గుజరాత్ రిక్రూట్ మెంట్ పరీక్ష రద్ధయ్యిందని, ప్రశ్రపత్రాలు లీక్ కావడమే దీనికి కారణమని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సింఘ్వి తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, పరీక్షా పత్రాలు లీకయ్యాయని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ యువజన విభాగం చీఫ్ యువరాజ్ సిన్హ్ జడేజా ఆరోపించగా ప్రభుత్వం తొలుత దీన్ని ఖండించింది. కానీ, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.
గతంలో పరీక్షలకు అప్లై చేసుకున్న వారంతా వచ్చే ఏడాది మార్చిలో ఎగ్జామ్ రాయవచ్చని, వారి అర్హత వయస్సు ముగిసినప్పటికీ పరీక్షకు అనుమతిస్తామని హోంశాఖ సహాయ మంత్రి సంఘ్వి చెప్పారు. కాగా, ఈ కేసులో మరిన్ని అరెస్టులు, నగదు రికవరీ వంటి అవకాశం ఉందని, విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసుపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో పరీక్ష పత్రాలను లీక్ చేయడం లేదా వాటిని కొనుగోలు చేయడం వంటివి ఎవరూ చేయని విధంగా నిందితులకు శిక్ష పడాలని తాము నిర్ణయించుకున్నామని సింఘ్వి తెలిపారు.
న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా.. సొంత విచారణల ద్వారా.. గుజరాత్ సెకండరీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (GSSSB) 11 మంది వ్యక్తులపై సబర్‌కాంత జిల్లాలోని ప్రతిజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని సంఘ్వి చెప్పారు.