Tuesday, November 26, 2024

Exclusive – జూబ్లీ హిల్స్‌లో ఆదిమానవులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూబ్లిహిల్స్‌లో ఆదిమానవుని ఆనవాళ్లు వెలుగుచూశాయి. ప్రాచీన మానవుడి ఆవాసాలుగా జూబ్లీ హిల్స్‌ లోని పలు ప్రాంతాల్లో క్రమేణా బయల్పడుతు న్నాయి. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన జూబ్లి హిల్స్‌లో ఆదిమానవుని ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, హరగోపాల్‌ కనుగొనడంతో చరిత్రకారులు జూబ్లీ హిల్స్‌ పై దృష్టి సారించా రు. జూబ్లీ హిల్స్‌ లో విస్తృత పరిశోధనలు చేస్తే మరిన్ని ఆనవాళ్లు లభించే అకాశాలున్నాయని శినాగిరెడ్డి చెప్పారు. జూబ్లీ హిల్స్‌ పరిధిలోని బీఎన్‌ఆర్‌ హిల్స్‌ వద్ద గల తాబేలు గుండు కింద కొత్తరాతియుగపు ఆనవాళ్లను
గుర్తించినట్లు పురావస్తు పరిశోధకులు, ప్లీజ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ తెలిపారు.

జూబ్లిహిల్స్‌ పరిసరాల్లోని విచిత్రరాతి ఆకారాల సందర్శనలో భాగంగా బీఎన్‌ఆర్‌ హిల్స్‌ దారిలో ఉన్న తాబేలు గుండును పరిశీలిస్తుండగా గుండు కింద నేల పరుపు సందులో రెండు కొత్త రాతియుగపు రాతిగొడ్డళ్లు కనిపించాయని వారు చెప్పారు. సులుపుగా ఆహారం సంపాదన కోసం నైపుణ్యంతో తయారు చేసుకున్న ఈ రాతిగొడ్డళ్లు కొత్తరాతి యుగపు మానవుల సాంకేతిక ప్రగతిని తెలియచేస్తున్నాయనీ, చుట్టూ ఉన్న నీటి వనరులతో వ్యవసాయం, పశు పాలన ముఖ్య వృత్తులుగా గల నాటి మానవులకు తాబేలు గుండు తాత్కాలిక నివాస స్థావరమని వారు తెెలిపారు. నల్ల శానపురాతి చుట్టూ పెచ్చులు తీసిన త్రిభుజాకారంగా చేసి పట్టుకోవడానికి లేదా కొయ్య పిడిలో బిగించుకొనేందుకు వీలుగా కొనదేలేటట్లు అరగతీశారు. పాతరాతి యుగపు గొడ్డళ్ల కంటే ఇవి మొనదేలి ఉండి మెెరుగైన పనితనాన్ని కలిగి ఉన్నయి. పెద్దది 12.0 సెంటీమీటర్ల పొడవు, 7.2 సెం.మీ. వెడల్పు, 2.1సెం.మీ. మందం కలిగి ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వం 4000 నుంచి 2000 వేల సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి. దీనితో హైదరాబాద్‌కు 6 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు వెల్లడవుతుందని చరిత్రకారులు శివనాగిరెడ్డి, రామోజు హరగోపాల్‌ చెప్పారు. ఒకవైపు రెండు, మరోవైపు ఒకటి 6 అడుగుల ఎత్తున్న మూడు బండలపై 20 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ రాతి ఆవాసంలో ఒకేసారి 20 మంది వరకు నివశించే అవకాశాలున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement