Monday, November 25, 2024

Exclusive – ముందు ‘పోలింగ్’ క‌థ‌…. ఆపై ‘ప‌వ‌ర్’ జ‌త‌…..

న్యూఢిల్లీ – ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌త్యేక ప్ర‌తినిధి

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సుమారు తొమ్మిది మాసాల సమయమున్నా దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజు కుంది. వరుసగా రెండుదఫాలు కేం ద్రంలో అధికారం సాధించిన ఎన్‌డీఏ మూడోసారి విజయపరంపర కొనసా గించాలన్న ధృడసంకల్పంతో ఉంది. ఈ నెల 18న ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు కొంతమంది కొత్త మిత్రులతో బీజేపీ ప్రత్యేక సమావే శాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు జాతి మొత్తం ఈ సమావేశ ఫలితంపైనే చూస్తోంది. ఈ సమావేశంలో జరిగే చర్చలు, ఒడంబడికలు, పొత్తులే రానున్న ఎన్నికల్ని శాసించనున్నాయి. పదేళ్ళుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ దేశాన్ని అప్రతిహతంగా ఏలు తోంది. ఈ సారి మళ్ళీ సొంతంగానే 350కి పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ప్రకటిస్తోంది. దేశవ్యాప్తంగా తమకను కూల పవనాలున్నాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ పార్టీ 11 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కూడా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇదే ధీమాను ప్రదర్శించారు. పైకి బీజేపీ అగ్రనాయకత్వం ఎంత డాంభికంగా ఉన్నా, కర్ణాటక అసెంబ్లి ఫలితాల అనంతరం నాయకత్వంతో పాటు శ్రేణుల్లో కూడా ఆందోళన మొదలైంది. గతనెల్లో విపక్షాలు పాట్నా వేదికగా నిర్వహించిన సమావేశం సఫలం కావడం కూడా బీజేపీ మిత్రపక్షాల్లో కొత్త ఆందోళన తెచ్చిపెట్టింది.

పైకి బీజేపీ డాంభికంగా ఉంది. తమ విజయపరంపరకు అనుగుణంగా ఎవర్ని ఆహ్వానించినా తమతో కలిసొస్తారని ప్రకటిస్తోంది. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు ప్రతిసారి ఏదొక జాతీయాంశాన్ని లేవనెత్తడం బీజేపీకి పరిపాటి. ఆ జాతీయ అంశ ప్రాతిపదికనే బీజేపీ జాతీయ స్థాయిలో ఓటర్లను తనవైపు ఆకర్షిస్తోంది. సానుకూల ఫలితాల్ని సాధిస్తోంది. ఈ సారి కూడా అదే రీతిలో ఉమ్మడి పౌరస్మృతిని తలకెత్తుకుంది. అయితే కొన్ని ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఈ అంశంలో బీజేపీతో కలసి రావడంలేదు. అలాగే బీజేపీ ఎంపిక చేసుకుంటున్న మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ అంశం ఆధారంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు జంకుతున్నాయి. దీంతో ఈ నెల 18న జరిగే సమావేశంలోనే రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తులపై ఎన్‌డీఏలో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

తమతో కలసి నడిచే పార్టీలు దాదాపుగా ఖరారౌతాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రం బీజేపీతో నేరుగా పొత్తుకు సిద్దపడే అవకాశాలు స్పష్టం కావడంలేదు. అలాగని ఆ పార్టీలు పూర్తిగా దూరం పెట్టే పరిస్థితి కూడా లేదు. బీజేపీతో ఎన్నికల అవగాహనను మాత్రం కుదుర్చుకునే అవకాశాలున్నట్లు పరిశీలకులు అంచనాలేస్తున్నారు. బీజేపీకి ఆయా పార్టీలకు మధ్య అవగాహనలో భాగంగా ఒకే నియోజకవర్గంలో పరస్పర పోరులేకుండా జాగ్రత్త పడతారు. తద్వారా తమ అనుకూల ఓటు చీలకుండా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితుల్ని బట్టి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలేదా.. ప్రభుత్వంలో భాగస్వామి కావడం నిర్ణయించుకుంటారు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణాలో బీజేపీకి ఒంటరి పోరు తప్పదు. అక్కడున్న బలమైన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ బీజేపీకి బద్ద శత్రువులే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఒకప్పటి ఎన్‌డీఏ భాగస్వామి. అంతర్గత విబేధాలతో చంద్రబాబు ఎన్‌డీఏకు దూరమయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఓటమి అనంతరం తిరిగి ఆ పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశానికి సంబంధించి చంద్రబాబుకెలాంటి ఆహ్వానం రాలేదు. కానీ గత నాలుగేళ్ళుగా బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్‌కు ఈ సమావేశానికి రమ్మంటూ ఆహ్వానం అందింది. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కోసం పవన్‌ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశ వేదికగా ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశం స్పష్టమౌతోంది.

అయితే తెలుగుదేశంతో పాటు జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీలు కూడా బీజేపీతో జట్టుకడితే మతముద్ర పడుతోందన్న భయానికి లోనవుతున్నాయి. తద్వారా ఓ వర్గం ఓట్లు పూర్తిగా దూరమౌతాయన్న ఆందోళన ఈ పార్టీల్లో నెలకొంది. దీంతో పరిస్థితిని ఇవన్నీ సునిశితంగా పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని విపక్షాల కూటమి బలపడ్డం కూడా ఈ పార్టీలను పునరాలోచనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాల మధ్య ఐక్యతారాగం వినిపిస్తోంది. 450 నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలన్న నిర్ణయం ఖరారైంది. దీంతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. వివిధ కారణాలతో ఎన్‌డీఏ నుంచి వైదొలిగిన భాగస్వామ్య పక్షాల్ని తిరిగి దరిచేర్చుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ పార్టీలన్నీ మోడీ, షా ధ్వయం తీరు నచ్చక కూటమి నుంచి వైదొలగినవే. పైగా వీటికిప్పుడు విపక్ష కూటమి నుంచి ఆహ్వానం అందింది. ఈ దశలో తిరిగి ఎన్ని పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగా జట్టు కడతాయన్నది సందేహమే.

- Advertisement -

2019 లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో శివసేనతో కలసి బీజేపీ పోటీ చేసింది. రెండింటికి కలిపి 50శాతానికి పైగా ఓట్లొచ్చాయి. మొత్తం 48సీట్లలో బీజేపీ 23, శివసేన 18 మొత్తం 41సీట్లను కైవసం చేసుకున్నాయి. అనంతరం మహరాష్ట్ర శివసేనలో జరిగిన అంతర్గత వివాదాల్లో వేర్పాటువాదానికి బీజేపీ మద్దతిచ్చింది. దీంతో ఉద్దవ్‌థాక్రే నేతృత్వంలోని శివసేన, బీజేపీకి శత్రువుగా మారింది. బీహార్‌లో బీజేపీ- యునైటెడ్‌ జనతాదళ్‌ కలసి 40 స్థానాల్లో పోటీ చేశాయి. 33స్థానాల్ని గెల్చుకున్నాయి. అనంతరం యునైటెడ్‌ జనతాదళ్‌ బీజేపీకి దూరమైంది. పంజాబ్‌లో మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగింది. దక్షిణాదిలో ఒకే రాష్ట్రం(కర్ణాటక)లో ఉన్న అధికారాన్ని కూడా బీజేపీ కోల్పోయింది. దీంతో బీజేపీ పట్ల భాగస్వామ్య పక్షాలతో పాటు కొత్తమిత్రుల్లో కూడా పూర్తిస్థాయి విశ్వాసం వ్యక్తంకావడం లేదు. అలాగని బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాదన్న ధీమా కూడా వారికి కలగడంలేదు. దీంతో బీజేపీతో అంటీముట్టనట్లుగానే స్నేహం చేస్తూ స్నేహపూర్వకమైన పోటీ లేదా అవగాహనతో కూడిన పోటీకి పరిమితమై ఎన్నికల అనంతరం పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన ఈ పార్టీలన్నింటిలో స్పష్టమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement