Friday, November 22, 2024

Exclusive – పొలిటిక‌ల్‌ ప్రేమ‌లు! – క‌లిసి ఉంటూనే క‌ల‌హాలు


క‌డ‌పులో క‌త్తులు.. అయినా కౌగ‌లింత‌లు
బెంగాల్‌లోనేమో దోస్తీ.. కేరళలో అయితే కుస్తీ
వామ‌ప‌క్ష పార్టీల విచిత్ర ధోర‌ణి
వాయ‌నాడ్‌లో రాహుల్‌పై సీపీఐ నేత భార్య పోటీ
కాంగ్రెస్ కూట‌మి నుంచి వైదొలిగిన మ‌మ‌తా, నితీశ్‌
ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన దీదీ
ఎన్‌డీఏలో చేరి పోరాడుతున్న‌ నితీశ్‌కుమార్‌
ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు
ఏం చేయ‌కున్నా బీజేపీకి కలిసివ‌చ్చే సూచ‌న‌లు

రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి. ఒకచోట ప్రశంసలు కురిపించుకున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. అయితే.. ఈ కూటమిలోని అనైక్యత బీజేపీకి కలిసొస్తుందనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కాగా, ఎన్నికలకు ముందే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ భారత కూటమికి దూరమయ్యారు. నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరగా.. మమతా బెనర్జీ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి.

- Advertisement -

ప‌శ్చిమ బెంగాల్‌లో

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి టీఎంసీ, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కేరళలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాలు వేర్వేరుగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమిగా, వామపక్షాలు ఎల్‌డీఎఫ్‌ కూటమిగా పోటీ చేస్తున్నాయి. భారత కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు రెండూ తలపడుతున్నాయి. పొత్తులో భాగంగా పశ్చిమబెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్‌కు 12 సీట్లను వదిలిపెట్టగా.. రెండు సీట్లలో లెఫ్ట్‌ ఫ్రంట్‌లో భాగమైన ఫార్వర్డ్‌ బ్లాక్‌తో స్నేహపూర్వక పోటీ కొనసాగనుంది.

కేరళలో ఎల్‌డీఎఫ్‌-యూడీఎఫ్‌ మధ్య పోటీ

బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తుంటే.. కేరళలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. సీపీఐ నుంచి డి. రాజా భార్య అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. బెంగాల్‌లో రెండు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తుంటే.. కేరళలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.

గతంలోనూ ఇదే తీరు..

కాంగ్రెస్, వామపక్షాలు ఈ వ్యూహాన్ని అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు ఒకే సమయంలో కేరళ, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2021 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకోగా.. కేరళలో మాత్రం విడిగా పోటీ చేశాయి. బెంగాల్‌లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు రాలేదు. బెంగాల్ శాసనసభలో కాంగ్రెస్, వామపక్షాల నుంచి ఒక్క అభ్యర్థి గెలవకపోవడం అదే తొలిసారి. జేపీ తొలిసారిగా 70 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించగా.. మమతా బెనర్జీ పార్టీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

2019 ఎన్నికల్లోనూ..

2019 ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్‌కి ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీతో కలిసి రాష్ట్రంలోని 20స్థానాలకు గాను 19 స్థానాలను యూడీఎఫ్ గెలుచుకుంది. కేరళలో బీజేపీ బలహీనంగా ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. మొత్తానికి బెంగాల్‌లో దోస్తి.. కేరళలో కుస్తీ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement