ఆంధ్రప్రభ స్మార్ట్, కరీంనగర్ :డబ్బావాలా నెట్ వర్క్ పేరు వింటే మొదట గుర్తుకొచ్చేది ముంబయి. ముంబయి మహానగరంలో దశాబ్దాల కిందట నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఈ సేవలకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ తరహాలోనే అనేక కంపెనీలు ఫుడ్‌ప్యాకెట్లు డోర్‌డెలివరీ సిస్టమ్ వ్యాపారాన్ని ప్రారంభించాయి. ఇంటి భోజనం తినాలనుకునే వారికి ఈ డబ్బావాలా నెట్వర్క్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి సేవలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి.
సుమారు 17 మంది ద్వారా అందుతున్న సేవలు
.కరీంనగర్లో సహస్ర డబ్బావాలా సేవలుఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు గజిబిజీ జీవితంతో ఒకరికొకరు సహాయం చేసుకునే సమయం కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆన్లైన్ ఆర్డర్లు, హోం డెలివరీలు పెరిగిపోయాయి. కొన్ని ఆన్లైన్ సర్వీసులు కేవలం హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డోర్డెలివరీలు మాత్రమే చేస్తున్నాయి. తాజాగా డబ్బావాలాలు కరీంనగర్ నగరంలోకి అడుగు పెట్టింది.
విద్యార్థులకు.. ఉద్యోగులకు ఉపయోగకరం
సహస్ర డబ్బావాలా సర్వీసు విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పొద్దున తయారు చేసిన భోజనం.. మధ్యాహ్నానికి చల్లగా అవుతున్నందున పిల్లలకు భోజనం చేయాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. కొంత మంది విద్యార్థులు తీసుకు వెళ్లిన లంచ్‌బాక్స్ అలానే వెనుక్కు తెచ్చేస్తున్నారు. ఉద్యోగులు కూడా ఉదయంపూట తీసుకు వెళ్లిన భోజనం తినలేక దగ్గర ఉన్న హోటళ్లపై ఆధారపడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు వారి ఇంటి నుంచి తెచ్చిన లంచ్ బాక్సులను భోజన సమయానికి 20 నిమిషాల ముందే డెలివరీ బాయిస్ అందిస్తున్నారు.
గృహిణులపై తగ్గుతున్న ఒత్తిడి..
.ఉదయం ఏడుగంటలకు వెళ్లే విద్యార్థులు, తొమ్మిది గంటలకు వెళ్లే ఉద్యోగుల కోసం లంచ్ తయారు చేయడానికి గృహిణులు తెల్లవారు జామున ఐదు గంట నుంచి వంటగదిలో కూర్చొవలసి వస్తుంది. ఆదరబాదరగా అందుబాటులో ఉన్న వాటితో వంట చేసి లంచ్ బాక్స్ కడుతున్నారు. ఈ సమయంలో గృహిణులు ఎంతో వత్తిడికి గురవుతున్నారు. డబ్బావాల సర్వీసు ప్రారంభమైన తర్వాత లంచ్ సమయానికి 20 నిమిషాల ముందు అందేవిధంగా బాక్స్ పంపిస్తున్నారు. దీనివల్ల తెల్లవారుజామున ఐదు గంటల నుంచే వంట గదికి పరిమితం కావలసిన అవసరం లేకపోవడంతో గృహిణులపై ఒత్తిడి తగ్గుతోంది
.కిచెన్ సెంటర్ నుంచి…
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులయితే వారికి వంట బాధ్యత లేకుండా ఈ సంస్థ కొత్త ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ ద్వారా లంచ్ సమయానికి శాకాహార భోజనాన్ని అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరితో పాటు వారి పిల్లలకు కూడా వేడివేడి లంచ్ బాక్స్ అందించేలా ప్యాకెజీని ప్రవేశపెట్టారు. అందుకోసం ఒక కిచెన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.
కరీంనగర్లో ఇలా…
కరీంనగర్ సిటీలో ఉరుకులు పరుగులు చూశానని, ఉదయం పాఠశాల ఏడు గంటలకు ప్రారంభమవుతుందని, అప్పుడు పట్టుకెళ్లిన ఆహారం మధ్యాహ్నం తినేసరికి చల్లగా అయిపోతుందని తాను గమనించినట్లు పెండ్యాల సాయి కృష్ణారెడ్డి (బిట్టు) తెలిపారు. ముంబయి, పుణేలో ఇలాంటి సేవలు ఉన్నాయని, ఇక్కడ కూడా ఇలాంటి సర్వీసు చేద్దామని తన సోదరుడుతో చర్చించానని చెప్పారు. రెండు నెలల కిందట ప్రవేశపెట్టిన ఈ సేవలపై ప్రజలు సంతృప్తి చెందుతున్నారన్నారు.