Tuesday, November 26, 2024

Kerala: మెగ‌సెసే అవార్డును తిర‌స్క‌రించిన కేర‌ళ మాజీ మంత్రి.. ఎందుకో తెలుసా?

కేర‌ళ మాజీ హెల్త్ మినిస్ట‌ర్‌, సీపీఎం సీనియ‌ర్ మ‌హిళీ లీడ‌ర్ అయిన కేకే శైల‌జ ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. రామ‌న్ మెగ‌సెసే అవార్డును తిర‌స్క‌రించ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది. రాజ‌కీయ కోణంలో బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే పార్టీ పెద్ద‌ల‌తో డిస్క‌స్ చేసిన త‌ర్వాత‌నే ఆ అవార్డును శైల‌జ తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది.

రామ‌న్ మెగ‌సెసే అవార్డును ఆసియా నోబెల్‌గా పిలుస్తారు. 1957లో స్థాపించిన‌ రామన్ మెగసెసే అవార్డు ఆసియా అత్యున్నత పురస్కారం. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు అందిస్తుంటారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇంత గొప్ప పుర‌స్కారం వ‌స్తే ఎగిరి గంతేస్తారు. కానీ, కేర‌ళ మాజీ మంత్రి, సీపీఎం సీనియ‌ర్ నేత కేకే శైల‌జ మాత్రం దాన్ని సున్నితంగా తిర‌స్క‌రించారు. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు..

రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ ఏడో అధ్య‌క్షుడు. ఆ దేశంలో కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. అందుకే ఆయన పేరుతో ఉన్న అవార్డును స్వీకరించడం లేదని కేకే శైలజ వెల్లడించారు. ఇదొక ఎన్జీవో ఇస్తున్న‌ద‌ని, ఇంత‌వ‌ర‌కూ రాజ‌కీయ నాయ‌కులెవ‌రికీ ఇవ్వ‌లేద‌ని శైల‌జ తెలిపారు. ఈ పురస్కారంపై వ్యక్తిగతంగా తనకు పెద్ద‌గా ఆసక్తి కూడా లేదన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన కేకే శైలజ.. ఆ పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాతే ఈ అవార్డును తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. నిపా వైరస్, కొవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న కాలంలో కేకే శైలజ.. కేరళ ఆరోగ్య మంత్రిగా చేసిన సేవ‌ల‌కుగానూ 64వ మెగసెసే అవార్డుకు ఆమె పేరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement