Friday, November 22, 2024

Exclusive – ఆ గ‌ట్టు నుంచి వ‌ల‌స‌లొద్దు…కాంగ్రెస్ పెద్ద‌ల‌కు విన‌తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నో సవాళ్లు… మరెన్నో కష్టాలు… ఇంకెన్నో త్యాగాలు… తొమ్మదిన్నరేళ్ల పాటు చెప్పుకోలేని ఇబ్బందులు… వెరసి కాంగ్రెస్‌ కార్యకర్తలు! గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ భుజాలు కాయలు కాసేలా జెండా మోసిన కార్యకర్తలు ఒకటే లక్ష్యం… ఒకటే పోరాటంగా ముందుకు కదిలారు… ఎన్నో ఆటుపోట్లను, కుతంత్రాలను ఎదుర్కొన్నారు… చివరకు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కృత కృత్యులయ్యారు. సీఎంగా రేవంత్‌ ప్రమాణం చేశారు. మంత్రివర్గం కొలువు తీరింది. ఇక మిగిలింది పార్టీ కోసం సర్వస్వం అర్పించిన నిజమైన కార్యకర్తలను గౌరవించ డమే! సరిగ్గా ఇదే సమయంలో గోడ మీద పిల్లులు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతున్నాయి. ఏ పార్టీ అధికారం లో ఉంటే అందులోకి దూకి రకరకాల విన్యాసాలు చేసే జంబూకాలను రాష్ట్ర నాయకత్వం ఎటువంటి పరిస్థితు ల్లోనూ చేరదీయవద్దని పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు. ఎవరు లేకున్నా, ఆశించిన మద్దతు లభించకున్నా, జనం ఇచ్చిన నైతిక మద్దతుతో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమను గుర్తించాలని వారు కోరుకుంటున్నారు. ఆ గట్టు నున్న వారిని మళ్లిd పార్టీలోకి తీసుకువచ్చి అందలం ఎక్కించడమంటే తమ త్యాగాలకు శాశ్వతంగా సమాధులు కట్టడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తవారి అవసరమేంటి? మా ఉనికిని దెబ్బతీసేందుకు వారు ఆ గట్టున ఎంతో ప్రయత్నించారు… ఇప్పుడు మళ్లి వాళ్లనే పట్టుకొచ్చి మమ్మల్ని అవమానపరుస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ బలోపేతం పేరుతో వలసలను ప్రోత్సహించడమంటే రాష్ట్ర నాయకత్వం వారి అవసరాలు తీర్చుకోవడంగానే భావించవలసి వస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లపాటు కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని, ప్రత్యర్ధి పార్టీల నుంచి ఎన్నో అరాచకాలను, కేసులను ఎదుర్కొని, తట్టుకుని, తలెత్తుకుని నిలబడ్డామని, ఇప్పుడు మళ్లిd వారినే ఆహ్వానించి అక్కున చేర్చుకోవడమంటే తమను తీవ్రంగా అవమానించడమేనని కింది స్థాయి నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారు, వస్తున్న వారికి పెద్ద పీట వేస్తే మళ్లి పాత పోకడలను ప్రోత్సహించడమే అవుతుందని, కేడర్‌లోనూ గ్రూపులు శృతిమించుతాయని, ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గట్టు నుంచి ఆహ్వానించవద్దని స్పష్టం చేస్తున్నారు..

అధినాయకత్వం వెంటనే కల్పించుకుని, వాస్తవ పరిస్థితులను గుర్తించి, అసలైన కార్యకర్తలకు సంపూర్ణ న్యాయం జరిగేలా చూడాలని కేడర్‌ కోరుతోంది. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి వలసవచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే ఇన్నాళ్లూ తాము పడిన శ్రమకు అర్ధమేముంటుందన్నది వారి వాదన. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు సీనియర్లంతా దృష్టి సారించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో అంటి పెట్టుకుని ఉన్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొంత మంది నాయకులు ఆ గట్టునున్న వారిని ఆహ్వానించడానికి చేస్తున్న ప్రయత్నాలను నిరోధించాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement