Wednesday, November 20, 2024

Exclusive – వద్దన్నావరద…. అడ్డుకునేదెలా…?

ప్రకృతి వైపరీత్యాలవల్ల ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ వర్షం రికార్డు స్థాయిలో కురుస్తోంది. అయితే పేలవమైన ప్రణాళిక, నీటి పారుదల వ్యవస్థ నిర్వహణ లోపాలు, అధిక వర్షాలు, వరదలు భారీ నష్టానికి దారి తీస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలకంటే వరదల అనంతరం బాధితుల సంక్షేమానికి పునరావాసానికి భారీగా ఖర్చు చేసేందుకే ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయి

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఐక్యరాజ్య సమితిలోని ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ నివేదిక ప్రకారం భారతదేశంలో వరదల కారణంగా ఏటా సుమారు మూడు లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లుతోంది. 2030 నాటికి ఈ నష్టం పదిరెట్లకు పైగా పెరగనుంది. ఇందుకు ప్రధాన కారణం భారత భౌగోళిక పరిస్థితులతోపాటు ఈ దేశంలో పట్టణ ప్రణాళికల నిర్వహణలో నెలకొన్న లోపాలు. వాతావరణపరంగా కూడా భారత్‌కు వరదల విషయంలో ఇబ్బందులు తప్పవు. భారత్‌ ప్రపంచంలోనే అతి సున్నితమైన వాతావరణ జోన్‌లో ఉంది. అధిక జనాభా భారాన్ని భరిస్తోం ది. ఈ దేశంలోని 40 మిలియన్‌ హెక్టార్లు అంటే మొత్తం భారత భౌగోళిక విస్తీర్ణంలో 12 శాతం వరకు తరచు వరదలకు గురయ్యే అవకాశముందని ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఈ దేశంలోని ప్రధాన నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు తరచు వరద ముంపునకు గురవుతాయి. సామర్థ్యానికి మించి ప్రవహిస్తున్న నదులు, కాలువలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తున్నాయి. 1996 నుంచి 2005 మధ్య పదేళ్ళ కాలంలో భారత్‌లో 67 పెద్ద తరహా వరదలు సంభవించాయి. కాగా 2006 నుంచి 2015 వరకు పదేళ్ళ కాలంలో ఈ సంఖ్య 90కి పెరిగింది. ఆ తర్వాత ప్రతీ ఏటా సగటున 13 వరదలు ఈ దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలవల్ల ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ వర్షం రికార్డు స్థాయిలో కురుస్తోంది.

అయితే పేలవమైన ప్రణాళిక, నీటి పారుదల వ్యవస్థ నిర్వహణ లోపాలు, అధిక వర్షాలు, వరదలు భారీ నష్టానికి దారి తీస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలకంటే వరదల అనంతరం బాధితుల సంక్షేమానికి పునరావాసానికి భారీగా ఖర్చు చేసేందుకే ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. వాస్తవానికి 1994 తర్వాత వరుసగా ప్రతీఏటా దేశంలో సగటుకు మించి వర్షపాతం నమోదవుతోంది. అయినా ఇప్పటికీ దాదాపు 55 కోట్లమంది ప్రజలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నీతి ఆయోగ్‌ నివేదిక మేరకు భారత్‌లోని ప్రధాన నగరాల్లో 75 శాతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నివేదిక మేరకు భారత్‌కు ఏటా గరిష్ఠంగా మూడువేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు అవసరం. కానీ ఇక్కడ నాలుగువేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల వర్షం నమోదవుతున్నది. కానీ మొత్తం వర్షంలో ఎనిమిది శాతాన్ని మాత్రమే భారత్‌ వినియోగించుకుంటున్నది. మిగిలిన వర్ష పునీరు వరదలా మారుతోంది. తగిన పట్టణ ప్రణాళికలు కొరవడడంతో ఈ నీరు పట్టణాలు, గ్రామాల్ని ముంచెత్తుతోంది.

ప్రపంచ నగరాల్లోనూ అంతే
వాస్తవానికి ఇప్పుడు ఒక భారతదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ వరద ప్రభావంతో సతమతమవుతున్నాయి. మౌలికసదుపాయాల కల్పనలో అగ్రగాములుగా పేరొందిన అమెరికా, చైనాల్లోని నగాంలు కూడా నీటమునుగుతున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో 35 శాతం భూభాగం వరద ప్రభావాన్ని తీవ్రంగా చవిచూసింది. అమెరికాలో ఇటీవల సంభవించిన భారీవరదలు లాస్‌వేగాస్‌ న్యూజెర్సీ న్యూయార్క్‌ నగరాల్ని కుదిపేసాయి. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌ నగరానికి భారీవరద దెబ్బ పడింది. ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌వంటి ఆర్ధిక అగ్రరాజ్యాలు కూడా తరచూ వరద ప్రభావానికి గురవుతున్నాయి. భారత్‌లోని ఒక్క బెంగళూరు నగరంలోనే ఏటా రూ.20 వేల కోట్ల వరకు వరద నష్టం నమోదవుతోంది.

నివారణకు ముందస్తు చర్యలు?
ఈ దేశంలో వరదలొచ్చే ప్రతీ సందర్భంలో ప్రజల్ని హెచ్చరించడం, లోతట్టు ప్రాంతాల్లోని నివాసితుల్ని ఖాళీ చేయించడం, వరద సమయంలో ఆహారపొట్లాలు అందించడం, వరద బాధితులకు రూ.2 వేల ఆర్ధికసాయం ఇవ్వడం, 25కిలోల బియ్యం పంచడం, కూలిన ఇళ్ళ స్థానంలో కొత్తఇళ్ళను మంజూరుచేయడంతోనే ప్రభుత్వం తన బాధ్యతను సరిపెట్టుకుంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలకు ఉన్నాయి. కానీ వరదల్ని ప్రభుత్వాలేవీ పెద్ద ప్రమాదంగా భావించడం లేదు. పైగా ఒక సంక్షేమ కార్యక్రమాల అమలుకు అనువైన అంశంగా మాత్రమే పరిగణిస్తున్నాయి. గతంలో వరదల ముందస్తు నివారణకు ప్రభుత్వాలు ప్రత్యేక యంత్రాంగాన్ని నిర్వహించేవి.

డ్రైనేజీ బోర్డుతో లాభాలెన్నో!
ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డ్రైనేజీ బోర్డు ఉండేది. దీనికి వివిధ హోదాల్లోగల ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది ఉండేవారు. పలుచోట్ల కార్యాలయాలు కొనసాగేవి. ప్రభుత్వం డ్రైనేజీబోర్డు నిర్వహణకు చైర్మన్‌ను నియమించేది. ఈ చైర్మన్‌కు క్యాబినెట్‌ ర్యాంక్‌తో సమానమైన అధికారాలు, సదుపాయాలు కల్పించేది. ఈ డ్రైనేజీ బోర్డుకు సాధారణ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేది. ఈ బోర్డు రాష్ట్రంలో డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమగ్ర సర్వేలు నిర్వహించేది. లోపాలకు అనుగుణంగా సవరణలకు అనువైన ప్రణాళికలు సిద్ధం చేసేది. వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పంట కాలువల్లో పూడికలు తొలగించేవారు. గుర్రపు డెక్క, ఇతర అడ్డంకుల్ని తీసేసేవారు. ఈ డ్రైన్‌లపై ఆక్రమణలను అడ్డుకునేవారు. నీటిపారుదలకు ఏ చిన్న ఆటంకాన్ని అనుమతించే వారు కాదు.

- Advertisement -

దీంతో డ్రైనేజీ బోర్డు నిర్వహణలో డ్రైన్‌లన్నీ చక్కగా పనిచేసేవి. అధికవర్షాల సమయంలో అదనపునీరు పంటకాలువలు, డ్రైనేజీ ద్వారా సునాయాసంగా ముందుకు ప్రవహించి సముద్రంలో కలిసేది. డ్రైన్లకు ఇరువైపులా గట్లను పటిష్టంగా రూపొందించడంతో వరదముప్పు ఉండేది కాదు. అదే సమయంలో భూగర్భజలాలు పెరిగేవి. కానీ డ్రైనేజీబోర్డు నిర్వహణను ప్రభుత్వం అదనపు వ్యయంగా భావించి తొలగించింది. ఇరిగేషన్‌ శాఖలో దీన్ని విలీనం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రైన్ల నిర్వహణకంటూ ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. ఇలాంటి వ్యవస్థను పునరుద్దరించాలి. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా డ్రైన్లు కాలువల నిర్వహణకు నిపుణులైన ఇంజనీర్లతో కూడిన బృందాలతో ఈ డ్రైనేజీ బోర్డులను ఏర్పాటు చేయాలి. అప్పుడే కురిసే వర్షాలు, అదనపు వరదనీటితో పట్టణాలకు, నగాంలకు, లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు తప్పుతుంది. వరదనీరు ఉప్పెనలా మారి గ్రామాల్ని, పొలాల్ని కబళించి లక్షలకోట్లు నష్టం కల్పించే పరిస్థితినుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement