మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై రాష్ట్ర రాజకీయాలు మరింత హాట్‌గా మారాయి. ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఈటలతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్జార్జి తరుణ్ ఛుగ్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి హుజూరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల భేటీ కానున్నారు. అనంతరం బీజేపీలో చేరే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈటల రాజీనామా చేయబోతున్నారు. ఐదారు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురయిన తర్వాత వివిధ సంఘాలు, పలు రాజకీయ పార్టీలతో వరుసగా భేటీ అయిన ఈటల… చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ స్థాపించిన తరువాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడించారు ఈటల. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్ వెంట నడిచిన కొద్ది మందిలో ఈటల ఒకరు. బీసీ నాయకుడిగా పార్టీలో అనతికాలంలోనే ఎదిగిన ఆయన కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా ప్రతి కీలక ఘట్టంలో కొనసాగారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ కేబినెట్ లో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. 2018లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీపై పలు వేదికల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అనూహ్యంగా ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడం. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ కావడం, మంత్రివర్గం నుంచి తొలగించడం అన్ని చకచక జరిగిపోయాయి. దీంతో పార్టీతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధం తెంచుకున్నారు. తనకు పదవి కంటే ఆత్మగౌవరమే ముఖ్యమని ఈటల తేల్చి చెప్పారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటల త్వరలో పదవికి రాజీనామా చేయనున్నారు. అనంతరం జరిగే ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. మరి బీజేపీలో ఈటలకు ఎలాంటి గౌవరం లభిస్తోందో చూడాలి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవీ..