Friday, November 15, 2024

Exclusive – భగ్గుమన్న బంగ్లా! – తిరగబడ్డ యువలోకం

రాజీనామాచేసి పరారైన ప్రధాని
నియంతపాలన వద్దంటూ ఆందోళనలు
సైనిక పాలన కూడా వద్దని ఆగ్రహం
రాజధాని ఢాకాలో అగ్గి మంటలు
ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టిన నిరసనకారులు
తగలబడుతున్న భవంతులు
బంగ్లా మాజీ కెప్టెన్​ ఇంటికి నిప్పు
పలువురు ప్రజాప్రతినిధుల ఆస్తులు ధ్వంసం
మృతుల సంఖ్య 109కి చేరిక
ఉద్యమంలో 409 మంది బలి
తెరమీదకు మధ్యంతర ప్రభుత్వం
నోబుల్ గ్రహీత ఆచార్య యూనస్​కు చాన్స్​
ఆమోదం తెలుపుతున్న దేశ యువత

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్​ డెస్క్ : 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ యుద్ధవీరులుగా పేర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒక వంతు వారి పిల్లలకు రిజర్వ్ చేశారు. మరికొన్ని ఉద్యోగాలు మహిళలు, మైనారిటీలు, వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి. యుద్ధవీరుల పిల్లల కోసం మూడింట ఒకవంతు పోస్ట్‌లు కేటాయించడం వివక్షతో కూడుకున్నదని, ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2018లో ఇలాంటి నిరసనలే వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. కానీ, ఆ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్ ప్రారంభంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనలకు దారితీసింది.

- Advertisement -

హైకోర్టు ఆదేశాలు ర‌ద్దు చేయాల‌ని..

హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేయాలని అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో, తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా దేశంలో నిరసనలు ఆగలేదు. కోటా రద్దు డిమాండ్ను వదిలి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్‌తో నిరసనలు తీవ్ర రూపందాల్చాయి.

రగిలిన యువత గుండె..

అయిదు దశాబ్దాలుగా నిరుద్యోగం పీడిస్తోంది. ఉపాధి కోసం భారత్ కు ఖాందిసీకులుగా వలస పోతున్న దుస్థితి ఇంకా పెరుగుతూనే ఉంది. స్థానికంగా ఉపాధి లేదు. చేతిలో పని లేక .. ఇల్లుగడవని స్థితిలో దేశ జనాభాలో 5.8 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. 4.8 శాతానికి నిరుద్యోగం పెరిగింది. ఇవన్నీ కాకిలెక్కలే. ఇలా తమ చావు తాము చస్తుంటే….పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన బంగ్లా దేశీయుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు పైగా ఉన్నారు. అందులో దాదాపు 3 కోట్లకు పైగా యువకులు నిరుద్యోగులుగా ఉండగా, వారిలో కొందరు విద్యకు దూరం అయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం కొట్టేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాలనే తాము శిరసావహిస్తామని షేక్ హసీనా స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో పరిస్థితి బాగా తీవ్రం అయింది.

బంగ్లా అతలాకుతలం..

ప్రజాస్వామ్య దేశంలో నియతృత్వ పోకడపై ఎంత తిరుగుబాటు జరుగుతుందో .. బంగ్లాదేశ్ యువత నిరూపించింది. గత జూలై నెల నుంచి ఆరంభమైన ఆందోళన కాస్త.. హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ప్రధాని హసీనా ఇంటిని ముట్టడించారు. చొరబడ్డారు. యువత అదుపు తప్పింది. ఇక సైన్యం తనపని తాను చేసింది. కాల్పులు తప్పలేదు. ఈ హింస కాండలో ఈ రెండు రోజుల్లో 109 మంది యువకులు చనిపోయారు. కానీ యువత ఆగ్రహజ్వాల ఆగలేదు. సైన్యం చేతులెత్తేసింది. ప్రధాని హసీనా భారత్ కు చేరుకుంది. మధ్యంతర ప్రభుత్వానికి బంగ్లాదేశ్ సైన్యం తలుపులు తెరిచింది. ఆదివారం (ఆగస్టు 4) జరిగిన ఘర్షణల్లో 14 మంది పోలీసు అధికారులు, మరో 68 మంది మరణించారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ ప్రజలవైపే నిలబడ్డారు. దళాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ హత్యలను ఖండించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాయని అని పేర్కొన్నారు. ఇక చివరి నిరసనగా ఢాకాకు లాంగ్ మార్చ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఇంటిని కూడా ముట్టడించారు. దీంతో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

తెరమీదకు తాత్కాలిక ప్రభుత్వం

ఇక యువత ఆగ్రహాన్ని చల్లార్చటానికి తాత్కాలిక ప్రభుత్వమే శరణ్యమని బంగ్లాదేశ్ మిలటరీ భావించింది. అయితే, సైన్యం, నియంతల చేతిలో తమ దేశాన్ని అప్పగించేది లేదని యువత భీష్మించింది. ఈ స్థితిలో నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అంగీకరించారని సమాచారం. విద్యార్థులపై ప్రభుత్వం అతిగా ప్రదర్శించిందని అందుకు మూల్యం చెల్లించుకున్నారని యూనస్ అన్నారు. విద్యార్థులు చేసిన ఈ త్యాగం తన బాధ్యతను మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు. ఈయన మొదటి నుంచి షేక్ హసీనా పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఆయన మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తే ఓ నోబెల్ గ్రహీత దేశ పాలకుడు కావడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. కాగా, బంగ్లాదేశాధ్య‌క్షుడు పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేశారు.. త్వ‌ర‌లోనే తాత్కాలిక ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఆమె చట్టూ అన్నీ వివాదాలే

ప్రజల గుండెల్నే అమ్మ ఒడిగా చేసుకుని బంగ్లాదేశ్ ప్రధానిగా ఎదిగిన హసీనా బేగం రాజకీయ భవిష్యత్తు అధోపాతానికి దిగజారిపోవటానికి కారణం.. ఆమె చుట్టూ అన్నీ వివాదాలే కనిపిస్తాయి. 2024 జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇటీవల జరిగిన హింసాత్మక ఆందోళనలు షేక్ హసీనాకు సవాల్‌గా మారాయి. వివాదాస్పదంగా జరిగిన ఎన్నికల్లో హసీనా పార్టీ వరుసగా నాలుగోసారి విజయం సాధించింది. కానీ ఆమె నిర్ణయాలే ఆమెను దెబ్బతీశాయి. రాజీనామా చేయాలంటూ షేక్ హసీనాపై ఒత్తిడి పెరిగినప్పటికీ.. ఆమె పట్టించుకోలేదు. ఆందోళనకారులను ఆమె టెర్రరిస్టులుగా అభివర్ణించారు. అలాంటి వారిని కఠినంగా అణిచివేయడానికి సహకరించాలని కోరారు.

సివిల్ స‌ర్వీస్‌లోనూ కోటా ర‌ద్దు..

సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాను రద్దుచేయాలని ఢాకాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇటీవల మొదలైన ఆందోళనల తీవ్రత పెరిగి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో భారీగా పెరిగిన జీవన వ్యయంతో బంగ్లాదేశ్ సతమతమవుతోంది. ఇటీవల ద్రవ్యోల్బణం రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది. విదేశీ మారక నిల్వలు వేగంగా పడిపోయాయి. గత 8ఏళ్లలో విదేశీ రుణ భారం రెట్టింపయ్యింది. హసీనా ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలవల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శకులు ఆరోపించారు. గతంలో బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతి హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే సాయపడిందని, అవినీతి కారణంగానే ఇలా జరిగిందని కొందరు విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మానవహక్కులను అణచివేశారని, హసీనా పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, విరోధులు, మీడియాపై తీవ్రస్థాయి అణిచివేత జరుగుతోందని ఆమె వ్యతిరేకులు ఆరోపించారు.

ఇది మరో పాకిస్థానే : హసీనా తనయుడు

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా నేపథ్యంలో ఆమె కుమారుడు సాజీద్‌ వాజెద్‌ జాయ్‌ సైన్యానికి కీలకసూచన చేశారు. ఎన్నిక కానివారికి ప్రభుత్వాధికారం అప్పగించవద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యత అని పేర్కొన్నారు. ఒకవేళ వారికి ప్రభుత్వాధికారం అప్పగిస్తే, బంగ్లాదేశ్‌ మరో పాకిస్థాన్‌ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్‌ సాధించిన ప్రగతి నాశనం అవుతుందని హసీనా కుమారుడు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు.

మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్‌ హసీనా

మరోవైపు బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా రాజకీయ శరణార్థిగా ఉండేందుకు యూకేను ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్‌లో ఉండేందుకు దిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో హసీనాకు భారత్‌ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.

హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక అమెరికా హస్తం?

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్మగర్భంగా సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై, తీవ్ర నిరసనల మధ్య ఆమె కట్టుబట్టలతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు.

సిగ్గుమాలిన చ‌ర్య‌గా ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న‌..

ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌ ఎన్నికలు జరిగాయి. దీనిని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) బహిష్కరించింది. ఆ తర్వాత ఈ ఎన్నికలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. పోలింగ్‌ ఇతర అంశాలను పరిశీలించేందుకు అమెరికా, కెనడా, రష్యా, ఓఐసీ, అరబ్‌ పార్లమెంట్‌ పరిశీలకులు వచ్చారు. ఎన్నికలు సాఫీగానే జరిగినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అమెరికా విదేశాంగశాఖ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. ఇది నాలుగోసారి ఎన్నికైన హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement