Saturday, November 23, 2024

వరుస భేటీలతో ఈటల బిజీబిజీ… ప్లాన్ ఏంటి?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి ఈటల వరుసగా వివిధ పార్టీల నేతలో భేటీ అవుతున్నారు. నిన్న సీఎల్పీ నేట భట్టితో భేటీ అయినా ఈటల తాజాగా మరో సీనియర్ నేతతో భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీ గంటన్నరకు పైగా సాగింది. డీఎస్‌తో ఈటల గంటన్నర పాటు చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.  భేటీ ముగిసిన సమయంలో అక్కడికి వచ్చిన డీఎస్ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్‌తో కూడా ఈటల కలిసి మాట్లాడారు.  అరవింద్‌తో ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే వరుసగా కాంగ్రెస్ నేతలతో మాజీ మంత్రి ఈటల సమావేశమవుతున్నారు. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించారు.

ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. అయితే వరుసగా కాంగ్రెస్, బీజేపీ నేతలతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డిలతో కూడా ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈటల నెక్ట్స్ ఏంటి? అనేది సస్పెన్స్ గా మారింది.

ఇదీ చదవండి: ఈటల అనుచరులపై గంగుల ఫోకస్!

Advertisement

తాజా వార్తలు

Advertisement