Monday, September 30, 2024

Exclusive ప్రభుత్వ శాఖల రచ్చ – హైడ్రాకు తెస్తున్న మచ్చ

ఎవరిది పాపం? ఎవరికి శాపం
మనన్న పొందిన హైడ్రా యాక్షన్‌ –
చుక్కెదురైన మూసీ ఆపరేషన్‌ గీత దాటని హైడ్రా
ప్రభుత్వ శాఖల గత్తర కార్యాచరణకు ప్రణాళికల్లేవ్‌…
అత్యుత్సాహం – సామాన్యలకు చెలగాటం
అధికారుల మధ్య ఈర్షే మూలం –
సరిదిద్దకపోతే తప్పదు మూల్యం
సామాజిక, రాజకీయ నిపుణుల సూచనలు

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేవలం చిత్తశుద్ధి ప్రదర్శిస్తే సరిపోదు… ఆచరణలోనూ ఆదర్శవంతంగా ఉండాలి… చేసేది మంచి పనే కదా అని అత్యుత్సాహం ప్రదర్శిస్తే… చివరకు మిగిలేది కష్టనిష్టూరాలే! ఇది సరిగ్గా అతికినట్టు సరిపోతుంది నేడు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆపరేషన్‌ మూసీ కార్యాచరణ! ఎంతో ముందు చూపుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనతో పాటు ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడానికి పెద్దఎత్తున ఆక్రమణల తొలగింపులు, కట్టడాల కూల్చివేతలను ప్రారంభించారు

దీర్ఘకాలిక లక్ష్యంతో సాగాల్సిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమర సన్నాహాలతో చేస్తున్నట్టు యంత్రాంగం కదలడంతో అసలు సమస్య మొదలైంది. కేవలం ఆయా చెరువుల పరిరక్షణకు హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న భవనాల కూల్చివేతలు తొలుత మన్ననలను అందుకున్నాయనే చెప్పాలి. అయితే, అదే సమయంలో ఆపరేషన్‌ మూసీ పేరుతో రివర్‌ఫ్రంట్‌ సుందరీకరణ పేరుతో మరో ప్రణాళికను కూడా ప్రభుత్వం చేపట్టింది.

ఇదిగో ఇక్కడి నుంచే సమస్య జఠిలమైంది.ప్రభుత్వమంటే అనేక శాఖల సమాహారం. చేతికి అయిదువేళ్లు అలంకారం కాదు… అవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్య వలె ఒకే పనిని సంయుక్తంగా ఒక పద్ధతి ప్రకారం యధాశక్తితో చేస్తాయి. ఇది సర్వసామాన్య ప్రాకృతిక వ్యవహారం. అయితే, ప్రభుత్వ శాఖలు అదే సమీకరణతో పనిచేయక పోవడం వల్లే సామాజిక సమస్యలు ఉత్పన్నమయ్యేది. ఏ సామాజికవేత్తను కదిలించినా ఇదే సమాధానం వస్తుంది.

- Advertisement -

మరి ప్రభుత్వ శాఖలు అంతే సమన్వయంతో ఎందుకు పనిచేయలేకపోతున్నాయి? ఒకే ఒక సమాధానం వస్తుంది… కొందరు అధికారుల వ్యక్తిగత, సంకుచిత, స్వార్ధపూరిత చర్యల వల్లే! ఎలాగంటే, హైడ్రాను మరింత సమర్ధంగా పనిచేయాలన్న సంకల్పంతో ఆయా ప్రభుత్వ శాఖలను ఆ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చి సమన్వయంతో పనిచేయాలని చెప్పింది ప్రభుత్వం. సరిగ్గా ఇక్కడి నుంచే మొదలయ్యాయి అధికార గణంలో వ్యక్తిగత భేషజాలు!

హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఇవ్వలేదు. దానికి అప్పగించిన పని ఆయా శాఖల సమాచారం, సమన్వయంతో ఆయా చెరువుల పరిధిలో ఆక్రమణలను అధికారిక మ్యాపుల ప్రకారం పరిరక్షించడమే. ఇందుకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడమే. అయితే, మానవతా దృక్పథంతో ఇక్కడ కూడా హైడ్రా వ్యవహరించింది. కేవలం నిర్మాణంలో ఉన్న నివాస గృహ సముదాయాలనే కూల్చింది… కూలుస్తోంది.

అదేవిధంగా, ఆయా ప్రాంతాల్లో కబ్జా చేసి తాత్కాలిక నిర్మాణాలలో వాణిజ్య కార్యక్రమాలు చేస్తున్న వాటిని కూడా తొలగించింది. ఎన్‌ కన్వెన్షన్‌తో ఇది మొదలై చాలా సాఫీగా సాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారాన్ని గమనించిన సమాజం మొత్తం హైడ్రా యాక్టివిటీని స్వాగతించింది. పైగా జిల్లాల్లో కూడా హైడ్రా వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరిగాయంటే, వాస్తవంగా హైడ్రా చేపట్టిన చర్యలకు ఆమోదించినట్టే కదా!

ఈ దశలో న్యాయస్థానాలు కల్పించుకున్నా, నిబంధనలను అనసరించి వ్యవహరించాలని మాత్రమే హైడ్రాకు సూచించడం గమనార్హం. పైగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, జనసామాన్యానికి ఇబ్బంది కలిగించే భవనాలను నిర్దాక్షిణ్యంగా బుల్‌డోజర్లు కూల్చివేయవచ్చునని స్పష్టం చేసింది కూడా! అంటే, రాష్ట్రంలో హైడ్రా గీత దాటలేదనే కదా అర్ధం!

ఇక ఆపరేషన్‌ మూసీ వ్యవహారానికి వస్తే, ఏళ్ల తరబడి కళ్లు మూసుకుని వ్యవహరించిన ఆయా శాఖలు హైడ్రాకు వస్తున్న మంచి పేరుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆయా శాఖల ఉన్నతాధికారగణం కూడా ఈర్ష్యతో రగిలిపోయినట్టు అర్ధమవుతోంది. ఎందుకంటే, ఎన్నో ఏళ్లుగా మూసీ నదీ గర్భంలో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఒక్కసారిగా కళ్లు తిరిగే స్థాయిలో నోటీసుల మీద నోటీసులు పంపించారు.

యాభై ఏళ్లకు పైగా ఆయా శాఖల పాపాలే కదా నేటి నదీ గర్భంలో కట్టడాలు! ఏమాత్రం ప్రణాళిక, ముందస్తు వ్యూహం లేకుండా విరుచుకుపడ్డారు. అసలు మూసీ నది పరిధి ఎక్కడ, ఎంత వరకూ ఉందో తెలియజెబుతూ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఆయా సరిహద్దుల పరిధిలో ఉన్న నివాస గృహాల వారికి నచ్చజెప్పాలి. ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఎక్కడ ఇస్తున్నదీ వివరించాలి. బఫర్‌జోన్‌ పరిధిలో పట్టాదారులు ఉంటే వారికి ఏవిధంగా ఎంత నష్టపరిహారం ఇస్తున్నదీ తెలియజేయాలి. సంప్రదించి, సమాధాన పరిచి, సంతృప్తి చెందిన వారిని నెమ్మదిగా తరలించాలి. వాస్తవానికి ఇవేమీ లేకుండానే ఆయా శాఖల అధికారులు వ్యవహరించారు.

హైడ్రా కంటే వేగంగా తామూ ఖాళీ చేయించగలమని ప్రభుత్వ పెద్దల ముందు సామాన్య భాషలో చెప్పాలంటే, ఫోజు కొట్టడానికే ఆపరేషన్‌ మూసీలో అధికారులు వ్యవహరించారన్న అపప్రధ వచ్చింది.చేతులు కాలాలక ఆకులు పట్టుకున్న చందంగా హడావుడిగా నష్టపరిహారం గురించి, ప్రత్యామ్నాయ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు గురించి ఎంత చెప్పినా బాధితులను ఊరడించలేకపోయారన్నది వాస్తవం.

వాస్తవానికి మూసీ సుందరీకరణ వల్ల నగరాభివృద్ధి చెంది ఉపాధి, వ్యాపారాలు పెరుగుతాయన్నది నిజం. ట్రాఫిక్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. పర్యాటక రంగం అద్భుతంగా రాణిస్తుంది. కాని, కష్టనష్టాలతో సామాన్యుడి శాపనార్ధాలతో అవన్నీ ఎలా సాధించడం సాధ్యం?! ప్రభుత్వ పెద్దలు కాని, ఆయా అఖిల భారత సర్వీసు అధికారులు కాని ఈ విషయంలో ఏమాత్రం చొరవ చూపలేకపోయారు. ప్రభుత్వ పెద్దల ఆజ్ఞలను శిరసావహించడమే మహాభాగ్యం అన్నట్టు వ్యవహరించారు. పైగా, హైడ్రాకు వచ్చిన మంచి పేరుతో మరింత రగిలిపోయారు. తమకు దక్కాల్సిన గౌరవమర్యాదలు ఎవరో లాక్కుపోతున్నట్టు సంకుచితంగా వ్యవహరించారు. ఫలితమే ఆపరేషన్‌ మూసీ విషాదం!

ప్రకృతి పరిరక్షణ ఎంతో అవసరం… అది అందరి బాధ్యత కూడా! అదే సమయంలో దానితో ముడిపడి ఉన్న మానవ జీవితాల్ని చిందరవందర చేయకుండా జాగ్రత్త వహించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వ పెద్దలది, ఆయా శాఖల ఉన్నతాధికారులది కూడా అని సమాజికవేత్తలు సూచిస్తున్నారు. ఇంతకాలం అక్కడ నివసిస్తున్న సామాన్యులకు ఏ చిన్న సదుపాయం కావాలన్నా కరెన్సీతో మాట్లాడిన ఆయా శాఖలు ఇప్పుడు మహోగ్రంగా మూసీ ముంచెత్తినట్టు వ్యవహరించి అర్ధరాత్రి తొలగింపు కార్యక్రమాలు చేపట్టడమే దారుణాతిదారుణం. ఇందులో హైడ్రాకు ఇసుమంతైనా సంబంధం ఉందా? కేవలం రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల వైపరీత్యం తప్ప?!

Advertisement

తాజా వార్తలు

Advertisement