Thursday, November 21, 2024

Exclusive – వారి గోస వింటే … ప్రజలు వెన్నంటే!

ప్రజాస్వామ్యంలో ‘ఆందోళన’ ఓ సాధనం

అది ప్రభుత్వంపై ధిక్కారస్వరం కానేకాదు

నిరసనలకు కారణాలు తెలుసుకోవాలి

సంప్రదింపులు ఓ పరిష్కార మార్గం

గ్రూప్‌ 1 అభ్యర్థుల గోడు వినాలి

- Advertisement -

ఇప్పుడు పీసీసీ చొరవ అవసరం

కమిటీ వేసి ప్రత్యక్ష చర్చలు జరపాలి

అప్పుడే ప్రజాప్రభుత్వంగా మన్నన

మెట్టుదిగితే నష్టం లేదువిస్మరిస్తే అంతే సంగతులు

గత అనుభవాల పాఠం అదే

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఛార్జ్‌)’

‘జీవో 29 వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని కొందరు గ్రూప్‌ 1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు అణచివేత పరిష్కారం కాదు. తమది ప్రజాపాలనగా, ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు.. వారి గోడు వినడం కనీస ధర్మం. ఏ ఆందోళనలపైనైనా ఉక్కుపాదం మోపడం పరిష్కారం కాదు. రాష్ట్రంలో ఏదో ఒక అంశంపై… ఎక్కడైనా.. ఎప్పుడైనా ప్రజలు ఆందోళనలకు దిగడం ప్రజాస్వామ్యంలో మామూలే. అంతమాత్రాన అది ప్రభుత్వ ధిక్కారంగా పరిగణించకూడదు. ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కొన్ని పరిమితులు ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో పీసీసీ చొరవ తీసుకోవాలి. ఆందోళన చేస్తున్న అభ్యర్థులతో సంప్రదింపులు జరపాలి. ఓ కమిటీ వేసి వారివద్దకే వెళ్లాలి. న్యాయమైన అంశాలుంటే పరిష్కరించాలి. అసలు వారి గోడు వినడానికే ఇష్టత చూపకపోతే కష్టాలు తప్పవు. గతంలో అణచివేత మార్గాన్ని అనుసరించిన పార్టీలకు ఎదురైన చేదు అనుభవాలు ఓ హెచ్చరికగా తీసుకోవాలి.

.”హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:సవాలక్ష వివాదాల నేపథ్యంలో వాయిదాల పర్వం దాటి.. ఎట్టకేలకు రాష్ట్రంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమైనాయి. మరో నాలుగు రోజులపాటు కొనసాగుతాయి. చాలాకాలంగా సాగిన ఈ వివాదంపై హైకోర్టు ఇంకా విచారణ పూర్తి చేసి తుది తీర్పు ఇవ్వవలసి ఉంది. ఫలితాలు ప్రకటించేలోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ వివాదం సద్దుమణగిపోతుందని చెప్పలేం.

నిరసన స్వరాలు విన్పిస్తూనే ఉంటాయి. అపోహలు, భయాలు ఆందోళనకు ఊపిరిపోస్తూనే ఉంటాయి. ధర్నాలు.. బైఠాయింపులు, వివిధ రాజకీయ పక్షాల మద్దతులు.. ర్యాలీలు, విమర్శలు, ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం రాజధర్మం పాటించాలి. ఆందోళనకారులను ప్రత్యర్థులుగా చూడకూడదు. వారివెనుక ఉన్న పార్టీలు లేదా ఇతర శక్తులను చూసి నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలి. అందుకోసం ఆందోళనకారులతో సంప్రదింపులు జరపడం కనీస ధర్మం. ముఖ్యమంత్రి, మంత్రులకు కొన్ని పరిమితులు ఉండవచ్చు. అందువల్ల ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చొరవ చూపడం విజ్ఞత అన్పించుకుంటుంది.

పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే కొందరితో గాంధీభవన్‌లో మాట్లాడారు. అయితే అంతటితో ఆగిపోరాదు. ఆందోళనలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికే వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. వారి వాదనలు వినాలి. ఇది కొంత సాహసంతో కూడిన వ్యవహారమే. ఆందోళనకారుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్పాలి. న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి తోడ్పడాలి. ఆందోళనకారులతో చర్చలకు పీసీసీ ఒక కమిటీని వేయడం ఉత్తమం. కాస్త ఓపిక, సహనం, గ్రూప్‌ 1 వివాదంపై అవగాహన ఉన్నవారిని ఆ కమిటీలో సభ్యులుగా వేయాలి. తమది ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, నిజంగా ఆ కీర్తిని పొందాలంటే, జనం చెంతకు వెళ్లాల్సిందే. అప్పుడే ప్రజలు కాంగ్రెస్‌ వెంట నిలుస్తారు.. నడుస్తారు.

గ్రూప్‌ 1 పరీక్షల వ్యవహారంలోనే కాదు.. మూసీ బాధితుల విషయంలోనైనా, హైడ్రా కూల్చివేతల విషయంలోనైనా.. లేదా ఇతర అంశాలపైనైనా ఈ తరహా విధానం ఉత్తమ మార్గం.. అప్పుడే ప్రభుత్వం పట్ల.. కాంగ్రెస్‌ పట్ల విశ్వసనీయత ఉంటుంది. ఇది అప్రతిహత విజయాలను అందిస్తుంది. ఈ సూక్ష్మాన్ని విస్మరిస్తే ప్రజలు కూడా అదే చేస్తారు.తెలంగాణ సంస్కృతి విభిన్నమైనది. విస్తృతమైనది. ప్రశ్నించడం, నిలదీయడం, నిరసన తెలపడం ఈ నేలపై పుట్టిన.. ఇక్కడి నీటిని తాగిన ప్రతి ఒక్కరిలో ఉండే లక్షణం. బందూకులెత్తిన నిజాంపై ఉద్యమించిన నేల ఇది. అణచివేతలను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గడ్డ ఇది.

అసలు ప్రత్యేక తెలంగాణను కోరుకున్నదే నియామకాలు, నిధులు, నీళ్ల కోసం. అందువల్ల సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఆందోళనబాట పట్టడం రాష్ట్ర ప్రజల ఉపయోగించే తొలి ఆయుధం. ఇది ప్రభుత్వాలకు తెలియని విషయం కాదు. కానీ అధికారంలోకి వచ్చేసరికి కొన్ని పరిమితులు ఏర్పడతాయి. రాజకీయాలు మొదలవుతాయి. ఆందోళనలన్నీ విపక్షాల ఎత్తులు జిత్తులుగా కన్పిస్తాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ప్రజాబాహుళ్యంలో సందేహాలు వ్యక్తం కావచ్చు. అపోహలు కలగవచ్చు. కొన్ని పార్టీలు లబ్దికోసం రాజకీయాలు చేయవచ్చు. కొన్ని శక్తులు బాధితులను రెచ్చగొట్టవచ్చు. అశాంతిని సృష్టించే ప్రయత్నం చేయొచ్చు. అదిగో.. అలాంటప్పుడే ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ అప్రమత్తం కావాలి. తెలివిడిని ప్రదర్శించాలి. చాకచక్యంతో చక్కబెట్టాలి. విశాలహృదయంతో స్పందించాలి. సమస్య మూలాల్లోకి వెళ్లాలి. శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తమ నిర్ణయమే ఉత్తమమని పట్టుబట్టి ఉండకూడదు.

ఆందోళన చేస్తున్నవారి వాదనల్లోని వాస్తవాలు గ్రహించాలి. వారి వాదనలో బలం లేనపుడు, అవి అపోహలే అయినప్పుడు వారికి విడమరచి చెప్పాలి. కేవలం రాజకీయ ప్రకటనలతోనే, భరోసాతోనో ప్రజల మనసు గెలవలేం. మధ్యవర్తులు, రాజకీయ పక్షాల మాటలను.. ఆందోళనకారుల వాదనగా తీసుకోరాదు. ఈ విషయంలో ఆందోళనకారులకు, ప్రభుత్వానికి అంతరం పెరగకుండా పీసీసీ చొరవ తీసుకోవడం సముచితం. సంప్రదింపులు ఒక మార్గం. కనీసం ఆ ప్రయత్నం చేయడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది.

ప్రభుత్వం లేదా అధికారపక్షం తమ గోడు వింటున్నదన్న ధీమా కలుగుతుంది. ప్రజల విశ్వాసం చూరగొనకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమవుతుంది. ఎన్నికలప్పుడు అది ప్రభావం చూపుతుంది. గతానుభవాలు అదే చెప్పాయి.

.తెలంగాణ కోసం అప్పటి టీఆర్‌ఎస్‌ (తరువాత బీఆర్‌ఎస్‌) చేయని పోరాటం లేదు. ప్రజలను సమీకరించి ఉద్యమించింది. సకల జనుల సమ్మె, వంటావార్పు.. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో ఆందోళనలు ఇలా అనేక రూపాల్లో ఉద్యమించింది. చాలా పార్టీలు మద్దతిచ్చాయి. అందుకే ఆ పార్టీకి ప్రజలు రెండుసార్లు పట్టంగట్టారు.

కానీ అధికారంలోకి వచ్చాక.. అనేక కారణాలవల్ల ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. ధర్నాచౌక్‌లో ఎవరినీ అడుగుపెట్టనివ్వలేదు. నిరసనలు, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. ప్రజాసంఘాలకు కళ్లెం వేసింది. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపాయి. కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలు, కొన్ని ప్రజాసంఘాలపై అనుమానంతో అప్పటి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. అదే సందర్భంలో కాంగ్రెస్‌ ప్రజలకు మాటిచ్చింది. నిరసన గళం విప్పడానికి, తమ స్వరం విన్పించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవకాశం ఇస్తానని రేవంత్‌ బృందం హామీ ఇచ్చింది. మాటిచ్చినట్టే ధర్నా చౌక్‌ గేట్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై స్వేచ్ఛగా అభిప్రాయలు చెప్పుకునే అవకాశం వచ్చింది.

కానీ గ్రూప్‌ 1 ఆందోళనకారుల విషయంలో కొంత కఠినంగా ప్రభుత్వం వ్యహరిస్తోంది. లాఠీచార్జ్‌లాంటివి అందుకు ఉదాహరణ. తెలంగాణ యువత ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ ఆశలు అడియాసలవుతాయన్న భయంతో ఆందోళనబాట పట్టారు. అది తప్పు కాదు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకాల ప్రక్రియ వేగం పుంజుకుంది. మెగా డీఎస్‌సీ నిర్వహించి, కేవలం 65 రోజుల్లో 11వేల ఉపాధ్యాయ నియామకాలే అందుకు ఉదాహరణ. ఇతర అనేక శాఖల్లో నియామకాలు పూర్తయ్యాయి. మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి. గ్రూప్‌ 1 నియామకాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేవంత్‌ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండవచ్చు. తమ ఉదాత్తమైన లక్ష్యాన్ని ఆందోళనకారులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఏ ఒక్కరికీ అన్యాయ జరగకుండా, న్యాయవివాదాలు తలెత్తకుండా ఆ ప్రక్రియ జరగాలి.

అందుకు ప్రభుత్వం లేదా అధికార పార్టీ చొరవ చూపాలి. అది ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ కనీస కర్తవ్యం. ప్రజల గోస వింటే.. సమస్యలు పరిష్కరిస్తే.. సందేహాలు తొలగిస్తే వారు మీ వెన్నంటే ఉంటారు. ఇక్కడ ఇంకో నిష్ఠుర సత్యం చెప్పుకోవాలి. అధికారపక్షమే కాదు.. తమ గోడును సరిగ్గా అర్థం చేసుకుని ఎవరు అండగా ఉంటే వారికే మద్దతిస్తారు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని కాంగ్రెస్‌ అడుగులు వేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement