స్వాతంత్య్రం అనంతరం ఎన్నికల్లో అమలు
ఒకే స్థానంలో ఒక జనరల్ ఎంపీ, ఒక రిజర్వేషన్ ఎంపీ
తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తీరు..
1961 ఎన్నికల నుంచి మారిన తీరు
అప్పటి నుంచి ప్రస్తుత రిజర్వేషన్లు అమల్లోకి..
ఏదైనా నియోజకవర్గానికి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఒక్కరే ఉంటారు. ఆ నియోజకవర్గం మొత్తానికి ఆ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ ఒక లోక్సభ స్ధానానికి ఇద్దరు.. ముగ్గరు ఎంపీలు కూడా ఉంటారని ఎవరైనా అంటే.. వారికి పాలిటిక్స్ పై బొత్తిగా అవగాహన లేదనుకుంటారు. కానీ ఒకప్పుడు ఒక్క నియోజక వర్గానికి ఒకేసారి ఇద్దరు, ముగ్గురు ఎంపీలు కూడా ఉండేవారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది.
రిజర్వేషన్ లొల్లి..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉండేవి. సామాజిక వర్గాల వారీ పరిస్థితులపై తీవ్ర చర్చ కొనసాగేది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను వారికే రిజర్వ్ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. అయితే అప్పటికే రాజకీయాల్లో ముందంజలో ఉన్న అగ్రవర్ణాలు మొదట్లో దీనికి ఒప్పుకోలేదు. దీంతో అలాంటి నియోజకవర్గాల్లో ఒక జనరల్ ఎంపీ, ఒక రిజర్వేషన్ ఎంపీ.. కలిపి ఇద్దరు ఎంపీలు ఉండేలా ఏర్పాటు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు ఎంపీలూ కూడా ఉండే పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి రెండు సాధారణ ఎన్నికల్లో ఇది కొనసాగింది.
తొలి ఎన్నికల్లో…
మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశ్చిమబెంగాల్లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!
1957లో.. సీట్ల పునరివభజన అనంతరం 1957 సార్వత్రిక ఎన్నికల్లో 494 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి.
రెండో ఎన్నికలో తగ్గిన సంఖ్య
రెండో ఎన్నిక జరిగిన 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు పార్లమెంటు స్థానాల సంఖ్య 400 నుండి 494కి పెరిగింది. 1957 నాటికి ద్విసభ్య ఎంపీల నియోజకవర్గాల సంఖ్య తగ్గింది. ఎందుకంటే 1952లో ద్విసభ్య నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు మొదలయ్యాయి. అందుకనే సమస్యలు తలెత్తిన నియోజకవర్గాలను సింగిల్ ఎంపీ నియోజకవర్గంగా మార్చారు. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 18, ఆంధ్రప్రదేశ్ లో 8, బిహార్లో 8, పశ్చిమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఐదేళ్ళ కాలంలో కూడా మరికొన్ని తలనొప్పులు ఎదురయ్యాయి. దాంతో ప్రభుత్వంలోని పెద్దలు, మేధావులు కూర్చుని మాట్లాడుకుని తర్వాత ఎన్నికల నుండి ఒక నియోజకవర్గానికి ఒక ఎంపీనే ఉండాలని నిర్ణయించారు. ద్విసభ ఎంపీల విధానాన్ని అప్పటికప్పుడే రద్దుచేశారు. అందుకనే 1961లో జరిగిన ఎన్నికల నుండి ఒక స్థానానికి ఒక ఎంపీ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏపీలోనూ…
1952, 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీలుండేవారు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో కలిపి 11 నియోజకవర్గాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. పార్వతీపురం, విశాఖపట్నం, కాకినాడు. రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ ఎంపీ నియోజకవర్గాల్లో ఇద్దరేసి ఎంపీలుండేవారు. ఒకరు జనరల్ కోటలో ఎన్నికైతే మరొకరు రిజర్వుడు కోటాలో ఎన్నికయ్యేవారు. ఆరు నియోజకవర్గాలకు 1957లో మాత్రమే ఇద్దరేసి ఎంపీలుంటే విశాఖపట్నం, చిత్తూరు, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండలో 1952, 57లో కూడా ఇద్దరేసి ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు.
ఏ నియోజకవర్గాలు ?
పార్వతీపురంలో బీ సత్యనారాయణ జనరల్ ఎంపీగా ఉంటే డి. సురిర ఎస్టీ ఎంపీగా ఉన్నారు. 1952లో వైజా ఎంపీగా లంక సుందరం జనరల్ ఎంపీ అయితే జి మల్లుదొర రిజర్వుడు కేటగిరి ఎంపీగా ఉండేవారు. ఇక కాకినాడలో బీఎస్ మూర్తి జనరల్ ఎంపీ అయితే మొసలికంటి తిరుమలరావు రిజర్వుడు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గంకు కానేటే మెహన్ రావు ఎన్ రెడ్డి నాయుడు ప్రాతినిధ్యం వహించారు. ఏలూరు స్థానంలో కొండ్రు. సుబ్బారావు, బీఎస్ మూర్తి ఇద్దరూ ఎంపీలుగా ఉండేవారు. ఒంగోలు సీటునుండి ఎం నానాలను పీ వెంకటరాఘవయ్య ఎంపీలుగా ఉండేవారు. నెల్లూరు స్థానంలో 1957లో బీ అంజనప్పు, ఆర్ఎల్ఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇక చిత్తూరులో 1952లో టీపీస్వీ రెడ్డి, ఎంపిజీ శివ ఎంపిలుగా ఉన్నారు. అలాగే 1957లో ఎంపి గంగాధర శివ, అనంతశయనం అయ్యంగార్ ప్రాతినిధ్యం వహించారు.
1952 ఎన్నికల్లో నల్గొండలో రావి నారాయణ రెడ్డి, సుంకం ఇచ్చాలు ప్రాతినిధ్యం వహించారు. 1957 ఎన్నికల్లో దేవులపల్లి వెంకటేశ్వరరావు డి రాజయ్య ఎంపీలుగా ఉండేవారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 1952లో రామస్వామి, జనార్ధనరెడ్డి ఎంపిటయ్యారు. 1957లో జే రామేశ్వరరావు పి. రామస్వామి ఎంపీలుగా ఉండేవారు. రామస్వామి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక కరీంనగర్ నుండి 1952లో బద్దం ఎల్లారెడ్డి, ఎంఆర్ కృష్ణ ప్రాతినిధ్యం వహించారు. 1957 ఎన్నికల్లో ఎంఆర్ కృష్ణ, ఎం శ్రీ రంగారావు ఎంపీలుగా ఉన్నారు. ఎంఆర్ కృష్ణ. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.