ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ కాదు బానిస భవన్ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిని కలవడానికి నేను గతంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి వెళితే గేటు వద్దే మమ్మల్ని ఆపేశారు. ఈ విషయం మీడియాకు తెలిస్తే మా పరువు పోతుందని వారికి చెప్పాం. రెండోసారి అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లాము. అప్పుడు కూడా గేటు వద్ద నుంచే వెనుదిరిగాము. బానిస కంటే నీచంగా మంత్రి పదవి ఉంది. ఎంపీ సంతోష్ కుమార్ తో నేను అప్పట్లో చెప్పాను. దీనికి ప్రగతి భవన్ అని కాకుండా బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని అన్నాను’ అని ఈటల రాజేందర్ తెలిపారు.
”విజయశాంతి, ఆలె నరేందర్, కోదండరామ్‌ను కూడా ఇలాగే బయటకు పంపించారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు అన్నది సీఎం కేసీఆర్ భావన. మంత్రులు ఎవరూ స్వేచ్ఛగా చేయలేరు. ఐఏఎస్ అధికారులు కూడా బాధతోనే పనిచేస్తున్నారు. నేటికి సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ లేరు” అని ఈటల తెలిపారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించానని తనమీద ఆరోపణలు చేశారని అన్నారు. తాను సంక్షేమ పథకాలను వద్దనలేదని, కానీ, రైతు బంధు పథకం కింద ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి నగదు సహాయం ఇవ్వొద్దని చెప్పానని అది తప్పా? అని నిలదీశారు. ‘’బెంజి కారులో వచ్చి లక్షలు లక్షలు తీసుకుని పోయే వాళ్లను చూస్తే పేద రైతుల పరిస్థితి ఎలా ఉంటుందని అడిగాను. ఉద్యమానికి ప్రజా సంఘాలు అండగా నిలబడ్డాయి. ధర్నా చౌక్ వేదికగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇందిరా పార్క్‌లో ఎన్నో ఉద్యమాలు చేశాం. కానీ ఇప్పడు ధర్నాచౌక్‌ను ఎత్తేసిన చరిత్ర వాళ్లది. ఇవన్నింటినీ మేం అడగకూడదా? ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకూడదా? ఆనాడు సంఘాలు కావాలి.. ఇప్పుడు అక్కర్లేదా?’’ అని ఈటల ప్రశ్నించారు.
వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే..రెండు నెలల వరకూ పట్టించుకోలేదని విమర్శించారు. బొగ్గ గని కార్మిక సంఘంలో ఆ సంఘానికి చెందిన నేతలు ఎవరూ లేరు. ఆయన కూతురు కవిత దాన్ని నడుపుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులకు కార్మికులతో ఎలాంటి సంబంధాలుంటాయి? ఆర్టీసీ, సింగరేణి, ఎలక్ట్రిసిటీ సంఘాల్లో అంతా కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉన్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచాను అని ఈటల అన్నారు.
”తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవలం ఏడుగురే. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని ఆయన అన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు. తెలంగాణ కోసం పార్టీ ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ఆదేశించినా నేను రాజీనామా చేశాను. టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చినంత మాత్రాన అందరూ గెలవరు. కేసీఆర్‌కు కూతురుకు బీఫామ్ ఇచ్చినా నిజామాబాద్‌లో గెలవలేదు. నేను మాత్రం ఇప్పటి వరకు ఓడిపోలేదు. కేసీఆర్ తనకు మందులు అందించేందుకు సంతోష్‌ను రాజ్యసభ పదవి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను కలవకుండా తనన మూడు సార్లు అడ్డుకున్నారు. తాను మంత్రినని.. ఇంత దారుణంగా ఉంటుందా? అని ఓసారి ప్రశ్నించాను” అని ఈటల వివరించారు.
”రెండేళ్లుగా చాలా మందికి పెన్షన్‌లు వస్తలేవు. సర్పంచ్, ఎంపీటీసీలు నా వద్దకు వచ్చారు. కానీ ‘ఖచ్చితంగా నేను చేస్తా’.. అని చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రికి చెబుతా..అని మాత్రమే చెప్పారు. తెలంగాణలో మంత్రుల పరిస్థితి ఇది. విద్యుత్, నీళ్ల సమస్య తీరిందని చెబుతున్నారు. కానీ గ్రామాలు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే. కొట్లాడితే వచ్చేది హక్కు. ఎవరి దయాదాక్షిణ్యాలతో మంత్రి పదవి రాలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చింది” అని ఈటల వ్యాఖ్యానించారు.