Thursday, November 21, 2024

రేవంత్ వల్లే చంద్రబాబు నాశనం.. ఆత్మహత్య చేసుకుంటాః మాజీ మంత్రి మోత్కుపల్లి

తెలుగు దేశం పార్టీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి మోత్కుపల్లి ఆరోపించారు. ఆయన వల్లే చంద్రబాబు నాశనమయ్యారని వ్యాఖ్యానించారు. రేవంత్ జీవితమంతా మోసాలు, బ్లాక్ మెయిలింగే అని విమర్శించారు. దళితబంధు పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. దళితులు కులవివక్షకు గురై మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. వారివి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులని చెప్పారు. గ్రామాల్లో దళితులు గతంలో రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.

దళిత బంధు పథకం అమలుతో సీఎం కేసీఆర్ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా పని చేసినా.. దళితుల కోసం ఎవరూ స్పందించలేదని చెప్పారు. దళితుల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని తనను విమర్శిస్తున్నారని అన్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తామని మోత్కుపల్లి చెప్పారు. తెలంగాణలో దళితబంధు పథకం.. వంద శాతం అమలు కాకపోతే యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకాన్ని వంద శాతం అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మాటల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు. సీఎం ప్రకటించినట్లే చేస్తారనే నమ్మకం తనకు ఉందని.. ఒకవేళ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు.

ఇది కూడా చదవండిః ఏడేళ్లలో దళితులకు ఏం చేశారు ?: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ప్రవీణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement