మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పైన జరిగిన దాడిని ఆత్మ గౌవర దాడిగా పరిగణిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ఈటల రాజేందర్ తో కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గురువారం భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈటల విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశం అయ్యామని కోదండరాం తెలిపారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐక్య వేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరిగుతుందో చూడాలని కోదండరాం పేర్కొన్నారు.
ఈటల కుటుంబంపై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఒకవేళ ఈటల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. లేదా అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. ఇవేవీ చేయడానికి కేసీఆర్ ధైర్యం లేదా?అని అడిగారు. ఈటెల విషయంలో తామంతా ఆయనకు మద్దతుగా నిలుస్తామని కొండా స్పష్టం చేశారు.
మరోవైపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలకు మద్దతు ప్రకటించడం కీలక పరిణామంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు. వీరిద్దరూ కలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఈటల కొత్త పార్టీ పెడుతారా? బీజేపీలో చేరుతారా? అసలు ఈటల మనసులో ఏముంది? అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరకొందరు నేతలు కూడా కాషాయ గూటికి చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. స్వతంత్రంగానే ఉంటానని ఎవరితోనూ కలవబోనని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. హుజురాబాద్లో మళ్లీ పోటీచేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఉపఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీచేస్తానని స్పష్టం చేశారు. మద్దతు కూడగట్టేందుకే ఇతర పార్టీల నేతలను కలుస్తున్నట్లు వెల్లడించారు ఈటల రాజేందర్. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని.. ఊహాగానాలను నమ్మవద్దని కార్యకర్తలకు ఈటల సూచించారు.
ఇది కూడా చదవండి :బాలలపై 100 శాతం సమర్థతతో పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్!