గీత దాటేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు
మద్యం సిండికేట్లనుంచి మామూళ్లు
బినామీల పేరుతో భూముల కబ్జా
పోస్టింగ్ లెటర్లకూ రేట్లు
ఇసుక, ఖనిజాలు నిలువు దోపిడీ
కొందరు ఎమ్మెల్యేల పాపం ..ప్రజాపాలనకు శాపం
ఇలాంటివారివల్లే బీఆర్‌ఎస్‌కు పరాజయం
కాంగ్రెస్‌లోనూ కలెక్షన్ కింగ్‌లు
అపరిమిత స్వేచ్ఛ ఇవ్వడంవల్లే అరాచకం
సీఎం రేవంత్ అప్రమత్తమవ్వాలి
అవినీతి నేతలకు బుద్ధిచెప్పాలి
అప్పుడే ప్రజాప్రభుత్వంగా కీర్తి
ప్రజాపాలనకు స్ఫూర్తి
నిపుణుల సూచన
చెరగని ముద్రవేసే దిశగా సీఎం రేవంత్
అదే లక్ష్యంగా అహర్నిశలు అడుగులు
కొత్త ఆలోచనలు.. కొంగొత్త ప్రాజెక్టులు
విపక్షాల విమర్శలకు దీటుగా జవాబు
అండగా నిలిచిన కీలక మంత్రులు
హామీల అమలుకు మొక్కవోని కృషి
ఇవేమీ పట్టని కొందరు ప్రజాప్రతినిధులు
సంపాదనపైనే మక్కువ
అదుపు చేయకపోతే బీఆర్‌ఎస్ గతే
ఆధునిక రాజకీయాల్లో నీతినిజాయితీలు, సత్యసంధత నేతిబీర చందమే. అలాగని, అన్ని పార్టీలు.. అందరు నేతలు పూర్తి అవినీతిపరులని కాదు. అవినీతి ఊడలువేసినప్పుడు… అందుకు భిన్నంగా ఒక దేశం లేదా ఒక రాష్ట్రం… లేదా ఒక పార్టీని ముందుండి నడిపిస్తున్నవారు నిఖార్సయిన రాజకీయం చేస్తూ ప్రజలకు దగ్గరైనప్పుడు అధికార పీఠం అలవోకగా అందుతుంది. తెలంగాణలో అదే జరిగింది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు సుపరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలు అండగా నిలుస్తారు. ఒక ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలన్నా.. మంచిపేరు రావాలన్నా.. ఏ ఒక్కరి ఆలోచనవల్లో.. వారి కష్టం వల్లో మాత్రమే సాధ్యం కాదు. సమష్టి ప్రయత్నంవల్లే ఆ కల సాకారమవుతుంది. తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మన్ననలు పొందడానికి చేయని ప్రయత్నం లేదు. అధికారం చేపట్టినప్పటినుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని ముఖ్యమంత్రి, అదే స్థాయిలో పనిచేస్తున్న కొందరు మంత్రులు రాష్ట్ర రాజకీయ యవనికపై ప్రజాపాలన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేల అవినీతి బాగోతంవల్ల ఆ సుందరదృశ్యం చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ అప్రమత్తమవ్వాల్సిన తరుణం ఇది. గత ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల అవినీతి హద్దులు దాటిపోయింది. దానికి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రమాదాన్ని గుర్తించినా.. ఆ పార్టీ చక్కదిద్దుకునేందుకు అవకాశం లేకపోవడం వల్ల అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు బరితెగిస్తున్నారు. వారికి బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకంటే ఇంకా నాలుగేళ్లపాటు కాంగ్రెస్‌కు సమయం ఉంది. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుని ఒక హెచ్చరిక పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం కలకాలం నిలుస్తుంది. ప్రజాప్రభుత్వంగా మన్ననలు పొందుతుంది. ఇది నిపుణుల సూచన.
(న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌ఛార్జ్)
హైదరాబాద్, ఆంధ్రప్రభ:రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పదినెలలైంది. మరో రెండునెలల్లో తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్ధపడుతోంది. కర్నాటక విజయం ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. పాలన ఎలా ఉండాలో రాహుల్ కొన్ని సూచనలు చేశారు. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, అందుకు తెలంగాణ ఆలంబన అని పదేపదే చెబుతున్న రేవంత్… అహర్నిశలు పనిచేస్తున్నారు. నిన్నగాక మొన్న ఆయనచెప్పిన మాటల ప్రకారం శాసనసభ ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచి ఇప్పటివరకు ఒక్కో రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు.
అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రజల ప్రభుత్వంగా చెప్పుకునేందుకు తహతహలాడింది. ప్రజాభవన్, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజావాణి వంటి పదబంధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నినదిస్తోంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. తొలి 9 నెలల్లో ఆ సౌకర్యాన్ని 90 కోట్లకు పైగా మహిళలు వినియోగించుకున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన డీఎస్‌సీని… అతి తక్కువ సమయంలో నిర్వహించి మంచిపేరు తెచ్చుకుంది. దసరా పండుగకు మూడు రోజుల ముందు 11వేల మందికి ఒకే దఫాలో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసిన రేవంత్.. ఆ కుటుంబాల కళ్లల్లో ఆనందం చూశానని గర్వంగా చెప్పారు. ఉద్యోగం ఒక భావోద్వేగమని అభివర్ణించారు.
ఆయన మాటల్లో ఎంతో నింజం ఉంది. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో నియామకాలు ఒకటి. తను అధికారం చేపట్టాక ఇప్పటివరకు 30వేల ఉద్యోగాలు కల్పించినట్లు సాధికారికంగా ఆయన ప్రకటించారు. ఇదేకాదు, వైద్యఆరోగ్య శాఖ, విద్యుత్.. ఇలా అనేక శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రేపోమాపో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తి చేయబోతున్నారు. మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఉందిలే మంచీకాలం ముందూముందూనా… అంటూ రేవంత్ నియామకాల పాట ఆలపిస్తున్నారు. మూసీ నదీ ప్రాంత అభివృద్ధి పేరుతో ఏకంగా 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు దిశగా అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు తోడుగా ఫోర్త్ సిటీ… (ఫ్యూచర్ సిటీ) కోసం దీక్షబూనారు. రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అప్పులకుప్పలు పేరుకుపోయాయి. బీఆర్‌ఎస్ హయాంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపులు ఎప్పుడన్నది చెప్పే పరిస్థితి లేదు. అయితే, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. సకాలంలో జీతాలు, పెన్షన్ల చెల్లించేలా రేవంత్ ప్రభుత్వం చేయగలిగింది. అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్, ఆయన మంత్రిమండలి ఈ సత్కార్యాలను చేయగలిగాయి.
మూసీ, హైడ్రా, రుణమాఫీ వంటి విషయాల్లో విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు తూర్పారపడుతున్నా.. చెదరని దీక్షతో రేవంత్ బృందం దూసుకుపోతోంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి ఇలా… పలువురు మంత్రులు దీటుగా స్పందిస్తున్నారు. కలసికట్టుగా, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. అందుకే తమది ప్రజాప్రభుత్వంగా ధీమాగా చెప్పుకుంటోంది రేవంత్ టీమ్. ప్రజల్లో తమ ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, మేం బహిరంగంగానే తిరుగుతున్నామని, నిరసన సెగ తగలలేదని ఒక మంత్రి చేసిన వ్యాఖ్య గమనార్హం. ప్రభుత్వం ఎంత చేసినా విపక్షాలు విమర్శించడం మామూలే. వాటి పనే అది. కాకపోతే కాంగ్రెస్‌కు ఇప్పుడు వస్తున్న సమస్య విపక్షాలతో కాదు. స్వపక్షంలోని కొందరితో. వారెవరో కాదు.. కాంగ్రెస్‌కు చెందిన కొందరు అవినీతి ఎమ్మెల్యేలు.
ఇంటి దొంగలతోనే సమస్య
కాంగ్రెస్‌లో కొందరు ఎమ్మెల్యేలు బరి తెగించారు. అవినీతి బాగోతానికి తలుపులు తెరిచారు. బినామీలను రంగంలోకి దించారు. కబ్జాల పర్వం మొదలుపెట్టేశారు. రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు పనిచేస్తూ ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తూంటే… వీరుమాత్రం ఆబగా ఆదాయంవైపే చూస్తున్నారు. మద్యం సిండికేట్లతో చేతులు కలిపారు. నెలసరి మామూళ్లు… మామూలైపోయాయి. ఇవ్వనివారికి బెదరింపులు.. అదలింపులు.. సాధింపులు. ఇసుక, రాళ్లు, గ్రానైట్ వంటి సహజవనరుల దోపిడీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఉద్యోగ బదలీలు, నియామకాలకు సంబంధించిన లేఖలకూ రేటుకట్టి వసూలు చేస్తున్నారు. ప్రతి శాఖకూ ఖరీదు కట్టేశారు.
గెలిచిందే డబ్బు సంపాదనకు అన్నట్టు దందా చేస్తున్నారు. అడిగేవాడు లేడు. అడ్డుకునేవాడు లేడు. చివరకు రుణమాఫీ వంటి పథకాల్లోనూ పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు. రూ.2 లక్షల మేర రుణమాఫీ విషయంలో కొన్ని నిబంధనలు సమస్యగా మారాయి. కొందరికి రుణమాఫీ వర్తించలేదు. ఆ డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. అలాంటి వారి వివరాలు సేకరించి, వారికి రుణమాఫీ నిధులు పడేలా చేస్తామని, హైదరాబాద్‌లో ఫైల్ కదుపుతామంటూ నమ్మబలుకుతున్నారు. వారినుండి లంచాలు మింగుతున్నారు.
ఈ తంతు నడిపేందుకు సొంత మనుషులను పెట్టుకున్నారు. వీరి బాధ భరించలేని రైతులు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కాంగ్రెస్‌కన్నా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే బెటర్ అనే స్థితికి వస్తున్నారు. ఈ పరిణామాలు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రదిష్టను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ప్రజాపాలన ఘనతను వీరు మంటగలుపుతున్నారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలకు అపరిమిత స్వేచ్ఛ ఇవ్వడం, వారిని నియంత్రించే ప్రయత్నాలు లేకపోవడం, అలాంటి వ్యవస్థలు మృగ్యమవడం ఈ పరిస్థితికి కారణం. సరిగ్గా ఇలాంటివారివల్లే బీఆర్‌ఎస్ కారు షెడ్డుకు వెళ్లిపోయింది. ఆ తత్వం బోధపడితే రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరవాలి.
బీఆర్‌ఎస్ పతనానికి కారణం?
తెలంగాణ సాధనతో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. కేసీఆర్ చక్కటి పాలనతో రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. అద్భుతమైన పథకాలను అమలు చేశారు. నిజానికి ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో నిరసన, వ్యతిరేకత పెద్దగా లేవు. 2023 ఎన్నికల్లో విజయం ఖాయమని, హ్యాట్రిక్ కొడతుందని ఎక్కువమంది భావించారు. కానీ ఓటమిపాలైంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. నిజానికి బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న ఆగ్రహం. వారి విచ్చలవిడి అవినీతి. ఇసుక,మద్యం.. ఒకటేమిటి.. అన్నింటా బరితెగింపే. సగటు మనిషికి వెగటు కలిగించేలా వ్యవహరించారు. అధిష్ఠానానికి ఉప్పందినా చప్పుడు చేయలేదు. ఎన్నికల ముందు అలాంటి వారిని మార్చే సాహసం చేయలేదు. చివరకు ప్రజలే గేరు మార్చారు. కారును షెడ్డుకు పంపారు.
రాజకీయాల్లో పాఠాలు నేర్చుకోవడం విజ్ఞుల లక్షణం. నేర్చుకోనివారికి గుణపాఠం చెప్పడం ప్రజలకు అలవాటే. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోని కలుపుమొక్కలను నియంత్రించడం అత్యవసరం. కాంగ్రెస్ సంస్కృతి అంతే అని సర్దిచెప్పుకుంటే.. జనం వినరు. విషసంస్కృతికి వీడ్కోలు పలకాలి. లేనిపక్షంలో ప్రజలు మరోమారు నమ్మరు. ఎన్నో ఆశలతో ప్రజలు ఎన్నుకున్న రేవంత్.. ప్రజల మనిషిగా, కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాప్రభుత్వంగా కీర్తిప్రతిష్ఠలు సాధించాలంటే కఠినంగానే వ్యవహరించాలి. అవినీతి ఎమ్మెల్యేలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. అపరచాణక్యుడిగా ఖ్యాతిపొందిన కేసీఆర్‌నే ఢీకొట్టి పీఠమెక్కిన రేవంత్ వారిని కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ సంకల్పం చెప్పుకోవాలి. అందుకు సమయం ఇదే.