Friday, November 22, 2024

Exclusive – ఆర్ధిక నావ న‌డిపేద‌దెలా? రేవంత్ స‌ర్కార్ క‌స‌ర‌త్తు షురూ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త సర్కారుపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టు కునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో ప్రయత్నాలు మొదలు పెట్టా రు. పేద, మధ్యతరగతి వర్గాలు, ముఖ్యంగా 72 లక్షలు దాటిన రైతు కుటుంబాల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఆయన అందుకు కావలసిన వనరులను సంసిద్ధం చేసుకుంటు న్నారు. ఐదేళ్ళ పాటు రాష్ట్రానికి సుస్థిర పరి పాలన అందించే బాధ్యత తనపై, మంత్రి మండలిపై ఉన్న నేపథ్యంలో తాజాగా ఆది వారం ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను చక్కబెట్టే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ- శాఖల మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్న ఈ ఆర్థిక సమీక్షలో అతిముఖ్యమైన అంశం ఆరు గ్యారెంటీల అమలు, అందుకు అవసరమైన ఆర్థిక వనరులు కూడా ఒక భాగంగా చర్చ జరిగింది.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్‌ తన అనుభవాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు అవసరాలు, మరింత మెరుగైన ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పటికే అమల్లో ఉన్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కొత్తగా అమలు చేయాల్సిన ఆరు గ్యారెంటీల అమలు, ప్రజలకిచ్చిన ఇతర హామీలను నెరవేర్చే క్రమంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ఆర్థిక లోటును అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపైనా రఘురామరాజన్‌ ఒక కార్యాచరణను సూచించారు. మరో వారం, పది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఒక యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

ప్రారంభంలోనే రూ.5లక్షల 59వేల కోట్ల అప్పులు
ప్రభుత్వ ఏర్పాటైన కొత్తలోనే రూ.5లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణాను ఆర్థికపరంగా ఏవిధంగా గట్టెక్కించాలో సూచించాలని రఘురామ రాజన్‌ను ఈ భేటీలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి అడిగారు. పథకాల అమలు పెనుభారంగా మారకముందే వ్యవస్థను సుస్థిరపరచుకోవాల్సిన అవసరాలను గురించి అడిగారు. పథకాల వారీగా ఖర్చు చేస్తున్న నిధులు, ప్రతియేటా పెరగనున్న బడ్జెట్‌ అంచనాలు, రాష్ట్ర అప్పులపై చెల్లించే వడ్డీల మోత.. అదితర అంశాలపై కీలక చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది. కీలక శాఖల నుంచి రావాల్సిన రాబడులు కూడా ఆశాజనకంగా లేవు. రిజిస్ట్రేషన్లు, ఎ-కై-్సజ్‌ ఆదాయం, జీఎస్టీ, పెట్రోల్‌, డీజెల్‌పై వ్యాట్‌ ఇలాంటి ఆదాయ వనరులపై చాలామటుకు ఎఫెక్ట్‌ కనిపిస్తోంది.

ఎన్నికల క్రమంలో గణనీయంగా తగ్గిన ఆదాయం..
ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌ అప్పులను, ఆర్థిక పరిస్థితిని సమీక్ష చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడినప్పటి నుంచి అంటే సెప్టెంబర్‌ నుంచే ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అనుకున్న అంచనాల కంటే తక్కువ మొత్తంలో రాబడి వస్తోందని ఇటీవల అధికారులు కూడా నివేదించారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే 2024 మార్చి నాటికి రావాల్సిన మొత్తం రెవెన్యూ రూ.2.16 లక్షల కోట్లు-. అయితే ఇందులో రూ.లక్షా 15 వేల కోట్లు- మాత్రమే నవంబర్‌ చివరి నాటికి సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న రానున్న నాలుగు నెలల్లో లక్ష కోట్లు సమకూరాల్సి ఉంది.

- Advertisement -

అందిన కాడికి వసూళ్ళు చేసిన గత ప్రభుత్వం..
ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఎ-కై-్సజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, జీఎస్టీ, వ్యాట్‌ ద్వారానే సమకూరుతోంది. అయితే గత ప్రభుత్వం ముందస్తు లిక్కర్‌ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం, లైసెన్సులు ముందే కట్టబెట్టడంతో అప్పుడే రావాల్సినంత గత ప్రభుత్వం రాబడిని అందినకాడికి పిండుకుంది. ఇప్పుడు సరాసరిగా లిక్కర్‌ సేల్స్‌తో నెలకు రూ.2,300 కోట్లు- వస్తుంది. అనుకున్న టార్గెట్‌ ప్రకారమైతే 3 వేల కోట్ల నుంచి రూ.3.5 వేల కోట్ల దాకా రావాలి. ఇక స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌తో నవంబర్‌ చివరి నాటికి 12 వేల కోట్లు- రావాల్సి ఉండగా.. 9,500 కోట్లే వచ్చింది. 4 వేల కోట్లు- తగ్గింది. ఎన్నికల ఎఫెక్ట్‌ తో చెకింగ్‌ లతో రియల్‌ బూమ్‌ లేక భారీగా భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. అది కాస్తా సర్కార్‌ ఆదాయంపై పడింది.

కొత్తగా ఆర్‌బీఐ నుంచి తీసుకునే అప్పులకు నో చాన్స్‌..
జీఎస్టీ కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 51 వేల కోట్లు- లక్ష్యంగా ఉండగా.. నవంబర్‌ నాటికి వచ్చింది 30 వేల కోట్ల లోపే. మిగిలిన 4 నెలల్లో ఇంకా 20 వేల కోట్లు- రావడం కష్టమేనని అధికారులు అంటు-న్నారు. ప్రస్తుత ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అప్పులన్నీ మరో 4 నెలలు మిగిలి ఉండగానే పూర్తిగా గత ప్రభుత్వం తీసేసుకుంది. 12 నెలల కాలంలో తీసుకోవాల్సిన అప్పులను 8 నెలల్లోనే తీసుకుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. 2023-24లో దాదాపు 40 వేల కోట్లు- తీసుకోవాలని లక్ష్యంగా పెట్టు-కున్నారు. ఈ మొత్తం గత నవంబర్‌ లోనే అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందే తీసుకుంది. సగటు-న ప్రతినెలా దాదాపు 5వేల కోట్లు- అప్పు చేసింది. ఇప్పుడు కొత్తగా ఆర్‌బీఐ నుంచి అప్పులు తీసుకునే చాన్స్‌ లేకుండా చేసింది. ఇతర మార్గాల ద్వారా అప్పులు ఎట్లా సమకూర్చు కోవాలనే దానిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టింది. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏకంగా 5.3 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది.

శ్వేతపత్రాల ద్వారా ప్రజల దృష్టికి ఆర్థిక స్థితిగతులు
గత సర్కార్‌ అప్పుల విషయంలో ఏం చేసిందన్నది రాష్ట్ర ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి సర్కార్‌ భావిస్తోంది. అందుకే శ్వేతపత్రం రిలీజ్‌ చేయాలనుకుంటు-న్నారు. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇప్పటికే ఈ విషయంపై సమీక్ష జరిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్‌ 2వ తేదీ నుంచి ఈ ఏడాది డిసెంబర్‌ 7 వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్‌గా ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు- డిప్యూటీ- సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటు-న్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ-లు నెరవేర్చేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని వారిని కోరారు.

ఆరు గ్యారంటీల్లో కీలకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌..
మానవ వనరులను బలోపేతం చేసుకోవడం వల్ల జీడీపీ పెరుగుతుందని, ఈ ఉచితాలు.. మానవ వనరులపై పెట్టు-బడులుగానే చూడాలంటు-న్నారు రేవంత్‌ మంత్రిమండలి సభ్యులు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ-ల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండింటిని అమలు చేశామని చెబుతున్నారు. ప్రభుత్వం అమలుకు శ్రీకారం చుట్టిన ఆరు గ్యారెంటీ-లో కీలకమైంది ఇంటికి 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్‌. అయితే విద్యుత్‌ సంస్థల అప్పులు ఇప్పటికే రూ.85 వేల కోట్లకు చేరాయని ఇటీ-వలి రివ్యూలో తేలింది. దీనిపై రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ కూడా అయింది. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, అప్పులు, నష్టాల వివరాలను విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2023-24లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు శ్వేతపత్రాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఉచిత విద్యుత్‌కు ఏటా 4 వేల కోట్లు-..
గ్యారంటీల్లో కీలకమైన హామీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఏటా 4 వేల కోట్లు- అవసరం అని లెక్కలేశారు. ఇందులో కొంత భారం తగ్గించుకోవాలంటే.. పరిష్కార మార్గాలు కూడా సర్కార్‌ ముందు ఉన్నాయి. రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లుండగా, వీటికి ఉచితంగా సరఫరా చేస్తున్న కరెంట్‌కు కచ్చితమైన లెక్కలు లేవు. దీంతో ఇందులో క్లారిటీ- తీసుకుంటే కొంత వరకు ఆదా చేసే అవకాశం ఉందంటు-న్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అంటే, ఒక అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించిన వాస్తవ నివేదికే శ్వేతపత్రం. ఇప్పుడు వీటిని జనం ముందు ఉంచుతూనే.. 6 గ్యారెంటీ-లను వందరోజుల్లోగా పట్టాలెక్కించే పనిలో స్పీడ్‌ పెంచింది రేవంత్‌ రెడ్డి సర్కారు. రైతు భరోసా ఎవరెవరికి వర్తింపజేయాలన్న విషయాలపైనా సూచనలు సలహాలు వస్తున్నాయి.

కొండలు గుట్టలు.. వ్యవసాయం చేయని భూములను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎకరాలకు కటాఫ్‌ పెడుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. వ్యవసాయం చేసే వారికే పెట్టు-బడి సహాయం అందించాలని, భూస్వాములు, కొండలు గుట్టలు, బీడు భూములకు రైతు భరోసా ఇవ్వొద్దన్న డిమాండ్లు గతం నుంచి ఉన్నవే. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్‌తో సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారుతోంది. పలు పథకాల అమలు ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారడంతో రఘురామరాజన్‌ సూచనలపై కొత్త చర్చ మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement