Saturday, November 16, 2024

Exclusive – సుర్రం చెరువు మాయం – కాంగ్రెస్ లీడ‌ర్ హస్తం

బి బాబు బ‌హ‌దూర్‌, ఆంధ్రప్రభ స్మార్ట్, ఇన్‌పుట్ ఇన్‌చార్జి

తెలంగాణ ప్రజల గొంతును నొక్కేసే విధంగా ఓ కాంగ్రెస్‌ నేత కౌగిలిలోని సరస్సు ఆక్రమణకు గురైన‌ కథ ఇది. ఇతర నాయకులకు భిన్నంగా.. ఈ కాంగ్రెస్ లీడ‌ర్ రంగారెడ్డి జిల్లా మంఖాల్ గ్రామంలోని సూర్యారావు (సుర్రం) చెరువును ఆక్రమించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ ఆక్రమణల‌ పర్వంలో ఎగువ ప్రాంతాల నుంచి ఊరుకులు పరుగులు పెట్టే వరద ప్రవాహానికి కాంక్రీట్ జంగిల్‌ అడ్డుకట్ట పడింది. శ్రీశైలం హైవేకి సమీపంలోని ఓ సరస్సుకు అడ్డంగా 50 శాతం రియల్ ఎస్టేట్ వెంచర్ ప్ర‌త్య‌క్షం కావ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది.అసలు విష‌యం ఏంటంటే..సూర్యారావు (సూర్రం) చెరువు, మంఖాల్ రెవెన్యూ గ్రామం, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. ఇది సర్వే నంబర్ 139లో 40.20 ఎకరాలు, సర్వే నంబర్ 140లో 20.12 ఎకరాల్లో విస్తరించి ఉంది.

- Advertisement -

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పహాడీషరీఫ్ ప్రాంతాల ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే చాలు.. వరద పరవళ్లు తొక్కుతుంది. ఈ వరద నీరు సరస్సులోకి చేరుతుంది. ఏమైందో కానీ, కొన్నెళ్లుగా ఈ సరస్సు పక్కనే ఒక వెంచర్‌ వెలసింది. ఈ వెంచర్‌ను హుటాహుటిన అభివృద్ధి చేస్తున్నారు. అంతే ఈ వెంచర్ సరస్సు ప్రాంతంలో మరింత విస్తరించింది. ఇన్‌ఫ్లో రాకుండా.. ఎగువ ప్రాంతాల నుంచి సరస్సులోకి నీటి ప్రవాహాన్ని నివారించడానికి కొన్ని కాంక్రీట్ నిర్మాణాలు కూడా చేపట్టారు.

మొదట్లో వేసిన సిమెంట్‌ పైపులైన్లపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, బాక్స్‌ డ్రెయిన్లు నిర్మించారు. దీనిని సరస్సు ప్రాంతం వరకు పొడిగించలేదు. ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు సరస్సులోకి ఎలా చేరుతుంది.

ఇక.. సరస్సు ఎగువ ప్రాంతాల్లోని జనజీవనం స్థంభించాల్సిందే కదా? ఇదీ జనం ప్రశ్న. ఇప్పటికే 60 ఎకరాల సరస్సు సగానికి చిక్కిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీశైలం హైవేకు సమీపంలో వెంచర్‌ ఉన్నప్పటికీ నీటిపారుదలశాఖ అధికారులు ఈ ‘అభివృద్ధి’ బురఖాను గమనించడంలో విఫలమయ్యారు. ఇంకా, ఎఫ్టీఎల్ను కాపాడేందుకు ప్రయత్నించటం లేదు.

ఈ కేఎల్ఆర్ సిటీ ఎవరిదీ?

తొలినాళ్లల్లో కేఎల్ఆర్ గిగా సిటీగా ఈ చెరువులో వెంచర్ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత అది వెర్టెక్స్ – కేఎల్ఆర్ గిగా సిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఇంతకీ ఈ వెంచర్ అధినేత ఎవరంటే? కేఎల్‌ఆర్‌గా పేరొందిన కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి అని స్థానికులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈయ‌న పోటీ చేశారు. ఎన్నికల్లో జనం ఆయనకు ఓట్లు ప్రసాదించలేదు. ఈ సీటు బీఆర్ఎస్ పార్టీకి దక్కింది.

ఎఫ్‌టీఎల్ పిక్స్ చేయ‌లేద‌ట‌..

ఇక.. అధికారులు పరిస్థితి ప‌రిశీలిస్తే.. రెవెన్యూ రికార్డుల ప్రకారం సూర్రం చెరువు 60 ఎకరాల్లో విస్తరించినట్టు నీటిపారుదల శాఖ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కానీ, ఈ 60 ఎక‌రాల‌ సరస్సు పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్)ను అధికారులు గుర్తించక పోవడం ఆసక్తికరమైన అంశం. ఇదే విషయంపై ఇరిగేషన్ డీఈఈ బీడీ నాయక్‌ను వివరణ కోరగా.. అన్ని సరస్సుల సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్ కూడా ఫిక్స్ చేశామని బదులిచ్చారు. సూర్రం చెరువు వివరాలను మాత్రం ఆయన వెల్లడించ లేదు.

కాంగ్రెస్ నేతల్లోనూ అలజడి..సూర్రం చెరువులో అక్రమ గిగా వెంచర్‌పై కాంగ్రెస్ నేతల్లోనూ అలజడి ఆరంభమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు హైడ్రా చీఫ్‌ రంగనాథ్ ఆక్రమణల పర్వంపై దూకుడు పెంచి.. ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేస్తుంటే… సొంత పార్టీ నాయకుడే సహజ పకృతి వనరులకు తూట్లు పొడవటాన్నిజీర్ణించుకోలేక పోతున్నారు.

చెరువులు, నాలాల విముక్తిలో అధినేత వ్యూహానికి జనామోదం లభించిన స్థితిలో.. సొంత పార్టీలోనే కబ్జాదారుల‌ కథకు చెక్ పెడతారా? లేదా? అని జనం భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ నేత, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరస్సు ప్రాంతాన్ని పునరుద్ధరించాలని, లేని పక్షంలో సరస్సుకు ఇరుగు పొరుగు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement