Thursday, November 21, 2024

Exclusive – ఉల్లి లొల్లి .. కర్నూలు మార్కెట్లో రైతులు కన్నీళ్లు…

ఆగిపోయిన కొనుగోళ్లు
కర్నూలు మార్కెట్లో రైతుల ఆందోళన
ఎగుమతులూ లేవు.. నిల్వకు చాన్స్ లేదు
గుట్టలుగా పేరుకుపోయిన ఉల్లిగడ్డలు
కుళ్లిపోయే దశలో భయాందోళన
ఈ-నామ్ ఊసు అంతంతే..

ఆంధ్రప్రభ స్మార్ట్, కర్నూలు ప్రతినిధి : ఉల్లి రైతన్నలను కంట కన్నీరు ఉబుకుతోంది. అహోరాత్రులు స్వేదంతో శ్రమించి కన్నబిడ్డలా కాపాడుకున్న ఉల్లి బిడ్డ ధర నీరసంతో మార్కెట్ మంచంపై దొర్లుతుంటే.. రైతన్న తల్లడిల్లుతున్నాడు. ఉల్లి ధర కోసం పడిగాపులు కాస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెడితే.. పంట దిగుబడి పెరిగినా.. దళారుల దెబ్బతో రైతు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎన్నో ప్రయాసలుపడి సరుకును మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు కనపడటం లేదు. ఈ స్థితిలో కర్నూలు ఉల్లి మార్కెట్‌లో టన్నుల కొద్దీ ఉల్లి పేరుకుపోతోంది.

- Advertisement -

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు విపణిలో ఉల్లి ఉత్పత్తులు భారీగా పెరిగాయి ? నిన్నా మొన్నటి వరకు అధిక ధరలతో వినియోగదారుడికి కన్నీరు పిండిన ఉల్లి వ్యాపారులు.. తాజాగా ఉల్లి రైతును గుక్క తిప్పుకోనీయటం లేదు. కర్నూలు ఉల్లి మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కర్నూలు వ్యవసాయ విపణికి ఉల్లి పోటెత్తుతోంది. గత నెల రోజులుగా ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వరుస కట్టారు. నిత్యం రికార్డు స్థాయిలో 22 వేల క్వింటాళ్ల వరకు సరుకు వస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకును సకాలంలో బయటకు తరలించకపోవటంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఉల్లి గుట్టలు ఖాళీ చేసిన తర్వాతనే సరకును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో మిగతా రైతులంతా నిరీక్షించాల్సి వస్తోంది.

కర్నూలు మార్కెట్లో ఈ కన్నీళ్లు..
ఉల్లి కొనుగోళ్లకు కర్నూలు మార్కెట్‌ ప్రసిద్ధి. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు సహా అనంతపురం, తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రైతులు సరుకు తీసుకొస్తుంటారు. ఈ సీజన్‌లో ఆగస్టు నుంచి విక్రయాలు ప్రారంభయ్యాయి. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులంతా మార్కెట్‌కు వరుస కట్టారు. గత 3రోజుల వ్యవధిలో 75వేల‌ క్వింటాళ్లు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత సరుకు వస్తున్నా మార్కెట్‌లో చోటు లేకపోవటంతో కొందరు రైతులు తమ పంటను ఇంటికి తీసుకెళ్తున్నారు. తాడేపల్లిగూడెంలోని ఉల్లి మార్కెట్‌కు తరలించాలని భావిస్తున్నా అక్కడ కూడా ధరలు తక్కువగా ఉండటం, రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు.

ఈ నామ్ లేదు.. తప్పని గ్రేడింగ్ ఖర్చు
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో అనధికారిక వ్యాపారాలు చేయకూడదు. పంటను ఈనామ్ విధానంలో కొనుగోలు చేయాలి. సర్వర్ పనిచేయకపోవటంతో రెండు రోజులు టెండర్ విధానంలో కొనుగోలు చేశారు. కానీ కొందరు వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి పెద్దఎత్తున అనధికారిక విక్రయాలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సరాసరి ఉల్లి కిలో 50 రూపాయలు పలుకుతుండగా రైతుల నుంచి క్వింటా 1000 నుంచి 1500కు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ఉల్లిని అత్యధికంగా 15 రూపాయలకు కొంటున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ-నామ్‌ విధానం అమలవుతున్న విపణుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గత వారం వ్యవధిలో అంటే ఈనెల 21 నుంచి 26 వరకు ఆరు రోజులపాటు సాంకేతిక సమస్య తలెత్తటంతో ఈ నామ్ విధానంలో కొనుగోళ్లు ఆగిపోయాయి. గత వారం చివర్లో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేశారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి ధర ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరిగింది. గతంలో ఇంతకంటే అధిక మొత్తంలో అన్నిరకాల పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలోనూ ఏనాడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఆపేసిన దాఖలాలు లేవు. మార్కెట్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వ్యాపారులు, రైతులను సమన్వయం చేసుకోకపోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉల్లికి కుళ్లిపోయే గుణం ఎక్కువ. ఎప్పటికప్పుడు గ్రేడింగ్‌ చేయాలి. అలా చేస్తేనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్‌ చేయించుకోవడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజువారీ వ్యాపారాలు జరగకపోవడంతో తరుగు పేరుతో 5 నుంచి 10 క్వింటాళ్ల సరుకు పారబోస్తున్నారు. గ్రేడింగ్ చేసినందుకు కూలీలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఎగుమతులూ లేవు..

కొనుగోళ్లు సక్రమంగా లేక కర్నూలు వ్యవసాయ విపణిలో ఉల్లి నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు మార్కెట్‌ నుంచి బయటకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కర్నూలు నుంచి కోల్‌కతా, తమిళనాడు, కేరళ, కటక్, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. లారీలు దొరక్కపోవడంతో లోడింగ్‌లో జాప్యం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వివిధ షెడ్లలో కలిపి సుమారు 6 వేల టన్నుల మేర పేరుకుపోయాయి. కర్నూలు ఉల్లి మార్కెట్‌లో కొనుగోళ్ల సమస్య ఓ వైపు వేధిస్తూ ఉంటే దళారులు మరో ఇబ్బందిగా మారారు. దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్‌లోనే గ్రేడింగ్‌ చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

మార్కెట్‌లోకి దళారులు, అనుమతి లేని వ్యాపారులను రానీయకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులకు నష్టం జరుగుతున్నా మార్కెట్‌ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు నోరు మెదపడం లేదు. మార్కెట్‌కు ఆదాయం రాకున్నా పర్వాలేదు దళారులు, వ్యాపారులకు మేలు జరిగితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలో జూలై చివర్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలోనూ ఉల్లి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ గత కొంతకాలంగా వర్షాల కారణంగా కోతలు కోయకపోవటంతో బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. రైతు బజార్లలో కిలో ఉల్లి 40 నుంచి 60 రూపాయల వరకు పలుకుతుండగా బహిరంగ మార్కెట్లో 80 రూపాయల వరకు పలుకుతోంది. కర్నూలు మార్కెట్లో మాత్రం క్వింటా ఉల్లి ధర గరిష్ఠంగా 4,600 రూపాయలు కనిష్ఠంగా 4 వందల రూపాయలు పలుకుతోంది. సరాసరిన వెయ్యి నుంచి 15 వందల వరకు పలుకుతోంది. ఇలాంటి ధరల వల్ల రైతన్నలకు తీవ్రమైన నష్టాలు వస్తాయి. కనీసం క్వింటా ఉల్లి సరాసరిన 2 వేలు పలికితే రైతన్నకు గిట్టుబాటు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement