Friday, November 22, 2024

Exclusive – రాడార్ స్టేష‌న్‌పై రగ‌డ‌ – అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం…

  • దామ‌గుండానికి దారిచూపింది మీరంటే మీరే
  • అధికార‌, విప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌లు
  • నౌకాద‌ళానికి 2,901 ఎక‌రాల అట‌వీ భూమి అప్ప‌గింత‌
  • తొల‌గించ‌నున్న 12 ల‌క్షల‌ వృక్షాలు
  • ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు
  • దేశవ్యాప్తంగా రాడార్‌ స్టేషన్‌ వ్యతిరేక ఉద్యమం
  • ఒక‌సారి వాయిదా ప‌డిన శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్ :

రాజ‌ధాని హైద‌రాబాద్‌కు 70 కిలో మీట‌ర్ల దూరం… న‌గ‌ర ప్ర‌జ‌లే కాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా సేద తీరేందుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న దామ‌గుండం ర‌క్షిత అడ‌వులకు ముప్పు వాటిల్ల‌నున్న‌ది. అనంత‌గిరి కొండ చుట్టూ ఉన్న దామ‌గుండం ర‌క్షిత అడ‌వుల‌కు చెందిన 2,901 ఎక‌రాల భూమిని విశాఖ‌ప‌ట్నం తూర్పు నౌకాద‌ళానికి తెలంగాణ ప్ర‌భుత్వం అప్ప‌గించింది. దేశంలో అనేక రాష్ట్రాలు తిరిస్క‌రించిన రాడ‌ర్ స్టేష‌న్ ఇక్క‌డ నిర్మించ‌డానికి తూర్పు నౌక ద‌ళం ప్ర‌తిపాదించింది. రాడార్ నిర్మాణానికి సుమారు 12 ల‌క్ష‌ల చెట్ల‌ను తొల‌గించాల్సి ఉంటుంది. దీంతో ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు వాటిల్ల‌నున్న‌ట్లు ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఒక‌సారి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. దేశంలో రాడార్‌ స్టేషన్‌కు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు ఉద్యమం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న‌కు శ్రీ‌కారం చుట్టిన రాడ‌ర్ స్టేష‌న్ ర‌గ‌డ మ‌రింత‌గా రాజుకుంటోంది. దామ‌గుండానికి దారి చూపింది మీరంటే మీరే అని కాంగ్రెస్ స‌ర్కార్‌, విప‌క్ష బీఆర్ఎస్ పార్టీల‌ మ‌ధ్య మాట‌ల యుద్దం ప్రారంభ‌మైంది.

లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేష‌న్‌..

- Advertisement -

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం అనంతగిరి కొండ చుట్టూ ఉన్న దామగుండం రక్షిత అడవులలో తూర్పు నౌకాదళం నిర్మించ తలపెట్టిన లోఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్ ఏర్పాటుకు మంగ‌ళ‌వారం కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ‌నాథ్ సింగ్‌తోపాటు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో నౌకలు, జలాంతర్గాముల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు వికారాబాద్‌ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతాన్ని గుర్తించింది. గత ఆరేళ్లుగా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి తూర్పునౌకాదళం (విశాఖ‌ప‌ట్నం) ప్రయత్నాలు చేస్తోంది. గతనెలలో రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజ‌రుకావాల్సి ఉంది. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడింది.

స్థానికులు వ్య‌తిరేకించినా….

దామగుండంలో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుపై స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినే రాడ‌ర్ స్టేష‌న్ నిర్మాణ ప్ర‌య‌త్నాలు ఆగ‌లేదు. ఒకే చోట 2,901 ఎక‌రాల రక్షిత అటవీ భూమిని అప్పగించడంతో అప్పగించిన అటవీ భూమిలో 12 లక్షల వృక్షాలను తొల‌గించాల్సి ఉంటుంది. తెలంగాణలో కృష్ణ జింకల ఆవాసానికి దామగుండం అడవులు అత్యంత అనుకూమ‌ని అటవీ శాఖ చెబుతోంది. దీనికితోడు అనేక పక్షి, వృక్ష జాతులు ఈ అడవులలో ఉన్నాయి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన రెండు నదులు మూసి నది, కాగ్నా నదులు ఈ ప్రాంతంలోనే ఉద్బవించడం గమనార్హం. రాడార్‌ స్టేషన్‌ నిమిత్తం ఆరు గ్రామాల్లోని 60 వేల మందికి రాకపోకల నిమిత్తం నిర్మించిన రోడ్లను నౌకాదళానికి అప్పగించడంతో ఇబ్బందులు కలిగిస్తోందని, కాలం చెల్లిన లోఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణంతో జిల్లా వ్యాప్తంగా రేడియేషన్‌ సమస్య వస్తుందని, దీర్ఘకాలంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాడార్‌ స్టేషన్‌ నిర్మిస్తున్న దామగుండం అడవులలో దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఆలయంతో పాటు ఆలయం భూములను సైతం నౌకాదళానికి అప్పగించారు.

2027 నాటికి రాడార్ స్టేష‌న్ నిర్మాణం పూర్తి

2027 నాటికి రాడార్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలనేది నేవీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక్కడ రాడార్ స్టేషన్ నెలకొల్పడం మాత్రమే కాకుండా, అందులో పనిచేసే సిబ్బంది స్థానికంగానే నివసించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాడార్ స్టేషన్‌లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారని ఒక అంచనా. వారంతా అక్కడే ఉండటానికి వీలుగా టౌన్‌షిప్ నిర్మిస్తారు. ఆసుపత్రులు, బ్యాంకు, మార్కెట్.. ఇలా అన్నీ ఏర్పాటు చేస్తారు. చుట్టూ 27 కిలోమీటర్ల మేర గోడ నిర్మిస్తారు. దాదాపు రెండున్నర వేల మంది నివాసం ఉండేలా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు. ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ర‌క్ష‌ణ శాఖ చెబుతోంది. ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటానికి ఇక్క‌డ కేంద్రాన్ని ఉప‌యోగిస్తారు. ఇది 3 కేహెచ్‌జెడ్ నుంచి 30కేహెచ్‌జెడ్ రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంద‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ చెబుతోంది. రక్షణ రంగంతో పాటు అనేక ఇతర రేడియో కమ్యూనికేషన్ అవసరాలకు ఇది వినియోగిస్తారు. ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40 మీటర్ల వరకూ వెళ్లగలదు కాబట్టి సబ్ మెరైన్లతో కమ్యూనికేషన్‌కి కూడా ఈ కేంద్రం ఉప‌యోగ‌ప‌డుతుంది. అరేబియా, బంగాళాఖాతం.. రెండు సముద్రాలకూ కమ్యూనికేట్ చేయ‌డానికి వీల‌వుతుంద‌ని వికారాబాద్ జిల్లా అడ‌వుల‌ను ఎంపిక చేశారు. యూఎస్, యూకే, రష్యా, నార్వే, పాకిస్తాన్, జర్మనీ, ఆస్ట్రేలియాలకు ఇలాంటి వీఎల్ఎఫ్ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. మ‌న‌దేశంలో తమిళనాడులోని తిరునల్వేలి దగ్గర ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ పేరుతో ఉంది. అది 1990 నుంచి పనిచేస్తోంది. రెండో స్టేషన్ కోసం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు నావికా దళం తెలంగాణలోని వికారాబాద్‌ను ఎంచుకుంది.

ప‌ర్యావరణవేత్తల అభ్యంతరం …

ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చిన దశ నుంచి పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కోర్టులకు కూడా వెళ్లారు. ఎంద‌రో ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మూసీ నది పుట్టే ప్రదేశం ఈ అడవి. మూసీ జన్మించిన స్థలాన్ని నాశనం చేయడాన్ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు వ్య‌తిరేకిస్తున్నారు. వందల సంవత్సరాల నుంచి ఏర్పడ్డ గొప్ప పర్యావరణ వ్యవస్థ ఆ అడవి. అక్కడ మొత్తం 12 లక్షల చెట్లను నరికివేస్తారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

రేడియేషన్‌పై ఆందోళన

అడవి పోవడంతో పాటు రాడార్ స్టేషన్ వలన రేడియేషన్ ఉంటుందేమోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అది సముద్రంలో ఓడలకు సిగ్నళ్లు పంపే స్టేషన్. ఇక్కడ నుంచి విశాఖపట్నం, ముంబయి వంటి దూర ప్రాంతాలకు సిగ్నల్ వెళ్లినప్పుడు పక్కనే ఉన్న త‌మ‌పైన ఆ ప్రభావం పడదా? ఆ రేడియేషన్ వల్ల జబ్బులు వస్తాయి. అడవి నాశనమై పోతుంది. అన్నింటికీ మించి రామలింగేశ్వర దేవస్థానం నేవీ అధీనంలోకి వెళ్తే, అక్క‌డ పూజ‌లు చేసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని గ్రామ‌స్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే ఇక్కడ రాడార్ స్టేషన్ పెట్టొద్దు అని పూడూరు గ్రామ‌స్తులు కోరుతున్నారు.

సీఎం మ‌ర‌ణ‌శాస‌నం రాస్తున్నారు…: కేటీఆర్

దామగుండం ప్రాజెక్ట్‌ నిర్మిస్తే మూసీ నది కనుమరుగవుతుందని, మూసీకి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు తమ ప్రభుత్వంపై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వేల ఎకరాల అటవీ భూములను నాశనం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. రాడార్ సెంటర్లు జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాలి కానీ, జనావాసాల మధ్య కాదని హితవు పలికారు.

అనుమ‌తి ఇచ్చిందే కేసీఆర్‌ ప్ర‌భుత్వం : సీఎం

రాడార్ స్టేష‌న్ ఏర్పాటుకు అనుమ‌తి ఇచ్చిందే కేసీఆర్‌ ప్ర‌భుత్వమేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన జీఓ ఎం ఎస్ నెంబ‌ర్ 44 తేదీ 12-12-2017లో అప్ప‌టి ప్ర‌భుత్వం భూములు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండి అనుమ‌తి ఇచ్చి ఇప్పుడు ఉద్య‌మం చేస్తామ‌ని చెప్పడం ఏమిట‌ని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మండిప‌డింది.

దేశ ర‌క్ష‌ణ విష‌యంలో రాజ‌కీయాలొద్దు – కిష‌న్ రెడ్డి

దేశ రక్ష‌ణ విష‌యంలో రాజ‌కీయాలు చేయొద్ద‌ని బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హిత‌వు ప‌లికారు. ప‌దేళ్ల క్రిత‌మే అనుమ‌తులిచ్చిన మీరు ఇప్పుడు నిర‌స‌న గ‌ళం ఇప్పడం ఏమిట‌ని కేటీఆర్ ను ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. దేశ ర‌క్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌హ‌క‌రించాల్సిందేన‌ని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement