దేశంలో కరోనా రెండో దఫా విజృంభిస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే కొవిడ్ మహమ్మారిని అడ్డుకోవచ్చంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రం అండగా నిలవాలని మన్మోహన్ సూచించారు. అందులో భాగంగా నిధులు, రాయితీల రూపంలో ప్రోత్సాహం అందించాలన్నారు. ఏయే సంస్థల వద్ద ఎన్ని టీకాలు ఆర్డర్ చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. రానున్న ఆరు నెలల్లో ఎన్ని టీకాలు అందబోతున్నాయి.. అవి ఏయే రాష్ట్రాలకు ఎలా పంచనున్నారో కూడా ముందే తెలియజేయాలన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశామని చెప్పడం కాదు.. అసలు జనాభాలో ఎంత శాతం మందికి వేశామో చూసుకోవాలని ఆ లేఖలో మన్మోహన్ అన్నారు. అత్యవసర అవసరాల కోసం 10 శాతం వ్యాక్సిన్లు మాత్రమే కేంద్రం దగ్గర ఉండాలని, అసలు వ్యాక్సిన్ అవసరాలు రాష్ట్రాలకే తెలుసు కాబట్టి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను బట్టి వాళ్లు ప్లాన్ వేసుకుంటారని మన్మోహన్ లేఖలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement