టీఆర్ఎస్ పార్టీలో తనకే కాకుండా మంత్రి హరీశ్ రావుకు కూడా గ్యాప్ వచ్చిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తనకు తెలుసని చెప్పారు. హరీశ్ కు కూడా అవమానం జరిగిందని తెలిపారు. ఐదేళ్ల క్రితమే టీఆర్ఎస్ తో, ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందని ఈటల పేర్కొన్నారు. కుక్కిన పేనులా ఉండకపోవడం వల్లే తనపై టీఆర్ఎస్ హైకమాండ్ కు కోపం వచ్చిందని మాజీ మంత్రి ఈటల అన్నారు. నీచపు వార్తలతో ప్రజలకు తనను దూరం చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రజలు అహింసాయుతంగా నిరసన తెలిపే ధర్నాచౌక్ ను కూడా ఎత్తేసిన ఘనత కేసీఆర్ దని మండిపడ్డారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని… బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల గుర్తు చేశారు. ఆర్టీసీ యూనియన్ ను తాను, హరీశ్ రావు పెట్టిస్తే, ఇప్పుడు అది కవిత ఆధ్వర్యంలో ఉందని దుయ్యబట్టారు. మంత్రుల మీదే నమ్మకం లేని కేసీఆర్ కు… నాలుగు కోట్ల ప్రజలను పాలించే హక్కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. సమ్మెలు చేయకుండా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు.
ఆర్థిక మంత్రిగా తాను ఉన్నప్పుడు తాను చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. ట్యాక్స్ పే చేసే వారికి రైతుబంధు ఇవ్వొద్దని తాను చెప్పానని, అలాంటి వారికి ఇచ్చినా ఉపయోగం ఉండదని తెలిపానని చెప్పారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం తన తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు. మంత్రులు డమ్మీలుగా మారారని… ఆర్థికశాఖ సమీక్షల్లో ఆర్థిక మంత్రి కూడా ఉండని పరిస్థితి ఉందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఏమొచ్చిందని ఈటల ప్రశ్నించారు. తన అనుచరులను కూడా టీఆర్ఎస్ పార్టీ బెదిరించిందని… అయినా వారు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని వదులుకోరని, తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటిస్తానని ఈటల చెప్పారు.