మృగాళ్లు భయపడతారని సోషల్ మీడియా మార్మోగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement