హైదరాబాద్, ఆంధ్రప్రభ: జేఈఈ మెయిన్ షెడ్యూల్ మారడంతో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ కూడా మారింది. ఈమేరకు ఎస్‌ఎస్సీ బోర్డు, ఇంటర్ బోర్డు వేరువేరుగా కొత్త షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించాయి. మారిన షెడ్యూల్ ప్రకారం మే 23 నుంచి జూన్ 1వరకు పదో తరగతి పరీక్షలు జరగనుండగా, మే 6 నుంచి 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45వరకు, ఇంటర్ పరీక్షలు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలను ఎన్టిdఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మార్చడంతో దాని ప్రభావం ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై పడింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్ష తేదీలను విద్యాశాఖ మార్చింది.
ఇంటర్ షెడ్యూల్‌ను ఇప్పటికే రెండు సార్లు మార్చగా, టెన్త్ షెడ్యూల్ ఒకసారి మారింది. ఇదిలా ఉంటే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మాత్రం మారలేదు. ముందుగా ప్రకటించిన విధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు ఏప్రిల్ 11, 12వ తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్ షెడ్యూల్ మొదటిసారి ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 20 నుంచి జరగాల్సి ఉండేది. అయితే జేఈఈ షెడ్యూల్ ప్రకటించడంతో ఇంటర్ పరీక్షల టైంటేబుల్ ఏప్రిల్ 22కు మారింది. జేఈఈ మెయిన్ షెడ్యూల్ మరోసారి మారడంతో ఇంటర్ షెడ్యూల్ కూడా మే 6కు మళ్లి మారింది. అదేవిధంగా పదో తరగతి పరీక్షలు కూడా మే 11 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సి ఉండేది, కానీ వాటి షెడ్యూల్ కూడా మారి మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొత్త టైంటేబుల్ ప్రకారం జరగనున్నాయి.
పదో తరగతి షెడ్యూల్ ఇలా…
మే 23న ఫస్ట్ లాంగ్వేజ్
24న సెకండ్ లాంగ్వేజ్
25న ఇంగ్లీష్
26న గణితం
27న సామాన్యశాస్త్రం(ఫిజికల్, బయోలాజికల్ సైన్స్)
28న సాంఘీక శాస్త్రం
30న ఓఎస్‌ఎస్‌సీ పేపర్-1(సంస్కృతం, అరబిక్)
31న పేపర్-2(సంస్కృతం, అరబిక్)
జూన్ 1న ఒకేషనల్